దిగుబడులు లేక.. ధర రాక..
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:44 PM
మండలంలోని మిర్చి సాగుచేసిన రైతులకు కాయలు కోయ కుండానే కన్నీళ్లు వస్తున్నాయి. గిట్టుబాటు ధరలేక రైతులు నష్టాలు మూట గట్టుకుంటున్నారు. ఈఏడాది ఖరీఫ్, రబీలో కలిపి రూ.2555 ఎకరాలు సాగుచేశారు. వరుస తెగుళ్లు నిండా ముంచాయి. పైరు ఎదుగుదలతో పాటు దిగుబడి తగ్గింది. దీనికితోడు మార్కెట్‌లో ధర పాతాళానికి పడిపోవటంతో కోలుకోలేని దెబ్బ తగిలింది.

ఎకరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడి
నిండాముంచిన తెగుళ్లు
మిర్చి రైతుల ఆందోళన
ముండ్లమూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మిర్చి సాగుచేసిన రైతులకు కాయలు కోయ కుండానే కన్నీళ్లు వస్తున్నాయి. గిట్టుబాటు ధరలేక రైతులు నష్టాలు మూట గట్టుకుంటున్నారు. ఈఏడాది ఖరీఫ్, రబీలో కలిపి రూ.2555 ఎకరాలు సాగుచేశారు. వరుస తెగుళ్లు నిండా ముంచాయి. పైరు ఎదుగుదలతో పాటు దిగుబడి తగ్గింది. దీనికితోడు మార్కెట్‌లో ధర పాతాళానికి పడిపోవటంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎకరాకు పది నుంచి 15 క్వింటాళ్ళు దిగుబడి వస్తుంది. దీంతో కనీసం పెట్టుబడులతో పాటు కోత, కూలీ ఖర్చు కూడా రాక అల్లాడి పోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరి దారుణంగా ఉంది.
ఈఏడాది మార్కెట్‌లో ధర లేకపోవటంతో బయట దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులను ఆసరా చేసుకొని రూ.పది వలే నుంచి రూ.12 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. బాగా పండించిన రైతులకు మాత్రం ఎకరాకు 20 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వస్తుంది. ఎక్కువ మంది రైతులు సరాసరి 15 క్వింటాళ్ళ దిగుబడి కూడా రావటంలేదు. మండలంలో అత్యధికంగా ఉమామహేశ్వర అగ్రహారం, పూరిమెట్ల, నాయుడుపాలెం, సుంకరవారిపాలెం, తమ్మలూరు, పసుపుగల్లు, శంకరాపురం, జమ్మలమడక, రామకృష్ణాపురం, మారెళ్ళ, గంగన్నపాలెం గ్రామాల్లో మిర్చి సాగును ఎక్కువగా సాగు చేశారు. గత నెల రోజుల నుంచి మిర్చి కోతలు వచ్చాయి. దిగుబడి తగ్గటంతో పాటు ధర కూడా లేక పోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది మిర్చికి మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉండటంతో ఈఏడాది రెట్టింపు స్థాయిలో సాగు చేశారు. తీరా తెగుళ్ళతో పాటు ధర లేకపోవటంతో నష్టాల బాట పట్టారు.
ఈ ఏడాది మిర్చికి ఆరంభం నుంచే జెమినీ, నల్లి, తామర, కొమ్మ తెగుళ్లు సోకాయి. తెగుళ్ళను అదుపు చేసేందుకు వివిధ రకాల మందులు వాడినా అదుపులోకి రాలేదు. దీంతో పెట్టుబడి పెరగగా, దిగుబడి తగ్గిపోయింది. దానికితోడు ధర కూడా అంతంత మాత్రంగానే ఉంది.
కోత కూలీ ఖర్చు కూడా రావడంరాలేదు
- సంకెల నారాయణరెడ్డి, ఉమామహేశ్వర అగ్రహారం
ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. వరుస తెగుళ్ళతో తీవ్రంగా నష్ట పోయాం. ధర చూస్తే పాతాళానికి పడి పోయింది. సరాసరి ఎకరానికి రూ.50 వేలు మేర నష్టం వస్తుంది. కోత ఖర్చులు కూడా రాలేదు. .
మిర్చి రైతులను ఆదుకోవాలి
- పి.జానీ, ఉమామహేశ్వర అగ్రహారం
ఈ ఏడాది మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాను. దిగుబడి బాగా పడిపోయింది. ఎకరానికి 15 క్వింటాళ్ళు కూడా రాలేదు. ఎకరానికి రూ.50 వేల మేర నష్టం వస్తుంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.