High Court: అవి అసభ్యకరమైన పోస్టులే
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:13 AM
సామాజిక మాధ్యమాల్లో పిటిషనర్లు పెట్టిన పోస్టులు అసభ్యకరమైనవేనని, ఈ విషయంలో రెండో ఆలోచనే లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. అసభ్యకర పదజాలంతో ఎదుటివారి గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలించేగేలా పెట్టే పోస్టులను కట్టడి చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది.

ఈ విషయంలో రెండో ఆలోచనే లేదు.. వాటిని కట్టడి చేయాల్సిందే: హైకోర్టు
‘సోషల్’ పోస్టులు సైబర్ క్రైమ్ కిందకు వస్తాయా?.. వాదనలు వినిపించండి.. పీపీకి ఆదేశం
భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి ప్రోద్బలంతోనే పోస్టులు.. వైసీపీ సోషల్ మీడియాలో వాళ్లే కీలకం
ప్రత్యర్థుల ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రణాళికాబద్ధంగా ఆ పోస్టులను వ్యాప్తి చేశారు
మార్ఫింగ్ ఫొటోలతో మహిళల గౌరవ మర్యాదలకు భంగం: పబ్లిక్ ప్రాసిక్యూటర్
అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో పిటిషనర్లు పెట్టిన పోస్టులు అసభ్యకరమైనవేనని, ఈ విషయంలో రెండో ఆలోచనే లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. అసభ్యకర పదజాలంతో ఎదుటివారి గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలించేగేలా పెట్టే పోస్టులను కట్టడి చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టేలా వైసీపీ కార్యకర్తలను, సానుభూతి పరులను ప్రోత్సహించారనే ఆరోపణలతో వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌చార్జి సజ్జల భార్గరెడ్డి, అర్జున్‌రెడ్డి, మరికొందరు నిందితులపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వాజ్యాలపై విచారణ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. వ్యవస్థీకృత నేరం(బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్- 111)లో కిడ్నాపింగ్, దోపిడీ, భూ ఆక్రమణలు, ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్ తదితర తీవ్ర నేరాల గురించి ప్రస్తావించారని గుర్తుచేసింది.
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు సైబర్ క్రైమ్‌తో ఎలా సమానమవుతాయో చెప్పాలని పీపీని హైకోర్టు ఆదేశించింది. నిందితులపై వ్యవస్థీకృతనేరం కింద కేసు నమోదుచేయడంపై వాదనలు వినిపించాలని పీపీకి స్పష్టం చేసింది. వ్యవస్థీకృత నేరం (బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్-111) కింద కేసు నమోదు చేసేందుకు నిందితుడిపై అదే తరహా కేసుల్లో 2 చార్జిషీట్లు నమోదై ఉండాలన్న వాదన సరికాదని, అలాంటి నిబంధన చట్టంలో ఎక్కడా లేదని, ఇది దేశంలోని వివిధ కోర్టుల అభిప్రాయం మాత్రమేనని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. విచారణను 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.విజయ్ ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు పీపీ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్లు అసభ్యకర పోస్టులు సృష్టించి, ప్రత్యర్థుల ప్రతిష్ఠను దిగజార్చేలా వాటిని ప్రణాళికాబద్ధంగా సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారని తెలిపారు. అసభ్యకర పోస్టులు వ్యాప్తి చేసినందుకు సోషల్ మీడియాల గ్రూపు సభ్యులకు సొమ్ము చెల్లించారని, ఈ చర్య వ్యవస్థీకృత నేరం కిందికి వస్తుందని వివరించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, ఇతర పిటిషనర్లు కీలక పాత్ర పోషించారని సహ నిందితులు వాంగ్మూలం ఇచ్చారని, వారి ప్రోద్బలం, ప్రోత్సాహంతోనే అసభ్యకర పోస్టులు ప్రచారం చేశారని తెలిపారు.