చికిత్స ఏదీ?
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:41 AM
పేదల పెద్దాసుపత్రి అయిన జీజీహెచ్‌లో ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహారం తయారైంది. సూపర్ స్పెషాలిటీ సేవలందించాల్సిన వైద్యులు వారంలో ఒకట్రెండ్రోజులు మాత్రమే కనిపిస్తున్నారు. ఆ సమయంలోనూ మొక్కుబడి వైద్యానికి పరిమితమవుతున్నారు.

విధులకు రారు.. నాడి పట్టరు..
ఆరు నెలలుగా వార్డుల ముఖం చూడని ఆస్పత్రి సూపరింటెండెంట్
అందుబాటులో ఉండని వైద్యులు
రోగుల స్పెషల్ రూముల్లో సిబ్బంది రెస్ట్
కలెక్టర్ హెచ్చరించినా మారని తీరు
జీజీహెచ్‌లో ఇష్టారాజ్యంగా వ్యవహారం
పేదల పెద్దాసుపత్రి అయిన జీజీహెచ్‌లో ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహారం తయారైంది. సూపర్ స్పెషాలిటీ సేవలందించాల్సిన వైద్యులు వారంలో ఒకట్రెండ్రోజులు మాత్రమే కనిపిస్తున్నారు. ఆ సమయంలోనూ మొక్కుబడి వైద్యానికి పరిమితమవుతున్నారు. అత్యవసర సేవలు అంతంతమాత్రమే. పైగా ఆసుపత్రి కీలక అధికారి అయిన సూపరింటెండెంట్ విధుల్లో చేరి ఆరు నెలలు అయినా నేటికీ ఒక్కరోజు కూడా రోగులు ఉండే వార్డులో అడుగుపెట్టలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వైద్యసిబ్బంది సంగతి సరేసరి. దీంతో రోగాలతో రొప్పుతూ వచ్చే బాధితులకు ఇక్కడ మెరుగైన వైద్యానికి భరోసా కరువైంది. స్వయంగా కలెక్టర్ రాత్రివేళ వచ్చి తనిఖీలు చేసి హెచ్చరించినా ఎటువంటి మార్పులేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు, కార్పొరేషన్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యం గగనంగా మారింది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మంది డాక్టర్లు బయట ప్రైవేటు ఆస్పతుల్లో సేవలందిస్తూ ఇక్కడ మాత్రం మొక్కుబడిగా పనిచేస్తున్నారు. ఒకపక్క జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలని ప్రభుత్వం చూస్తుండగా, ఇక్కడ మాత్రం వైద్యులు మొక్కుబడి సేవలకు పరిమితమవుతున్నారు. క్యాన్సర్, న్యూరాలజీ, న్యూరోసర్జన్, గుండె, నెఫ్రాలజీ, ఇతర సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలకు సంబంధించి శస్త్ర చికిత్సలు కూడా కరువయ్యాయి. వారంలో ఒకట్రెండ్రోజులు మాత్రమే విధుల్లో కనిపించే వైద్యులు శస్త్ర చికిత్సలకు బయట ఆసుపత్రులకు సిఫారసు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన రోజుల్లో వారు విధులకు డుమ్మా కొడుతుండటంతో ఆ కొద్ది సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు కూడా పేదలకు దూరమవు తున్నాయి. అయితే వారంలో ఎన్ని ఆపరేషన్‌లు జరుగుతున్నాయి.. ఎంతమంది స్పెషాలిటీ వైద్యసేవలకు వస్తున్నారో కూడా కనీస సమాచారం లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ వచ్చారు.. కానీ అసలు అధికారి రారు..
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రోగుల బాగోగులను తెలుసుకునేందుకు ఎంత బిజీలో ఉన్నప్పటికీ కలెక్టర్ తీరిక చేసుకుని మరీ ఆసుపత్రికి వచ్చి పరిశీలించారు. వార్డుల్లో తనిఖీలు చేశారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆసుపత్రిలో కీలక అధికారి, రోగులకు మెరుగైన సేవలు, ఇతర సమస్యలపై దృష్టిసారించాల్సిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ టి.జమున మాత్రం బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఒక్కరోజు కూడా వార్డుల్లో పర్యటించలేదని సమాచారం. ఆ విషయాన్ని అక్కడి రోగులే కాదు, సిబ్బంది సైతం చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో తిరుపతి నుంచి వచ్చిన ఆమె ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. తిరుపతిలో నివాసం ఉంటున్న ఆమె.. వారంలో మూడు రోజులు ఒంగోలులో, మూడు రోజులు తిరుపతిలో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మూడు రోజులు చాంబర్‌కే పరిమితమై ఉంటారని తెలిసింది. కనీసం రోగులకు వైద్యసేవలు ఎలా అందుతున్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉద్యోగుల అవసరాలు.. ఇవేమీ ఆమెకు పట్టవని సిబ్బంది బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వెద్యారోగ్య శాఖ అధికారుల నిర్వహించే వీడియో, టెలీకాన్ఫరెన్స్‌ల హాజరుకు పరిమితం అవుతున్నారని సమాచారం. అత్యధికశాతం మంది నర్సింగ్ స్టాఫ్‌కు సూపరింటెండెంట్ ఎలా ఉంటారో కూడా తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం. అలాంటిది ఇక రోగుల బాగుగోలు ఆ అధికారికి ఎలా గుర్తుకు వస్తాయనేది ఇప్పుడు జీజీహెచ్‌లో చర్చనీయాంశం.
సిబ్బంది విశ్రాంత గదులుగా స్పెషల్ రూంలు
జీజీహెచ్‌లో నామమాత్రపు రుసుంతో రోగుల కోసం కేటాయించిన స్పెషల్ రూంలు సిబ్బంది విశ్రాంతి గదులుగా మారాయి. ఆదాయ వనరులు సమకూర్చే ఈ రూంలు రోగులడిగితే ఖాళీ లేవు అని సమాధానం వినిపిస్తోంది. వాటి తాళాలు మాత్రం డాక్టర్లు, నర్సుల చేతుల్లో ఉంటున్నాయి. కొన్ని స్పెషల్ రూంలు నర్సింగ్ విద్యార్థుల వసతి కోసం కేటాయించగా, మరికొన్ని డాక్టర్లు, నర్సుల స్వాధీనంలో ఉన్నాయి. డ్యూటీ సమయాల్లో రోగుల సేవల్లో ఉండాల్సిన వీరు స్పెషల్ రూంలలో విశ్రాంతి తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేవిషయాన్ని ఆసుపత్రిలోని కొందరు వైద్యాధికారులు సైతం వెల్లడిస్తున్నారు. రోగుల పట్ల కనీసం కనికరం కూడా చూపని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పనితీరుపై పదేపదే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణాధికారిగా ఉన్న సూపరింటెండెంట్ మాత్రం ఇవేమీ తనకు పట్టదన్నట్లు వ్యవహరించడంతో ఇక జీజీహెచ్‌లో ఎవరి దారి వారిదే అన్నట్లుగా తయారైంది. అయితే జీజీహెచ్‌లో రోగుల జబ్బుకు వైద్యం పక్కనపెడితే వైద్యులు, వైద్యసిబ్బందికే తగిన చికిత్స అవసరం ఉందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
కొంత మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు నాకే తెలియదు
డాక్టర్ టి.జమున, జీజీహెచ్ సూపరింటెండెంట్
జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. అయితే వారు సూపరింటెండెంట్ పరిధిలో పనిచేసినా సెలవులు, ప్రమోషన్లు, ఇతరత్రా రిమ్స్ ప్రిన్సిపాల్ పరిధిలో ఉంటాయి. చాలామంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరో పేర్లు కూడా నాకు తెలియదు. ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు లేరు. అలాగే కార్డియోసర్జన్ ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు లేనందున సేవలు అందుబాటులోకి రావడం లేదు. సమస్యలపై డీఎంఏకి లేఖ రాశాం. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ మెరుగైన సేవలు అందిస్తాము.