Gannavaram: సీఐడీ కస్టడీకి వంశీ అనుచరుడు రంగా
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:11 AM
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు ఓలుపల్లి మోహనరంగారావును మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితుల బెయిల్‌పై విచారణ కొనసాగుతోంది, అయితే వల్లభనేని వంశీ బెయిల్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది

3 రోజులు అనుమతిచ్చిన విజయవాడ కోర్టు
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణ
విజయవాడ, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరుడు, ప్రధాన నిందితుడు ఓలుపల్లి మోహనరంగారావు అలియాస్ రంగాను మూడు రోజులపాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ మూడో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రంగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడానికి రంగాను పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం బుధవారం నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాది ముదునూరి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో నలుగురు నిందితులు వెలినేని శివరామకృష్ణప్రసాద్, నిమ్మ చలపతి, గంటా వీర్రాజు, వేల్పూరి వంశీబాబుల బెయిల్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించాల్సి ఉంది. న్యాయాధికారి హిమబిందు సెలవులో ఉండడంతో తీర్పును బుధవారానికి వాయిదా వేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న వల్లభనేని వంశీ బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది.
భూకబ్జా కేసు రేపటికి వాయిదా
గన్నవరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉన్న స్థలాన్ని వంశీ అనుచరులు బెదిరించి లాక్కున్నారని నమోదైన కేసు విచారణను మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీ తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరుగుతున్నాయి. కేసులో ఫిర్యాదిగా ఉన్న సుంకర సీతామహాలక్ష్మి తరఫున వాదనలు వినిపించడానికి తనను అనుమతించాలని సీనియర్ కౌన్సిల్ కిలారు బెనర్జీ కోర్టులో మంగళవారం వకాల్తా దాఖలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News