ఉపాధి హామీలో రాష్ట్రంలో కోనసీమకు ప్రథమ స్థానం
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:17 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపా రు.

రోజువారీ సగటు వేతనం రూ.291
కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపా రు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కూలీలకు 57లక్షల పనిదినాలు కల్పించడం లక్ష్యం కాగా, ఇప్పటికే 56 లక్షల పనిదినాలు కల్పించి ఈ ఘనత సాధించినట్టు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు శుక్రవారం అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో ఉపాధి హామీ పథకంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో చిన్నా, సన్నకారు రైతులు లక్ష ఎకరాల్లో పండ్లతోటల పెంపకానికి ప్రణాళికలు, పంట సేద్యపు నీటి కుంటల నిర్మాణం, గోకులాలు, సీసీ రోడ్ల నిర్మాణాల పురోగతిపై జిల్లాల వారీగా కలెక్టర్లను వారు సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్సు అనంతరం కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రోజువారీ సగటు వేతనాన్ని రూ.291.21గా చెల్లిస్తూ కోనసీమ జిల్లా రాష్ట్రంలో ప్రతమస్థానంలో నిలిచిందన్నారు. పల్లె పండుగలో భాగంగా 896 గోకులాలు మంజూరుచేయగా 720 నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన వాటిని నెలాఖరు నాటికి పూర్తిచేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 110 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు మంజూరు చేయగా వీటిలో 84 కిలోమీటర్ల అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన వాటిని నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని పకగ్బంధీగా అమలు చేయడంతోపాటు కూలీల రోజువారీ వేతనాన్ని రూ.300 వరకు ఇచ్చేందుకు పాటుపడాలన్నారు. బోగస్ మస్తర్లకు అడ్డుకట్ట వేయడంతోపాటు పనివేళల్లో మార్పులు చేస్తూ కూలీలకు గిట్టుబాటు వేతనం అందించాలన్నారు. వేసవి సీజన్‌లో పని జరిగే ప్రాంతాల్లో నీడ కోసం షెడ్లు ఏర్పాటుచేయడంతోపాటు సురక్షిత తాగునీరు అందించాలన్నారు. ప్రాథమిక చికిత్స, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వేతన మోనటరింగ్ కమిటీతోపాటు మూడు అంచెల తనిఖీ వ్యవస్థను ప్రభుత్వం అమలులోకి తెచ్చిందన్నారు. ఉద్యోగులు అవినీతికి పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి సాగునీటి ఎద్దడి నివారణకోసం కృషిచేయాలని, దీనివల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గించవచ్చన్నారు. డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ పి.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.