Amit Shah Orders Investigation: మద్యం స్కాంపై సమగ్ర దర్యాప్తు!
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:18 AM
జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన భారీ మద్యం కుంభకోణంపై లోక్‌సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ఆరోపణల నేపథ్యంలో, హోంమంత్రి అమిత్ షా దర్యాప్తు ఆదేశించారు.

టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలుకు అమిత్ షా హామీ
లోక్‌సభలో లావు చేసిన ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి దృష్టి
ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకొని ఆరా
హోం మంత్రికి కీలక పత్రాలను అందజేసిన శ్రీకృష్ణదేవరాయలు
ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కాం నీటి బొట్టంతేనని వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎన్నో రెట్లు అధికంగా గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం లోక్‌సభలో చేసిన తీవ్ర ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించారు. మంగళవారం పార్లమెంటు సమావేశాల మధ్యలోనే ఆయన్ను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకొని వివరాలు తెలుసుకున్నారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోణం నీటి బొట్టంతేనని ఈ సందర్భంగా లావు ఆయనకు వివరించారు. సంబంధిత కీలక పత్రాలను అందజేశారు. రూ.90వేల కోట్ల మద్యం వ్యాపారంలో రూ.18 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని, అవికాకుండా మరో రూ.4 వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారన్న ఆరోపణలపై హోంమంత్రి ఆరా తీశారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్.సునీల్‌రెడ్డి రూ.2 వేల కోట్లను దుబాయ్‌కి తరలించిన కీలకపత్రాలను లావు అందించారు. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయన్నారు. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఏపీ మద్యం కుంభకోణం పర్యవసానాల వల్లే ఒక ఎంపీ రాజీనామా చేసి, రాజకీయాల నుంచి నిష్క్రమించారని కూడా లావు వివరించారు. రాష్ట్రంలోని 22 డిస్టిలరీలను చేజిక్కించుకుని అర్థంపర్థం లేని బ్రాండ్లతో 26 కొత్త కంపెనీలను ప్రారంభించారని, అంతర్జాతీయ బ్రాండ్లన్నింటినీ వెళ్లగొట్టారని తెలిపారు.
ప్రభుత్వ దుకాణాలలో రూ.99 వేల కోట్ల మేరకు అమ్మకాలు జరిగితే, అందులో రూ.690 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయని, మిగతా సొమ్ములో అత్యధిక భాగం జగన్, ఆయన అనుయాయులు కబళించారని వివరించారు. కాగా, సోమవారం లోక్‌సభలో 2025-26 ఆర్థిక బిల్లుపై లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ జగన్ మద్యం కుంభకోణాన్ని వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 20 మంది ప్రైవేట్ ఐఎంఎ్‌ఫఎల్‌లను, డిస్టిలరీలను అక్రమంగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని, 60శాతం ఉత్పతి సామర్థ్యాన్ని కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు అప్పగించారని ఆరోపించారు. 2019-2024 మధ్య 38 కొత్త బ్రాండ్లను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అవన్నీ అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు చెందినవని తెలిపారు. 26 కొత్త కంపెనీలు భారీ లాభాలు పొందాయని, రూ.20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం ేసకరణను పూర్తిగా నియంత్రించిందని, అధికార పార్టీ సహచరుల నియంత్రణలో ఉన్న బ్రాండ్‌లకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. రూ.2,000 కోట్లు ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో దుబాయ్‌కి మళ్లించారన్నారు. ఏపీలో మద్యం స్కాంకు కారణమైన వారిపై దర్యాప్తు చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ