Share News

ఉలిక్కిపడిన గోవిందపల్లె

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:56 PM

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెలో వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై శనివారం జరిగిన హత్యాయత్నం ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది.

ఉలిక్కిపడిన గోవిందపల్లె
గోవిందపల్లెలో వివరాలు తెలుసుకుంటున్న ఫ్యాక్షన్‌ జోన్‌ సీఐ

హత్యాయత్నం కేసులో నిందితుల కోసం గాలింపు ముమ్మరం

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫ్యాక్షన్‌ జోన్‌ సీఐ

పోలీసుల అదుపులో అనుమానితులు

శిరివెళ్ల, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి) : నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెలో వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై శనివారం జరిగిన హత్యాయత్నం ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌ పర్యవేక్షణలో పోలీసు బృందాలు పలుచోట్ల పర్యటిస్తూ నిందితుల ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నారు. ఘటన జరిగిన పరిస్థితులు, దాడికి గల కారణాలపై సమగ్రంగా విచారిస్తున్నారు. ఘటన వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా? అన్న కోణంలో కూపీ లాగుతున్నారు. ఈ మేరకు నంద్యాల ఫ్యాక్షన్‌ జోన్‌ సీఐ పార్థసారథి గోవిందపల్లెలోని ఘటనాస్థలాన్ని ఆదివారం పరిశీలించారు. హత్యాయత్నం కేసు వివరాలు, గ్రామంలోని పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఇదిలా ఉండగా గ్రామంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాధితుడు ఇందూరి ప్రతాప్‌రెడ్డిని మెరుగైన వైద్యం నిమిత్తం తరలించారు.

జంట హత్య కేసులోనూ నిందితుడు

గోవిందపల్లె గ్రామంలో 2017, మే నెలలో జంట హత్యలు జరిగాయి. ఇందులో గంగుల కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీపీ ఇందూరి ప్రభాకర్‌రెడ్డి, అతని బావ మేరువ శ్రీనివాసరెడ్డి సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు దాడి చేసి వారిద్దరినీ దారుణంగా హత్య చేశాయి. ఈ ఘటనపై శిరివెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు గంగదాసరి రవిచంద్రారెడ్డి.. 2017లో జరిగిన జంట హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్య కేసులో ప్రతాప్‌రెడ్డి ప్రధాన సాక్షిగా ఉండడం.. ఈ నెల 21 నుంచి కోర్టులో కేసు ట్రయిల్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం జరగడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

పోలీసుల అదుపులో కొందరు వ్యక్తులు

గోవిందపల్లె గ్రామంలో జరిగిన హత్యాహత్నం ఘటనలో ప్రత్యక్ష సాక్షి ఇందూరి వెంకట కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్న పీరయ్య తెలిపారు. గ్రామానికి చెందిన గంగదాసరి రవిచంద్రారెడ్డి, గంగదాసరి లక్ష్మీరెడ్డి, గంగదాసరి శ్రీనివాసరెడ్డి, శిరిగిరి రమణారెడ్డితోపాటు మరో గుర్తుతెలియని వ్యక్తిపై 324, 307 రెడ్‌ విత్‌ 34 ఐసీసీ సెక్షన్ల కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా చేర్చిన కొందరు వ్యక్తులతోపాటు అనుమానితులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన నిందితుల కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి ముమ్మరంగా గాలిస్తున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 11:56 PM