Share News

Corruption : రైతుబజార్లలో రాజకీయాలు!

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:05 AM

రైతుబజార్లలో రాజకీయ ప్రమేయం పెరుగుతోంది. కొన్నిచోట్ల రాజకీయ నాయకుల అండతో కొందరు ఉద్యోగులు వ్యాపారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Corruption : రైతుబజార్లలో రాజకీయాలు!

  • మూడేళ్లుగా పూర్తికాని ఉద్యోగుల బదిలీలు

  • అధికారుల వ్యక్తిగత పనుల్లో సిబ్బంది

  • దుకాణాల కేటాయింపుల్లో ఇష్టారాజ్యం

  • ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రైతుకు నష్టం లేకుండా వినియోగదారులకు సరైన ధరలకు కూరగాయలు అందించే లక్ష్యంతో రాష్ట్రంలో ఏర్పాటైన రైతుబజార్లలో రాజకీయ ప్రమేయం పెరుగుతోంది. కొన్నిచోట్ల రాజకీయ నాయకుల అండతో కొందరు ఉద్యోగులు వ్యాపారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దుకాణదారుల నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయినా.. వసూళ్లపై దృష్టి సారించడం లేదు. ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలోనే రూ.20 లక్షలపైగా బకాయిలు వసూలు కావాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. షాపుల కేటాయింపు విషయంలో మాత్రం రాజకీయ నాయకుల సిఫారసులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా చోట్ల రైతుబజార్ల బయట వరకు అనధికారికంగా దుకాణాలకు అనుమతిస్తున్నారు. చివరికి రైతుబజార్లలో పారిశుధ్య పనులకు పన్ను వసూలు చేస్తున్న సిబ్బంది వాటిలో కొంత సొమ్ము జేబులో వేసుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో రైతుబజార్ల నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. కొందరు అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. రైతుబజార్లలో ఖాళీగా ఉన్న షాపులకు వేలం నిర్వహించాల్సి ఉన్నా ఆ పని చేయడం లేదు. దీంతో షాపుల ద్వారా వచ్చిన డబ్బుతోనే జీతాలు ఇవ్వాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఏటా రైతుబజార్ల నుంచి రూ.13 కోట్లు దాకా ఆదాయం వస్తోంది. అయినా సిబ్బందికి జీతభత్యాలు అరకొరగానే ఇస్తున్నారు. గత ప్రభుత్వం రైతుబజార్ల సిబ్బందికి పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచకపోవడంతో వారు ఇలా అక్రమాలకు తెరదీస్తున్నారని, అద్దెల కేటాయింపులకు వేలల్లో ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.


రైతుబజార్లలో స్థాయిని బట్టి సిబ్బంది ఉండగా, కొందరు సిబ్బందిని జిల్లా అధికారుల దగ్గర సొంత పనులకు వినియోగిస్తున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో 10 మందికిపైగా సిబ్బంది ఈ విధంగా పని చేస్తున్నారని తెలిసింది. దీని వల్ల రైతుబజార్లలో మిగిలిన సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. ఎన్టీఆర్‌ జిల్లాలో రైతుబజార్ల ఎస్టేట్‌ ఆఫీసర్లను మాత్రమే బదిలీ చేశారు. మిగతా జిల్లాల్లో ఎస్టేట్‌ ఆఫీసర్ల బదిలీలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. అక్కడ కింది స్థాయి సిబ్బందిని మాత్రం బదిలీ చేయలేదు. విజయవాడలో ఒక ఎస్టేట్‌ ఆఫీసర్‌ను హెడ్‌ ఆఫీ్‌సకు సరెండర్‌ చేసి, తిరిగి వేరే చోట పోస్టింగ్‌ ఇచ్చారు. బదిలీల విషయంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. రాజకీయ నాయకులు చెప్పిన వారికి పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఒకే చోట మూడేళ్లు దాటినా చాలా మంది సిబ్బందిని బదిలీ చేయడం లేదు. మరోవైపు మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రైతుబజార్ల సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రైతుబజార్లకు సంబంధించి, కొన్ని వ్యవహారాలను జాయింట్‌ కలెక్టర్లకు అధికారాలు అప్పగించినా.. చాలా చోట్ల జేసీల పర్యవేక్షణ లోపించింది. గత ప్రభుత్వంలో నిర్మించిన కొత్త రైతుబజార్లును ఇంత వరకు ప్రారంభించలేదు. సంచార రైతుబజార్లు ఇటీవల ప్రారంభించి, మళ్లీ కొన్ని పక్కన పెట్టేశారు. మార్కెటింగ్‌ అధికారుల బదిలీలు జరగకపోవడంతో కొందరు అధికారులు జిల్లా, రాష్ట్ర ప్రధాన కార్యాలయాల్లో ఏళ్ల తరబడి తిష్ట వేసి పైరవీలు సాగిస్తున్నారు. నాడు-నేడు పథకం కింద గత వైసీపీ ప్రభుత్వంలో రూ.వందల కోట్లలో పనులకు టెండర్లు పిలిచారు. ప్రభుత్వం మారిన తర్వాత వాటి గురించి పట్టించుకున్న నాథుడే లేడు.


ఈ వార్తలు కూడా చదవండి

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 03 , 2025 | 04:05 AM