Share News

Adilabad: వాయుసేన, పౌర విమానయాన సేవలకు సిద్ధంగా ఆదిలాబాద్‌ విమానాశ్రయం

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:23 AM

ఆదిలాబాద్‌లో రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలియజేశారు.

Adilabad: వాయుసేన, పౌర విమానయాన సేవలకు సిద్ధంగా ఆదిలాబాద్‌ విమానాశ్రయం

  • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వినతికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ స్పందన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లో రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలియజేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వినతికి రాజ్‌నాథ్‌సింగ్‌ లేఖ ద్వారా స్పందించారు. ఆదిలాబాద్‌ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీంతోపాటు పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నామని రాజ్‌నాథ్‌సింగ్‌ కిషన్‌రెడ్డికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. కొంతకాలంగా స్థానిక ప్రజలు, నాయకుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను వ్యక్తిగతంగా కలిసి ఆదిలాబాద్‌ విమానాశ్రయానికి సంబంధించిన భూములను ప్రజావసరాలకు వినియోగించుకునేలా చొరవ తీసుకోవాలని విన్నవించానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని కిషన్‌రెడ్డి తెలిపారు.


ఆదిలాబాద్‌ విమానాశ్రయం ఏర్పాటుపై రాష్ట్రప్రభుత్వం సహకరిస్తే విమానయాన సేవలను ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. 2021లో నాటి పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినప్పటికీ గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ నుంచి స్పందన కరువైందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఆదిలాబాద్‌లో గతంలోనే విమానాశ్రయం ఉండేది. దాన్ని సైనిక అవసరాల కోసం మాత్రమే వినియోగించేవారు. కాలక్రమేణా వివిధ కారణాలతో రక్షణశాఖ కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి.

Updated Date - Apr 06 , 2025 | 04:23 AM