HCU Land Issue: గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:28 PM
HCU Lands Case: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై గురువారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది..

హైదరాబాద్, ఏప్రిల్ 03: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూముల అంశంపై గురువారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌సీయూ భూములను రక్షించాలంటూ పలువురు పిటిషన్ వేయగా.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. అభిషేక్ సంఘ్వీ, నిరంజన్ రెడ్డి తమ తమ వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది. అలాగే 7వ తేదీ వరకు హెచ్‌సీయూ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు, పనులు చేపట్టవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు 7వ తేదీ వరకు స్టే విధించింది.
విచారణ సమయంలో.. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంపై విచారణ జరుగుతోందని హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు. దీనికి స్పందించిన న్యాయూర్తి.. హైకోర్టు ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కదా అని అన్నారు. మరోవైపు.. బుధవారం నాడు హైకోర్టు చెట్ల కొట్టివేతను ఆపాలని చెప్పినప్పటికీ గురువారం ఉదయం వరకు పనులు జరుగుతూనే ఉన్నాయని న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. చెట్ల కొట్టివేత పనులు కొనసాగుతుండగా వీడియో తీసిన విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారని.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వివరాలు విన్న ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే.. సుప్రీంకోర్టు సైతం చెట్ల కొట్టివేతపై స్టే విధించిన నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీ వరకు చెట్లను కొట్టివేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములను అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగా ఆ 400 ఎకరాల భూమిలో ఉన్న చెట్లను నరికివేసి భూమిని చదును చేస్తున్నారు. అయితే, ఇది యూనివర్సిటీ భూమి అని, ఈ ప్రాంతంలో అనేక రకాల జంతువులు, వన్యమృగాలు జీవిస్తున్నాయని విద్యార్థులు వాదిస్తున్నారు. పచ్చని అడవిని ధ్వంసం చేయొద్దని.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా.. వందలాది బుల్డోజర్లను రంగంలోకి దింపి అటవీ భూముల్లోని చెట్లను తొలగించే ప్రక్రియను వేగవంతం చేసింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులు, నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతోంది. వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో.. మరింత హీట్ పెరిగింది. దీనిపై ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తాయనేది వేచి చూడాలి.
Also Read:
For More Telangana News and Telugu News..