Share News

Coastal AP Farmers: ముంచిన అకాల వర్షం

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:05 AM

అకాలవర్షం కోస్తా ప్రాంతంలోని రైతులను తీవ్రంగా ముంచింది. అనూహ్యంగా వచ్చిన వానతో ధాన్యం తడిసిపోయి, మామిడికాయలు నేలరాలాయి, మొక్కజొన్న పంటలు నష్టపోయాయి. కోస్తాలో పలు జిల్లాల్లో ఎడుగులు, పిడుగులతో వర్షాలు కురిశాయి

Coastal AP Farmers: ముంచిన అకాల వర్షం

  • కోస్తాలోని పలు జిల్లాల్లో జోరు వాన.. పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులు

  • తడిసిన వరి పనలు.. రాలిన మామిడి.. అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం

  • కాకినాడ జిల్లాలో అత్యధికంగా 56.25 మి.మీ.వర్షపాతం

  • మరో 2 రోజులు మోస్తరు వర్షాలు.. అదే సమయంలో వేడి పెరిగే అవకాశం

  • జాగ్రత్తగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ

విశాఖపట్నం/అమరావతి/పిఠాపురం/గొల్లప్రోలు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): అకాలవర్షం కోస్తా ప్రాంతంలోని రైతులను నిండా ముంచింది. అనూహ్యంగా వచ్చిన వానతో పలు చోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. మామిడికాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట నేలనంటింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకళ్లెదుటే వర్షార్పణం అవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకూ ఉపరితలద్రోణి విస్తరించింది. దీనికి తోడు శనివారం రాష్ట్రంలో అనేకచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. అదే సమయంలో సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీచాయి. వీటన్నింటి ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని కోస్తాలో పలుచోట్ల ప్రధానంగా ఉత్తరకోస్తాలో శనివారం మధ్యాహ్నం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా వడగళ్లు పడ్డాయి. ఈదురుగాలులకు పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. జీడిమామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.


తడిచిన ధాన్యం రాశులు..

కాకినాడ జిల్లాతో పాటు అల్లూరి జిల్లాలో వీచిన ఈదురుగాలులకు చెట్లు పడిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ధాన్యం రాశులు నీటిలో తడిచి ముద్దయ్యాయి. మిల్లులకు తరలించాల్సిన పంట కళ్లెదుటే వర్షార్పణం అవ్వడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, ఉప్పాడ ప్రాంతాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల వెంబడి ధాన్యాన్ని ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల్లో వరి పనుల నీట మునిగాయి. కిర్లంపూడిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలన్నీ ఉప్పొంగాయి. కాకినాడ జిల్లా వేలంకలో 56.25, ఏలేశ్వరంలో 48.5, కిర్లంపూడిలో 46.8, కోటనందూరు 45.25, అనకాపల్లి, నర్సీపట్నంలో 44.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 20 మిల్లీమీటర్లకుపైగా వాన పడింది.


నేడు, రేపు మోస్తరు వర్షాలు

వాతావరణ అనిశ్చితి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఆది, సోమవారాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ హెచ్చరించాయి. అకాల వర్షాలు, పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరోవైపు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. శనివారం అనకాపల్లి జిల్లా మాడుగులలో 39.8, నంద్యాల జిల్లా గోనవరం, శ్రీకాకుళం జిల్లా పొందూరులో 39.7, పల్నాడు జిల్లా రావిపాడులో 39.6, చిత్తూరు జిల్లా నగరి, కర్నూలు జిల్లా సాతనూరు, ప్రకాశం జిల్లా పునుగోడు, కడప జిల్లా వేమనపురంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


ఇవి కూడా చదవండి

YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో

Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 03:10 AM