Share News

Amaravati: అమరావతికి 31 వేల కోట్లు!

ABN , Publish Date - Mar 20 , 2025 | 04:16 AM

రాజధాని అమరావతికి మొత్తం రూ.31 వేల కోట్లు వివిధ రూపాల్లో వస్తున్నాయని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. బుధవారం శాసనమండలిలో సభ్యులడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

Amaravati: అమరావతికి 31 వేల కోట్లు!

  • వివిధ రూపాల్లో నిధులు వస్తున్నాయి

  • పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడి

అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి మొత్తం రూ.31 వేల కోట్లు వివిధ రూపాల్లో వస్తున్నాయని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. బుధవారం శాసనమండలిలో సభ్యులడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ రూ.15 వేల కోట్లు రుణం ఇస్తున్నాయని, ఈ రుణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా స్పష్టత ఇచ్చారని తెలిపారు. ఈ నిధుల్లో గ్రాంట్‌ ఎంత? రుణం ఎంత అనేది చర్చించి చెబుతామన్నారు. హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు, కేఎ్‌ఫడబ్ల్యూ అనే జర్మన్‌ బ్యాంక్‌ రూ.5 వేల కోట్లు లోన్‌ ఇస్తున్నట్టు తెలిపారు.


అమరావతికి రైల్వేలైన్‌ ప్రాజెక్టు ఖర్చును కేంద్రమే భరిస్తుందన్నారు. అమరావతి రైల్వే ప్రాజెక్టుకు అవసరమైన భూమిని ఎలా సేకరించాలనే దానిపై చర్చిస్తున్నామని, అమరావతి డిజైన్‌ చేసినప్పుడే సెల్ఫ్‌ సస్టైనబుల్‌గా డిజైన్‌ చేశారని వివరించారు. ప్రస్తుతం పనులు ప్రారంభించడానికి బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులు అమరావతికి వాడకూడదనేది సీఎం చంద్రబాబు క్లియర్‌గా చెప్పారన్నారు. రాజధాని కోసం తీసుకున్న రుణాలను అమరావతి పూర్తయిన తర్వాత అక్కడి భూములతో రీపేమెంట్‌ చేస్తామని తెలిపారు. బ్యాంకుల ద్వారా డబ్బులు రావడానికి ఆలస్యం అవుతుందని, ఈ బడ్జెట్‌లో కేటాయించిన రూ.6 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రుణాలు వచ్చిన తర్వాత బడ్జెట్‌ డబ్బులు క్లియర్‌ చేస్తామన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 04:16 AM