Lokesh Speech Highlights: రికార్డులు సృష్టించేది.. బద్దలు కొట్టేది టీడీపీనే
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:42 AM
Lokesh Speech Highlights: సమాజమే దేవాలయం - ప్రజలే దేవుడని ఎన్టీఆర్ అన్నారని.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అదే స్ఫూర్తితో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ అన్నారు. దేశానికి అభివృద్ధి అంటే ఏంటో చూపింది చంద్రబాబు అని చెప్పారు.

అమరావతి, మార్చి 29: తెలుగు దేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనమని... పార్టీ మొదటి గెలుపు ఒక చరిత్ర అని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ సభలో మంత్రి మాట్లాడుతూ... రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని బద్దలు కొట్టాలన్నా టీడీపీకే సాధ్యమన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని... తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. 43ఏళ్ల క్రితం టీడీపీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్ అని తెలిపారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించారన్నారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూశామని... ఎన్నో సంక్షోభాలు చూశామని, ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన జెండాను దించకుండా పార్టీకి కాపు కాసింది పసుపు సైన్యం అని అన్నారు. పార్టీ కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారని.. వారే మన ధైర్యమన్నారు. పార్టీ కోసం కష్టపడిన పసుపు సైన్యానికి లోకేష్ హ్యాట్సాప్ తెలియజేశారు.
సమాజమే దేవాలయం - ప్రజలే దేవుడని ఎన్టీఆర్ అన్నారని... పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అదే స్ఫూర్తితో పనిచేస్తున్నామని తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ అన్నారు. దేశానికి అభివృద్ధి అంటే ఏంటో చూపింది చంద్రబాబు అని చెప్పారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తెలిసేలా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే తెలుగు వారిని ప్రపంచ పటంలో పెట్టింది పార్టీ అధినేత చంద్రబాబు అని వెల్లడించారు. రూ.2 కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పెన్షన్ వంటి అనే సంక్షేమ కార్యక్రమాలను దేశానికి పరిచయం చేసింది టీడీపీ అని చెప్పుకొచ్చారు. యువకులను రాజకీయాలకు ప్రోత్సహించింది తెలుగుదేశం అని అన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది, బీసీలకు ఆర్థికంగా రాజకీయ స్వాతంత్ర్యం తీసుకువచ్చింది టీడీపీనే స్పష్టం చేశారు.
జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరన్నారు. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేశామన్నారు. ఏనాడూ స్వార్థంతో పదవులను ఆశించలేదన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వడంలో టీడీపీ కీలక పాత్ర వహించిందన్నారు. అంతే కాదు అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికాం, ఐటీ, డిజిటల్ పేమెంట్‌లో అనేక సంస్కరణలను తీసుకొచ్చామన్నారు. టీడీపీ జెండా పీకేస్తామన్న వారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారన్నారు.
2019 వరకు చూసిన రాజకీయాలు ఒకెత్తు అయితే.. 2019 నుంచి 2024 వరకు చూసిన రాజకీయాలు వేరన్నారు. అరాచక పాలనను ఎదుర్కున్నామన్నారు. దేవాలయంగా భావించిన టీడీపీ కార్యాలయంపై దాడి చేశారన్నారు. క్లేమోరల్‌మైన్‌కే భయపడలేదని.. ఈ కామెడీ పీసులకు భయపడతామా అంటూ వ్యాఖ్యలు చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదన్న వ్యక్తికి.. ఈ రోజు ప్రతిపక్ష హోదానే లేకుండా చేసిన ఘనత టీడీపీదన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందన్నారు. కలిసికట్టుగా ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో వైసీపీకి సున్నా తీసుకొచ్చామన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా టీడీపీదే గెలుపన్నారు.
ప్రజలు ప్రజాప్రభుత్వం రావాలని కోరుకున్నారన్నారు. పేదరికం లేని సమాజమే లక్ష్యమన్నారు. పెన్షన్‌ను పెంచామని, దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. వచ్చే పదిరోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 117 హామీలు పూర్తి స్థాయిలో అమలు చేశామన్నారు. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవను అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ పార్టీకి దక్కని కార్యకర్తలు టీడీపీకే సొంతమన్నారు. ప్రాంతీయ పార్టీకి కేవలం 83 రోజుల్లో కోటి సభ్యత్వాలు అసాధ్యమైన రికార్డ్ అన్నారు. కార్యకర్తల కోసం ప్రమాద బీమాను 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచామన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం గడిచిన పదేళ్లలో సుమారు రూ.140 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. జెండా ఆవిష్కరించిన సీఎం
Read Latest AP News And Telugu News