Cultural Program: నవ్వుల్... పువ్వుల్!
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:30 AM
‘నా జీవితంలో ఎప్పుడూ ఇంతగా నవ్వలేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే... ‘గబ్బర్‌సింగ్ సీన్ గుర్తుకొచ్చింది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పడీపడీ నవ్వేశారు. సుదీర్ఘంగా కొనసాగిన బడ్జెట్ సమావేశాలకు ఇలా హాయైున ముగింపునిచ్చారు. గురువారం సాయంత్రం విజయవాడలోని ఒక కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

కామెడీ స్కిట్లతో అలరించిన ఎమ్మెల్యేలు
పడీపడీ నవ్విన బాబు, పవన్
సుయోధనుడిగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ విశ్వరూపం
బాలచంద్రుడిగా దుర్గేశ్ మెరుపులు
కూటమి శాశ్వతంగా ఉండాలి: బాబు
విజయవాడ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): వాడి వేడి రాజకీయాలు, నియోజకవర్గ సమస్యలు, నిత్యం ఒత్తిళ్లతో సతమతసమయ్యే నేతలు మనసారా నవ్వుకున్నారు. బయట గంభీరంగా కనిపించే నాయకులే ‘స్కిట్’లు వేసి కిలకిలా నవ్వించారు. ‘నా జీవితంలో ఎప్పుడూ ఇంతగా నవ్వలేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే... ‘గబ్బర్‌సింగ్ సీన్ గుర్తుకొచ్చింది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పడీపడీ నవ్వేశారు. సుదీర్ఘంగా కొనసాగిన బడ్జెట్ సమావేశాలకు ఇలా హాయైున ముగింపునిచ్చారు. గురువారం సాయంత్రం విజయవాడలోని ఒక కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ‘చేశాం అంటే చేశాం’ అని కాకుండా... ఇందులో పాల్గొన్న వారంతా సిసలైన కళాకారుల్లా అలరించారు. నాటకంలోనూ ఎమ్మెల్యేగా నటించిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చలేక, వారి బెదిరింపులతో తల పట్టుకునే సీన్లు పగలబడి నవ్వించాయి. మరీ ముఖ్యంగా ఇంటర్ ఫెయిల్ అయిన తన తమ్ముడికి ఇంజనీరింగ్ సీటు ఎందుకు ఇప్పించవు... అంటూ కార్యకర్త హోదాలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నిలదీసిన వైనం అదిరిపోయింది. స్ర్కిప్టులు సిద్ధంగా ఉన్నాయని... బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లను ఒప్పించాలని జీవీ ఆంజనేయులును కూన రవికుమార్ ‘డిమాండ్’ చేసే సీన్లూ హాస్యం పండించాయి. ‘మా నియోజకవర్గ అమ్మాయికి మీ నియోజకవర్గ అబ్బాయితో పెళ్లయింది. కాపురానికి మాత్రం రానంటున్నాడు. మీరే నైతిక బాధ్యత తీసుకుని అతడిని పంపించాలి’ అంటూ జీవీని విష్ణుకుమార్ రాజు కోరే తీరూ నవ్వులు పూయించింది. ఇక... ఎక్కడికి వెళితే అక్కడ ‘అసందర్భపు పాట’లు పాడి దెబ్బలు తినే పాత్రలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆయనను భరించే ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ (జనసేన) కడుపుబ్బా నవ్వించారు. ‘మన కురువంశము ఏనాడో కులహీనమైనది’ అంటూ సుయోధనుడి పాత్రలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అదరగొట్టారు. పల్నాటి బాలచంద్రుడి పాత్రలో మంత్రి కందుల దుర్గేశ్ చమక్కుమనిపించారు. వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రతిభను చాటుకున్నారు.
నవ్వులే నవ్వులు...
ఎమ్మెల్యేల స్కిట్‌లు నడుస్తున్నంత సేపూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ‘అసందర్భపు పాట’ స్కిట్ చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నానని సీఎం చెప్పారు. ఈ స్కిట్‌లోని ‘రాలిపోయే పువ్వా’ పాట తనకు గుండెల్లో ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు. సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు పగలబడి నవ్విన వీడియోను ఆయన సతీమణి భువనేశ్వరికి చూపించాలని మంత్రి లోకేశ్‌కు పయ్యావుల సూచించారు.
కూటమి శాశ్వతంగా ఉండాలి: చంద్రబాబు
కూటమి శాశ్వతంగా ఉండాలని... ప్రస్తుత ఎమ్మెల్యేలంతా శాశ్వతంగా కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. మూడ్రోజుల పాటు జరిగిన ప్రజాప్రతినిధుల క్రీడా, సాంస్కృతిక పోటీల ముగింపు సందర్భంగా విజేతలకు ఆయన బహుమతులు అందించారు. క్రీడల్లో ఉన్న పోటీతత్వం ప్రజాసమస్యలపై అధికార, ప్రతిపక్షాలకు ఉండాలని చెప్పారు. సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత అధికార, ప్రతిపక్షం అన్న వ్యత్యాసం లేకుండా సరదాగా మాట్లాడుకోవాలని చెప్పారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో రాజకీయాలు కలుషితమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేను.. ఓ సమస్య తీవ్రతను తెలియజేయడానికి బల్లగుద్ది మాట్లాడాను. ఎందుకు బల్ల గుద్దుతున్నావు... ఏమనుకుంటున్నావని చెన్నారెడ్డి అన్నారు. ఒకసారి కాదు పదిసార్లు గుద్దుతానని చెప్పి బల్లపై కొట్టాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. ప్రజాసమస్యలపై సభలో చర్చకు ఇదొక స్ఫూర్తి’ అని వ్యాఖ్యానించారు.
రిజర్వ్‌డ్ అనుకున్నా..
తాను చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటానని అనుకునేవాడినని, ఎమ్మెల్యేల సాంస్కృతిక ప్రదర్శనలు చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేకపోయానని సీఎం చెప్పారు. ‘ఎమ్మెల్యేలు పాల్గొన్న వీడియోలు చూస్తే ఒలింపిక్స్‌కు వెళ్తున్నారా అన్న సందేహం కలిగింది. ఈ క్రీడల ద్వారా ప్రజల్లో క్రీడాస్ఫూర్తిని రగిల్చారు. మహిళా ఎమ్మెల్యేలు క్రీడల్లో బాగా పోటీపడినా, వినోదంలో తగ్గారు. వచ్చే ఏడాది నిర్వహించే పోటీల్లో వారు వినోద కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. ఎమ్మెల్యేలు ప్రదర్శించిన స్కిట్లను చూసిన తర్వాత ఎంతో ఆనందం కలిగింది. పవన్ కల్యాణ్ తన చిత్రాల్లోనూ ఇంతటి వినోదాన్ని ఆస్వాదించి ఉండరు. భవిష్యత్‌కు సంబంధించిన సందేశాలను ఎమ్మెల్యేలు స్కిట్ల ద్వారా హాస్యాన్ని జోడించి ప్రజల్లోకి తీసుకెళ్లారు’ అని అభినందించారు. ప్రజలంతా ఇలా ఆనందంగా ఉంటే రాష్ట్రంలో ఆస్పత్రులు అక్కర్లేదని చమత్కరించారు. వైద్య ఆరోగ్య శాఖ కేటాయింపుల్లో కోత విధించి సాంస్కృతిక, క్రీడారంగాలకు బడ్జెట్ పెంచాలని నవ్వుతూ ఆర్థిక మంత్రి పయ్యావులకు సూచించారు.
15ఏళ్లు కూటమి సర్కార్: పవన్
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలంటే వ్యక్తిగత కక్షలు, గొడవలు అన్న సంస్కృతిని చూశామని.. దానిని కూటమి ప్రభుత్వం మార్చుతోందన్నారు. ఆనందాన్ని పంచే ప్రభుత్వం వచ్చిందని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేల స్కిట్లు చూసిన తర్వాత గబ్బర్‌సింగ్ చిత్రంలో పోలీ్‌సస్టేషన్ సన్నివేశం తనకు గుర్తుకొచ్చిందన్నారు. ఇంటికి వెళ్లినా కొన్ని రోజులపాటు నవ్వుకుంటానని చెప్పారు. వచ్చే ఏడాది నిర్వహించే క్రీడల పోటీల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తానన్నారు. ప్రజాప్రతినిధుల క్రీడా, సాంస్కృతిక పోటీలను ప్రతి ఏటా నిర్వహిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ పోటీలను ప్రారంభించారని.. అప్పటి నుంచి ఇదొక సాంప్రదాయంగా వస్తోందన్నారు. మధ్యలో కొన్ని సంవత్సరాలు అంతరాయం కలిగిందని.. ఇక నుంచి ప్రతి ఏడాదీ పోటీలను నిర్వహిస్తామన్నారు.
ఏకపాత్రాభినయంలో రఘురామ ఫస్ట్
వివిధ క్రీడల్లో విజేతలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహుమతి ప్రదానం చేశారు. ఏకపాత్రాభినయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రథమ బహుమతి, మంత్రి కందుల దుర్గేశ్ ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. స్కిట్లలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు జట్టు ప్రదర్శించిన ‘ఇదీ సంగతి’ ప్రథమ, ఈశ్వరరావు, విజయ్‌కుమార్ ప్రదర్శించిన ‘అసందర్భపు పాట’ ద్వితీయ బహుమతి గెలుచుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..