Share News

Sankranti 2025: వేమూరులో సంక్రాంతి సంబరాలు

ABN , Publish Date - Jan 13 , 2025 | 03:20 PM

Sankranti 2025: బాపట్ల జిల్లా వేమూరులో సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులతో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అందజేశారు.

Sankranti 2025: వేమూరులో సంక్రాంతి సంబరాలు
Sankranti Celebrations

బాపట్ల జిల్లా, జనవరి 13: రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు (Sankranti 2025) అంబరాన్ని అంటుతున్నాయి. చిన్నా, పెద్దా అంతా కూడా సంక్రాంతి పండుగలో పాలు పంచుకుంటున్నారు. పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, పతంగులు ఎగురవేయడం, పిండి వంటలు, హరిదాసులు కీర్తనలు, కోడి పందాలతో ఊరూవాడా సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నారు. బాపట్ల జిల్లా వేమూరులో సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులతో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అందజేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రూ.12 కోట్ల అభివృద్ధి పనులు మొదలయ్యాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు మొదలయ్యాయన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళుతుందని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వెల్లడించారు.

పందెం కోళ్లలో ఇన్ని రకాలున్నాయా..?


మరోవైపు రాష్ట్రంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిధిలో కోడి పందాలు ప్రారంభమయ్యాయి. దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం మండలాల్లో కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. కోడిపందాల బరుల వద్ద గుండాట, కోతాట యధేచ్చగా సాగుతున్నాయి. పురుషులతో సమానంగా జూద క్రీడల్లో మహిళలు కూడా పాల్గొంటున్నారు. గుండాట వద్ద మహిళలు డబ్బులు చేతబట్టి మరీ పందాలు కాస్తున్న పరిస్థితి. అటు పశ్చిమగోదావరి జిల్లా తణుకు, అత్తిలి, ఇరగవరంలో కోడి పందాలు మొదలయ్యాయి. పందేలను తిలకించేందుకు బరుల వద్దకు పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్ళు వస్తున్నారు. లక్షల రూపాయల నగదు చేతులు మారుతున్నాయి. కోడిపందాలతో పాటు బరుల వద్ద గుండాట యదేచ్చగా సాగుతోంది.


స్పెషల్ గిఫ్ట్

కాకినాడ రూరల్‌లో కోడి పందేల విజేతలకు భారీ గిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కరపలో ఏర్పాటు చేసిన కోడి పందేల బరుల్లో నిర్వాహకులు ఈ మేరుకు ఏర్పాటు చేశారు. గిఫ్ట్‌గా విజేతలకు జీపును ఇవ్వనున్నారు. మూడు రోజులకు కలిపి మొత్తం 63 జతల జోడు పందాలు జరుగనున్నాయి. ఇందులో అత్యధిక పందాలు గెలిచిన విజేతకు మహీంద్రా థార్ జీపు బహుమతిగా ఇవ్వడానికి నిర్వాహకులు వాహనాన్ని కొనుగోలు చేశారు. దీంతో పందెం రాయుళ్లు పోటాపోటీగా పందేలు ఆడుతున్నారు.


ఇవి కూడా చదవండి..

కశ్మీర్‌లో జెడ్-మోడ్ టన్నెల్‌ ప్రారంభం..

పండగపూట బిగ్ షాక్.. ఆ ప్రాంతాల్లో వాటర్ బంద్..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 13 , 2025 | 03:20 PM