జిల్లాలో ఐదు శక్తి టీమ్‌లు ఏర్పాటు
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:15 AM
నిత్య జీవితంలో మహిళలు, యువతులు, బాలికలపై రోజురోజుకు పెరుగుతున్న వేధింపులను అరికట్టడానికి పోలీసులు నడుం బిగించారు.

శక్తి ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ యాప్‌పై అవగాహన కల్పించండి
మహిళా పోలీసులకు స్కూటీలు అందించిన ఎస్పీ కృష్ణారావు
అమలాపురం, మార్చి21(ఆంధ్రజ్యోతి): నిత్య జీవితంలో మహిళలు, యువతులు, బాలికలపై రోజురోజుకు పెరుగుతున్న వేధింపులను అరికట్టడానికి పోలీసులు నడుం బిగించారు. ముఖ్యంగా వారిలో చైతన్యం పురికొల్పి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు వీలుగా జిల్లాలో ‘శక్తి’ పేరుతో మహిళా పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎస్పీ బి.కృష్ణారావు ఐదు ప్రత్యేక మహిళా పోలీసు బృందాలను శక్తి టీమ్‌లుగా ఏర్పాటుచేశారు. వారికి స్కూటీలను కూడా అందజేసి జిల్లావ్యాప్తంగా తిరుగుతూ మహిళల్లో చైతన్యం తీసుకురావడంతోపాటు వారు ఎదుర్కొంటున్న వేధింపులు, ఇతర సమస్యలను తెలుసుకునేందుకే ఈ శక్తి బృందాల్లోని మహిళా పోలీసులు ప్రత్యేక కృషి చేస్తారు. అంతేకాకుండా వీరికోసం శక్తి ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ యాప్‌ను కూడా రూపొందించి దానివల్ల కలిగే ఉపయోగాలను వారికి తెలియజేస్తూ యాప్‌పై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఐదు శక్తి టీమ్‌లను జిల్లా ఎస్పీ కృష్ణారావు ఏర్పాటుచేశారు. వాటిలో అమలాపురం పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో రెండు, కొత్తపేట పోలీసు సబ్ డివిజన్ పరిధిలో రెండు, రామచంద్రపురం పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో ఒక టీమ్ ఏర్పాటయ్యాయి. మ హిళలు, ఆడపిల్లల భద్రత కోసమే ఇవి ప్రత్యేకంగా పనిచేస్తాయి. ఈ సందర్భంగా ఎస్పీ, మహిళా పోలీసులతో శుక్రవారం జిల్లా ఎస్పీ కా ర్యాలయం వద్ద ఏర్పాటుచేసిన శక్తి టీముల్లోని సభ్యులకు వెహికల్స్‌ను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. జిల్లాలో మహిళలు, యువతులు, ఆడపిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా దగ్గరలో ఉండే పోలీసుస్టేషన్లు, శక్తి బృందాలకు తెలియచేయడంతోపాటు శక్తి యాప్‌ను వినియోగించుకోవాల్సిందిగా ఎస్పీ సూచించారు. ఎస్పీ అందించిన శక్తి సింబల్స్‌తో ఉన్న స్కూటీ వాహనాలతో మహిళా పోలీసులు అమలాపురం పట్టణ పురవీధుల్లో ర్యాలీగా తిరిగారు. యాప్, శక్తి టీమ్‌ల లక్ష్యాలను ప్రజలకు వివరించారు. అడ్మిన్ ఎస్పీ ప్రసాద్, డీఎస్పీ ప్రసాద్, పట్టణ సీఐ వీరబాబు, పలువురు మహిళా ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.