CM Chandrababu Statement: భవిష్యత్ అంతా భారతీయులదే
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:38 PM
CM Chandrababu Statement: ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప అడుగు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయన్నారు. 1991 ఆర్థిక సంస్కరణలు ఎంపిక కాదు.. తప్పనిసరి అని సీఎం తెలిపారు.

చెన్నై, మార్చి 28: ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని.. ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఐఐటీ మద్రాస్‌లో ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్‌లో (All India Research Scholars Summit) సీఎం మాట్లాడుతూ.. ఐఐటీ మద్రాస్ అనేక అంశాల్లో దేశంలోనే నెంబర్‌వన్ అని అన్నారు. ఐఐటీ మద్రాస్ ఆన్‌లైన్ కోర్సులు అందిస్తోందని.. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ అగ్నికల్ మంచి విజయాలు అందుకుందని చెప్పారు. ఇక్కడి స్టార్టప్‌లు 80 శాతం విజయవంతం అవుతున్నాయన్నారు. ఐఐటీ మద్రాస్‌లో దాదాపు 40 శాతం మంది తెలుగు విద్యార్థులే ఉన్నారని అన్నారు.
ఆ సంస్కరణలు ఎంపిక కాదు.. తప్పనిసరి
ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప అడుగు అని చెప్పుకొచ్చారు. ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయన్నారు. 1991 ఆర్థిక సంస్కరణలు ఎంపిక కాదు.. తప్పనిసరి అని అన్నారు. రాజకీయ సంస్కరణలతో సోవియట్ రష్యా అనేక దేశాలుగా విడిపోయిందన్నారు. అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల తర్వాత చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని వెల్లడించారు. భారత్ కూడా ఆర్థిక సంస్కరణల తర్వాత అభివృద్ధి బాట పట్టిందని తెలిపారు. బ్రిటిష్ వారు దేశం నుంచి అంతా తీసుకెళ్లారని.. ఒక్క ఇంగ్లీష్ భాషను మనకు వదిలేశారన్నారు. 1990లలో కమ్యూనికేషన్ రంగం బీఎస్‌ఎన్‌ఎల్, వీఎస్‌ఎన్‌ఎల్ గుత్తాధిపత్యంగా ఉండేదన్నారు. సంస్కరణల తర్వాత కమ్యూనికేషన్ల రంగంలో ప్రైవేటు సంస్థలు వచ్చాయన్నారు. కమ్యూనికేషన్ల రంగంలో ప్రైవేట్ సంస్థల రాక ఓ గేమ్ ఛేంజర్ అని సీఎం తెలిపారు.
త్వరలోనే అగ్రస్థానానికి భారత్
‘బిల్‌గేట్స్‌ను మొదట నేను కలుస్తానని అడిగినప్పుడు రాజకీయ నేతలతో నాకు సంబంధం లేదని ఆయన అన్నారు. నేను ఆయన్ను ఒప్పించి అపాయింట్‌మెంట్ తీసుకున్నా. బిల్‌గేట్స్‌తో నేను 45 నిమిషాలు మాట్లాడా. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పాలని కోరా. ఇప్పుడు అదే మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఉన్నారు’ అని తెలిపారు. కొంతకాలంగా భారత్ వృద్ధిరేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటోందన్నారు. 2014లో భారత్ పదో ఆర్థిక వ్యవస్థగా ఉంటే.. ఇప్పుడు ఐదో స్థానానికి చేరిందన్నారు. మనమంతా కృషిచేస్తే త్వరలోనే ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని వెల్లడించారు.
ఆ సమస్యే లేదు
భారత్‌కు ఉన్న వరం జనాభా అని.. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని అన్నారు. చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్య ఎదుర్కొంటున్నాయన్నారు. భారత్‌కు మరో 40 ఏళ్ల వరకూ జనాభా సమస్యే లేదన్నారు. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం అమెరికన్ ఇండియన్లదే అని చెప్పారు. అమెరికాలో ఖరీదైన ప్రాంతాల్లోకి వెళ్లి తెలుగు, తమిళంలో పిలిస్తే చాలా మంది పోగవుతారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే
Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య
Read Latest AP News And Telugu News