Share News

దాహార్తి తీర్చుదాం

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:24 PM

జిల్లాలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికార యంత్రాంగం ఉపక్రమించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో పంచాయతీ అధికారులు కదిలారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌ సెంటర్లలో చలివేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. కొన్నిచోట్ల మజ్జిగ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.

దాహార్తి తీర్చుదాం
దర్శిలో రెండురోజుల క్రితం చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి

జిల్లాలో 600కుపైగా చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు

పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థల సహకారం

అందుబాటులో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు

వేసవి నేపథ్యంలో యంత్రాంగం చర్యలు

ఎండల తీవ్రతపై కరపత్రాల

ద్వారా ప్రజలకు అవగాహన

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికార యంత్రాంగం ఉపక్రమించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో పంచాయతీ అధికారులు కదిలారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌ సెంటర్లలో చలివేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. కొన్నిచోట్ల మజ్జిగ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. పక్షంరోజులుగా జిల్లాలో ఎండతీవ్రతతోపాటు వేడిగాలులు వీస్తున్నాయి. రానున్న రోజులో తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో 729 గ్రామ పంచాయతీలు ఉండగా, కనీసం 650 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఎండ తీవ్రతపై అప్రమత్తం

వైద్యారోగ్యశాఖ సహకారంతో చలివేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎండల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కూడా కల్పించనున్నారు. అందుకోసం విస్తృతంగా కరపత్రాల పంపిణీతోపాటు, ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలతోపాటు అటుగా ప్రయాణం చేసే వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.


దాతల సహకారంతో మజ్జిగ కేంద్రాలు

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఇటీవల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆమె ఆదేశాలతో జిల్లా పంచాయతీ అఽధికారి గొట్టిపాటి వెంకటనాయుడు చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీల్లో చలివేంద్రాల ఏర్పాటు చేయాలని కార్యదర్శులు, ఈవోఆర్‌డీలు, డీఎల్‌పీవోలకు సర్క్యులర్‌ను జారీ చేశారు. గ్రామపంచాయతీలతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకొంటున్నారు. మేజర్‌ పంచాయతీల్లో కనీసం ఒక చలివేంద్రం, ఒక మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు

గొట్టిపాటి వెంకటనాయుడు, డీపీవో

జిల్లాలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామ పంచాయతీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యదర్శులను ఆదేశించాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ కేంద్రాల ఏర్పాటుతోపాటు గ్రామంలోని ముఖ్యకూడళ్లతోపాటు బస్టాండు, మార్కెట్ల వద్ద ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

Updated Date - Apr 06 , 2025 | 11:25 PM