ఘనంగా గిడ్డాంజనేయస్వామి ప్రభోత్సవం
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:50 PM
మండలంలోని వెంకటగిరిలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గిడ్డాంజనేయస్వామి ప్రభోత్సవం వైభవంగా జరిగింది.

కోడుమూరు రూరల్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటగిరిలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గిడ్డాంజనేయస్వామి ప్రభోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో అభిషేకాలు, ఆకుపూజ, పుష్పార్చన చేపట్టారు. పట్టువస్ర్తాలు, పూలమాలలతో స్వామిని అలంకించారు. మధ్యాహ్నం ఎద్దులబండికి ఏర్పాటు చేసిన ప్రభను సుందరంగా అలంకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సహిత విష్ణుమూర్తి ఉత్సవవిగ్రహాలను కొలువుదీర్చి మేళతాళాల మధ్య ఎదురుమండపం వరకు ఊరేగించారు. సాయంత్రం స్వామివారి పారువేట ఉత్సవం నిర్వహించారు. అలాగే వర్కూరులో లక్ష్మీమాధవస్వామి కి గ్రామోత్సవ అనంతరం వసంతోత్సవం జరిపించారు.
ఫ పరుగుపందెం పోటీ: ఉగాది వేడుకలలో భాగంగా ప్యాలకుర్తి, లద్దగిరి గ్రామాల్లో సోమవారం యువతకు పరుగుపందెం పోటీ చేపట్టారు. పరుగుపందెంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్యాలకుర్తిలో సుధాకర్, భరత విజేతలుగా నిలువగా రూ. 5 వేలు, రూ. 3 వేలు నగదు బహుమతి అందించారు. లద్దగిరిలో నాగరాజు, రామక్రిష్ణ విజేతలుగా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు పొట్టేళ్లు బహుమతిగా ఇచ్చారు.