CM Chandrababu Naidu: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:33 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకారంతో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీని ఏఐ, డీప్ టెక్నాలజీ హబ్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే, గ్రీన్ ఎనర్జీ, భారత ఆర్థిక వ్యవస్థ, ఐటీ అభివృద్ధి గురించి ప్రస్తావించారు.

10 లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.5 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
కొత్త ఆవిష్కరణలతో భారత్ పరివర్తన
ఏఐ, డిజిటల్ పురోగతిలో ముందున్నాం
ఐఐటీ మద్రా్‌సలో చంద్రబాబు ప్రసంగం
విద్యార్థులతో ఉత్సాహంగా గడిపిన సీఎం
కరతాళ ధ్వనులు, హర్షాతిరేకాల మధ్య
ఇంగ్లిష్, తెలుగులో ప్రసంగించిన బాబు
ఐఐటీ మద్రా్‌సతో కలిసి ఏర్పాటు చేస్తాం
ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ విప్లవం
‘‘అభివృద్ధి సాధించాలంటే సుస్థిర పాలన అవసరం. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ విధానం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ఏఐ వినియోగాన్ని మేం మరింతగా ప్రోత్సాహిస్తాం. ఏపీని ఇన్నోవేషన్‌కు కేంద్రంగా మారుస్తాం. భావనలకు కచ్చితమైన వాస్తవరూపం ఇవ్వగలవారికి (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్- పీవోసీ) అవకాశాలను కల్పిస్తున్నాం. సరైన నాయకత్వంతోనే సాంకేతికత అభివృద్ధి చెందుతుంది’’
- సీఎం చంద్రబాబు
చెన్నై, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకారంతో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చెన్నైలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్’ (ఐఐటీఎం)లో శుక్రవారం జరిగిన ‘ఆలిండియా రిసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025’లో ఆయన మాట్లాడారు. ఐఐటీఎంలో ఆద్యంతం చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. విద్యార్థులు సైతం ‘జై బాబు.. జైజై బాబు’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ, ఆయన ప్రసంగం సమయంలో హర్షధ్వానాలతో హోరెత్తించారు. ఏపీని ఏఐ, డీప్ టెక్నాలజీ హబ్‌గా మార్చుతానని విద్యార్థుల కరతాళధ్వనుల మధ్య చంద్రబాబు ప్రకటించారు. ‘‘దేశంలో 65 శాతం మంది ఏఐ వినియోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 30 శాతం కన్నా అధికం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలో విద్యార్థులు ముందుండాలి’’ అని ఆయన సూచించారు.
1991 ఆర్థిక సంస్కరణల ప్రభావాన్ని గుర్తు చేస్తూ.. ‘‘సంస్కరణలు భారత ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆర్థిక సంస్కరణలతో చైనా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. టెలికాం రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు బీఎ్‌సఎన్‌ఎల్, వీఎ్‌సఎన్‌ఎల్ ఆధిపత్యం ఉండేది. సంస్కరణలు రావడంతో ప్రైవేటు సంస్థలు కూడా టెలికాం రంగంలోకి వచ్చాయి. ఇదొక గేమ్ చేంజర్ అయింది. ప్రస్తుతం ప్రపంచం చూపు మనదేశం వైపు మళ్లింది. రాబోయే రోజులన్నీ భారత్‌వే.’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
గట్టి కృషి చేస్తే మనమే నం.1
‘‘1995లో సీఎం అయ్యాక బిల్‌గేట్స్‌ను కలిసేందుకు ప్రయత్నించాను. అయితే, రాజకీయ నేతలతో ఆయనకు సత్సంబంధాలు లేవు. కలవడం కుదరదని ఆయ న తిరస్కరించారు. అయినా నేను గట్టిగా ప్రయత్నిం చి, భేటీకి ఆయనను ఒప్పించి దాదాపు 45 నిమిషాలు మాట్లాడాను. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ పె ట్టాలని బిల్‌గేట్స్‌ను ఆనాడు కోరాను. ఇప్పుడు అదే మైక్రోసా్‌ఫ్టకు తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్నారు. 2014లో భారత్ పదో ఆర్థిక వ్యవస్థగా ఉండేది. అది ఇప్పుడు ఐదవ స్థానానికి ఎగబాకింది. మనమంతా గట్టి కృషి చేస్తే ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది’’.
అక్కడ తెలుగు, తమిళులే అధికం..
‘‘భారత్‌కు జనాభా గొప్ప వరంలాంటిది. మన దేశానికి ఇంకో నలభయ్యేళ్లదాకా జనాభా సమస్య ఉండదు. దక్షిణ భారతదేశంలో కూడా జనాభాను పెంచాల్సి వుంది. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం మన దేశీయులదే. అక్కడి ధనిక ప్రాంతాల్లో తెలుగు, తమిళ వాసులే అధికంగా ఉన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారతీయులు ముందుంటారు. అందుకే సిలికాన్ వ్యాలీ, నాసా, వాల్‌స్ట్రీట్‌లలో మనవారిదే ఆధిపత్యం’’.
గ్రీన్ ఎనర్జీలో మనదే అగ్రస్థానం
‘‘గ్రీన్ ఎనర్జీలో ఏపీ ఆధిపత్యాన్ని సాధించింది. ఈ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. భవిష్యత్తులో ఏపీ రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. భారత్ మొత్తం 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో 160 గిగావాట్లు ఒక్క ఏపీలోనే ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి 7.5 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ స్థాపిస్తోంది. రిలయన్స్ బయో ఎనర్జీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడుతోంది. రాబోయే రెండేళ్లలో 20 లక్షల ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేస్తున్నాం.’’ అని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐటీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి చంద్రబాబును పరిచయం చేస్తూ....సైబరాబాద్ అభివృద్ధికి దార్శనికుడని అభివర్ణించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానిమచ్చారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..