Share News

రామేశ్వరం మెట్టలో..పాపాల ద్వారం!

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:39 AM

గత వైసీపీ ఐదేళ్ల పాలనకు పై చిత్రం ఒక నిదర్శనం.. ఉమ్మడి జిల్లాలో చాలా కొండలది ఇదే పరిస్థితి.. కన్నుపడితే చాలు ఖాళీ చేసేశారు.. కొండలను మింగేశారు.

రామేశ్వరం మెట్టలో..పాపాల ద్వారం!
వైసీపీ పాపాల పుట్ట.. ఈ మెట్ట : ఎటు చూసినా రామేశ్వరం మెట్టంతా ఇలా గుల్లగుల్ల చేశారు. (ఫైల్‌)

నాడు రెచ్చిపోయిన మాఫియా

అక్రమంగా మట్టి, గ్రావెల్‌ తవ్వకం

823 ఎకరాలు గుల్లగుల్ల

లక్షల క్యూబిక్‌ మీటర్ల తరలింపు

19న ఎన్‌జీటీ కోర్టులో కేసు

కాకినాడ కీలక నేత కనుసన్నల్లో దందా

రిజర్వు ఫారెస్టు మింగేసిన వైనం

రూ.250 కోట్ల రాయల్టీ ఆదాయానికి గండి

కాకినాడ/ఆంధ్రజ్యోతి

గత వైసీపీ ఐదేళ్ల పాలనకు పై చిత్రం ఒక నిదర్శనం.. ఉమ్మడి జిల్లాలో చాలా కొండలది ఇదే పరిస్థితి.. కన్నుపడితే చాలు ఖాళీ చేసేశారు.. కొండలను మింగేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. ఇదెక్కడో మారుమూల కాదు.. పెద్దాపురం రామేశం మెట్ట.. ఏకంగా 823 ఎకరాల్లో ఉన్న కొండ నేడు ఇలా తయారైంది.. గత ఐదేళ్లలో ఈ కొండను గుల్ల చేసి వేల కోట్లు దందా చేశారు.. ఎన్‌జీటీ దృష్టి సారించడంలో పాపాల ద్వారాలు తెరుచుకోనున్నాయి.. అక్రమార్కుల భరతం పట్టే సమయం ఆసన్నమైంది. పెద్దాపురం రామేశ్వరం మెట్ట అక్రమ తవ్వకా లపై అక్రమార్కులకు ఉచ్చు బిగుస్తోంది. ఇన్నేళ్ల పాటు యథేచ్ఛగా 823 ఎకరాల్లో కొండలను గుల్ల చేసి గ్రావెల్‌ తవ్వుకుపోయి వందల కోట్లు సంపాదించిన నేతలు, అధికారులపై ఎన్‌జీటీ రూపంలో భారీ షాక్‌ తగలబోతోంది. ఇక్కడ వేల కోట్ల దందాపై చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ దృష్టి సారించింది. దీంతో అక్రమా ర్కులు, వారికి కొమ్ముకాసిన అధికారులు ఇరు క్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

కొండలు గుల్ల గుల్ల

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, కోనసీమ, యానాం తదితర ప్రాం తాల్లో రియల్‌ఎస్టేట్‌, రహదారుల నిర్మాణ అవ సరాలకు మట్టి, గ్రావెల్‌కు భారీ డిమాండ్‌ ఉం డేది. రామేశం మెట్టలో తవ్విన కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి, గ్రావెల్‌ను ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో చదును కోసం అమ్మని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ లేదు. వేల టిప్పర్ల మట్టి, గ్రావెల్‌ను కాకినాడలోని కీలక వైసీపీ నేత తన అనుచరుల ద్వారా విక్రయించి సంపాదించిన కోట్లకు లెక్కేలేదు. అప్పటి సర్కారులో ముఖ్య నేతకు అతి సన్నిహితమైన వ్యక్తి కావడంతో ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. పేదల ఇళ్ల స్థలాల చదును ముసుగులో అప్పటి తన సామాజిక వర్గ కలెక్టర్‌ సహకారంతో సదరు కీలక నేత అనుమతులు తీసుకుని ఇక్కడున్న కొండలు, గుట్టలను ఖాళీ చేసి వందల కోట్లకు పడగలెత్తారు. గనులశాఖ అధికారులంతా ఐదేళ్లపాటు అడ్డుకో కపోవడంతో పెద్దపెద్ద కొండలన్నీ కరిగిపోయా యి. 823 ఎకరాల మెట్టంతా మింగేసి సగానికి పైగా భూములను సదరు వైసీపీ అక్రమార్కు లు లోయలుగా మార్చేసినా జిల్లా గనుల శాఖ మౌనమే వహించింది. కొన్ని భూములను ప్రభు త్వం స్థానిక ఎస్సీ రైతుల సాగు కోసం అసైన్డ్‌ భూముల కింద కేటాయించింది. వీటిని ఎకరాకు రూ.10 లక్షలు చొప్పున చెల్లించి ఇరవై అడుగుల లోతుకు మట్టి, గ్రావెల్‌ తరలించుకుపోయారు. వందల ఎకరాల అసైన్డ్‌ భూములను లీజుకు తీసుకుని లోయలుగా మార్చేసినా రెవెన్యూశాఖ సైతం కన్నెత్తి చూడలేదు. ఈ రెండు శాఖలు ఉమ్మడిగా సర్వే చేసి తవ్వి తరలించుకుపోయిన కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి సంగతి తేల్చుతా మని ప్రగల్బాలు పలికి సర్వే జోలికి వెళ్లలేదు. కరెంటు స్తంభాలైతే అడుగు నుంచీ గాల్లో వేలాడుతున్నాయి. ఇక్కడ నుంచి తరలిపోయిన కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టికి గనులశాఖకు రూ.250 కోట్లకుపైనే రాయల్టీకి గండిప డింది. అయినా జరిమానా విధించే సాహసం చేయడం లేదు. అక్రమ తవ్వకాలపై స్పందనలో ఫిర్యాదులు చేసినా అవన్నీ బుట్టదాఖలయ్యాయి. ప్రస్తుతం ఎన్‌జీటీని ఆశ్రయించడంతో కదలిక వచ్చింది.

823 ఎకరాల్లో .. మింగేశారు!

పెద్దాపురం, గండేపల్లి మండలాల్లో 823 ఎకరాల్లో కొండలు, గుట్టలు విస్తరించి ఉన్నాయి. సర్వే నెంబరు 1 నుంచి 90 వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని రామేశ్వరం మెట్టగా పిలుస్తారు. మధ్యలో కొంత ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ కూడా ఉంది. ఇందులో జింకలు, దుప్పిలు, లేళ్లు ఇతర వన్యప్రాణులెన్నో ఉన్నాయి. కాకినాడకు సమీపంలో ఉన్న ఈ కొండలు, గుట్టల్లో నిక్షిప్తమై ఉన్న గ్రావెల్‌పై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ వైసీపీ కీలక నేత ద్వారంపూడి కన్ను పడింది. అంతే రామేశం మెట్టను గుల్ల చేసేశారు. 823 ఎకరాల్లో కొండలను మింగేసి మట్టి,గ్రావెల్‌ కోసం కొండల కింద భూమిని సైతం లోయలుగా మార్చేశారు. అప్పటి కాకినాడ వైసీపీ కీలక నేత ద్వారంపూడి, ఆయన మనుషులు సాగించిన దోపిడీ పర్వం విలువ వందల కోట్లుపైనే. అయితే అప్పట్లో సదరు నేతకు భయపడి కలెక్టర్‌ నుంచి జేసీ వరకు గనుల శాఖ నుంచి రెవెన్యూ శాఖ వరకు అన్నీ సాగిలపడ్డాయి. ఎంత తవ్వుకున్నా కన్నెత్తి చూడ్డానికి భయ పడ్డాయి. ఇప్పుడు ఎన్జీటీ కేసు విచారణకు స్వీకరించడంతో వేల కోట్ల కుంభకోణం బట్టబయలయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఎన్‌జీటీ విచారణకు ఆమోదం..

రామేశ్వరం మెట్ట అక్రమాలపై రెండేళ్ల కిందట పెద్దాపురానికి చెందిన ఓ వ్యక్తి లోకాయుక్తను ఆశ్రయించినా నీరుగార్చేశారు. మళ్లీ ఇప్పుడు పెద్దాపురానికి చెందిన కర్రి వెంకట రమణ తాజాగా చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యు నల్‌ను ఆశ్రయించారు. మెట్టలో వందల కోట్ల అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచా రణ చేయించాలని ఆధారాలతో సహా పిటిషన్‌ లో కోరారు. దీనిపై స్పందించిన ఎన్‌జీటీ కేసును ఎట్టకేలకు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు మార్చి 19న కేసును రిజిస్టర్‌ చేసింది. దీంతో అక్రమార్కులకు ఉచ్చు బిగుసుకోనుంది. మెట్ట అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియ మిస్తే వందల కోట్ల కుంభకోణం బట్టబయలు కానుంది. అక్రమార్కుల నుంచి కళ్లప్పగించి చూ సిన గనులు, రెవెన్యూ శాఖలు ఇరుక్కోనున్నా యి. మరోపక్క మెట్టలో అసైన్డ్‌ భూమాఫియా, అటవీ చట్టాల ఉల్లంఘన తదితర అంశాలపైనా పిటిషనర్‌ ఫిర్యాదు చేయడంతో ఎన్జీటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే కాకినాడ నగరంలో పేదల ఇళ్ల స్థలాల పేరుతో మడ భూములను చదును చేసేసిన కేసులో ఇప్పటికే ఎన్జీటీ బాధ్యులైన అధికారు లకు చుక్కలు చూపించింది. కోట్లలో జరిమానా కూడా విధించింది. ఈనేపథ్యంలో మెట్ట అక్రమా లపైనా ఎన్‌జీటీ ఉక్కుపాదం మోపాల్సి ఉంది.

Updated Date - Mar 29 , 2025 | 12:39 AM