Share News

TTD Board Members: మతాల మధ్య జగన్‌ చిచ్చు

ABN , Publish Date - Apr 13 , 2025 | 03:52 AM

వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి టీటీడీ గోశాలపై చేసిన అసత్య ఆరోపణలను తిరస్కరించిన టీడీపీ నేతలు, ప్రజల్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే ఈ కుట్రను నమ్మవద్దని కోరారు

TTD Board Members: మతాల మధ్య జగన్‌ చిచ్చు

  • విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర

  • టీటీడీ గోశాలపై భూమన అసత్య ఆరోపణలు

  • భక్తులెవరూ వీటిని నమ్మొద్దు : టీడీపీ

అమరావతి/అనంతపురం/తిరుమల/ఓర్వకల్లు, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకు జగన్‌ రెడ్డి కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే టీటీడీ గోశాలపై ఆ పార్టీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని పలువురు టీడీపీ నేతలు, టీటీడీ బోర్డు సభ్యులు ఆరోపించారు. ప్రజలు ఈ అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. జగన్‌ తన పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు భూమన కుట్రలు చేస్తున్నారన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ నేతలపై పోలీసులు నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా తప్పుడు ప్రచారాలతో మత విద్వేషాలను రెచ్చగొట్టాలన్నదే వైసీపీ కుట్ర అని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి విమర్శించారు. మనుగడ కోల్పోతున్న పార్టీని కాపాడుకునేందుకు నిత్యం ఏదో ఒక బూటకపు ప్రచారంతో వైసీపీ పబ్బం గడుపుకొంటోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరుణాకర్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌లో చూపించిన ఆవుల ఫొటోలు ఇక్కడివి కావన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా భూమన మాట్లాడుతున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు మండిపడ్డారు. ఆరోపణలు నిరూపిస్తే తాను తన పదవులకు రాజీనామా చేస్తానని, లేకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని భూమనకు సవాల్‌ విసిరారు. టీటీడీ గోశాలపై భూమన చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. గోశాలకు వస్తే వాస్తవాలను చూపిస్తామని, ఎప్పుడు వస్తారో చెబితే తాను కూడా వస్తానని సవాల్‌ విసిరారు. దారుణ ఓటమి చవిచూసిన తర్వాత కూడా ఫేక్‌పార్టీ వైసీపీ ఫేక్‌ ప్రచారాలను మానుకోలేకపోతోందని వీఎంఆర్డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ విమర్శించారు.


ప్రజలను మోసగించేలా కుట్ర: బీఆర్‌ నాయుడు

‘గోసేవ అంటేనే గోదేవి సేవ. ఈ పవిత్రమైన సేవపై రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలి’ అని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు విజ్ఞప్తి చేశారు. ‘టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ భూమన అవాస్తవాలు, కల్పిత ఆరోపణలు ప్రచారం చేయడం అత్యంత విషాదకరం. టీటీడీ బోర్డు చేపడుతున్న కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం బాధాకరం. అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాల వంటి కారణాల వల్ల గోవులు చనిపోయే అంశాన్ని రాజకీయంగా ప్రచారానికి వాడుకోవడం అధర్మం. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫొటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర ఇది’ అని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 03:53 AM