Share News

Vallabhaneni Vamsi: వంశీ ఆదేశాలతోనే టీడీపీ కార్యాలయంపై దాడి

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:30 AM

గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాల మేరకే దిగామని కీలక నిందితుడు ఓలుపల్లి మోహనరంగారావు CID ఎదుట అంగీకరించాడు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నది, అలాగే రంగా మీద కిడ్నాప్ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ కూడా దాఖలైంది.

Vallabhaneni Vamsi: వంశీ ఆదేశాలతోనే టీడీపీ కార్యాలయంపై దాడి

పట్టాభి వస్తారన్న సమాచారంతోనే దాడికి సన్నద్ధం

ముందుగా నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు పిలుపు

వంశీ కార్యాలయంలో సమావేశం

ఆయనతో మాట్లాడాక రోడ్లపైకి

సీఐడీ విచారణలో వివరించిన వంశీ అనుచరుడు రంగా

విజయవాడ, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాలతోనే టీడీపీ ఆఫీసుపై దాడికి దిగామని ఈకేసులో ప్రధాన నిందితుడు, వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి మోహనరంగారావు అలియాస్‌ రంగా సీఐడీ అధికారుల ముందు అంగీకరించినట్టు తెలిసింది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరిలో వైసీపీ శ్రేణులు, అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి దిగి కారులకు నిప్పు పెట్టారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ కేసులో 3 రోజులు రంగాను విచారించేందుకు సీఐడీ పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో విజయవాడ జిల్లా జైలు నుంచి రంగాను బుధవారం కానూరులో ఉన్న సీఐడీ ఆఫీసుకు తరలించారు. అక్కడ రంగాను అదనపు ఎస్పీ శ్రీహరిబా బు, ఇన్‌స్పెక్టర్లు విచారించారు. 20 నుంచి 25 ప్రశ్నలు వేసినట్టుగా తెలిసింది.


నాడు టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభి గన్నవరంలోని టీడీపీ కార్యాలయానికి వస్తారన్న సమాచారంతో దాడికి ప్రణాళికను రూపొందించామని రంగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ముందుగానే తాము వంశీ ఆఫీసులో భేటీ అయ్యామని, వంశీతో సంప్రదింపుల తర్వాతే రోడ్లపైకి వచ్చినట్టు చెప్పాడని తెలిసింది. నియోజవర్గం లో ఉన్న పార్టీ శ్రేణులను అక్కడికి ముందుగానే రప్పించి ఒక సమావేశా న్ని నిర్వహించినట్టు అంగీకరించాడని, కొన్ని ప్రశ్నలకు మాత్రం తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చాడని సమాచారం. ఈ విచారణ గురు, శుక్రవారాల్లోనూ కొనసాగనుంది.

రంగాపై పీటీ వారెంట్‌: రంగాపై విజయవాడ పటమట పోలీసులు పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసిన కేసులో రంగా ఐదో నిందితుడి గా ఉన్నాడు. అతడిని కోర్టులో హాజరు పరిచేందుకు పటమట పోలీసులు పీటీ వారెంట్‌ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో దాఖలు చేశారు. దీనిపై రంగా తరఫు న్యాయవాదులకు గురువారం నోటీసులు జారీ చేస్తామని కోర్టు వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:30 AM