సహకార బ్యాంకుపై సభాసంఘం
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:38 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రకాశం జిల్లా సహకార కేంద్ర (పీడీసీసీ) బ్యాంకులో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయి. నాటి వైసీపీ పాలకవర్గాలు.. వారి సహకారంతో పలు ప్రాంతాల ఆ పార్టీ నేతలు, బ్యాంకు పరిధిలోని కొందరు అధికారులు, ఉద్యోగులు అడ్డగోలుగా వ్యవహరించి దోచేశారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తిం చింది. వాటిని వెలికితీయాలని నిర్ణయించింది.

ఇప్పటికే త్రిసభ్య కమిటీ విచారణలో పలు అక్రమాలు గుర్తింపు
తాజాగా అసెంబ్లీలో విస్తృత చర్చ
సభాసంఘంతో విచారణ చేయాలని తీర్మానం
ఆందోళన చెందుతున్న అక్రమార్కులు
ఒంగోలు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రకాశం జిల్లా సహకార కేంద్ర (పీడీసీసీ) బ్యాంకులో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయి. నాటి వైసీపీ పాలకవర్గాలు.. వారి సహకారంతో పలు ప్రాంతాల ఆ పార్టీ నేతలు, బ్యాంకు పరిధిలోని కొందరు అధికారులు, ఉద్యోగులు అడ్డగోలుగా వ్యవహరించి దోచేశారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తిం చింది. వాటిని వెలికితీయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి తాజాగా అసెంబ్లీ సమావేశాలలో పెద్దఎత్తున చర్చ జరగ్గా అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏకంగా శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ మేరకు అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజైన గురువారం సభలో తీర్మానం చేశారు. డీసీసీబీపై ఇప్పటికే త్రిసభ్య కమిటీ చేసిన విచారణలో అనేక అక్రమాలు, అవకతవకలు, వెలుగుచూశాయి. వాటిపై సమగ్రంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలకు 51 విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ విచారణ ప్రారంభం కాకముందే సభా సంఘం ఏర్పాటుతో డీసీసీబీలో అక్రమాలకు పాల్పడిన వారిలో ఆందోళన కనిపిస్తోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ఉమ్మడి జిల్లాలో 173 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్)లు ఉన్నాయి. వాటి పరిధిలో రెండున్నర లక్షల మందికిపైగా రైతులు, మరికొంత మంది ఇతరవర్గాల వారికి 33 బ్రాంచిల ద్వారా సేవలు అందుతున్నాయి. మొత్తం సుమారు రూ.300కోట్ల డిపాజిట్లు ఉండగా ఏటా రెండున్నర వేల కోట్ల లావాదేవీలతో బ్యాంకు నడుస్తోంది. అయితే రుణాలు మంజూరు, వసూళ్లు, బ్యాంకు నిర్వహణ తదితర అంశాల్లో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. అధికారిక సమాచారం ప్రకారం జిల్లా బ్యాంకు పరిధిలో స్వయం సహాయక సంఘాలకు, జాయింట్ వైబీటీ గ్రూపుల (జేఎల్‌ఎస్)కు ఇచ్చిన రుణాల్లోనే దాదాపు రూ.150 కోట్ల వరకు బోగస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జగనన్న పాలవెల్లువ, ఇతర పథకాల రుణాలలో కోట్లాది రూపాయాల మేర ఇలా జరిగినట్లు సమాచారం. ఉప్పుగుండూరు ప్రాంతంలో బోగస్ రైతుల పేరుతో కోట్ల రూపాయల రుణాలను కొందరు స్వాహా చేయగా సరైన ఆధారాలు లేవంటూ సహకారశాఖ అధికారులు ఆ కేసును మూసేశారు.
త్రిసభ్య కమిటీ విచారణ
బ్యాంకులో అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుతో విచారణ చేయాలని కలెక్టర్ అన్సారియాను ఆదేశించగా నాలుగు నెలల క్రితం డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీతో విచారణ చేయించారు. అందులో బిల్డింగ్‌ల మరమ్మతులు, కార్యాలయ నిర్వహణ, న్యాయవాదులకు ఫీజుల చెల్లింపు, జగనన్న పాలవెల్లువ రుణాలలో బోగస్‌లు, కొందరు ఉద్యోగులు బ్యాంకు డబ్బును అక్రమంగా వాడుకోవడం, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలు, కంప్యూటరీకరణలో అవినీతి ఇలా అనేక అంశాలను గుర్తించారు. దీంతో 51 విచారణ చేయాలని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించగా సంబంధిత అధికారి నియామకంలో కొంత జాప్యం జరిగి అది ప్రారంభం కాలేదు.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చ
ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలోని డీసీసీబీలలో అక్రమాలపై పెద్ద చర్చ సాగింది. అందులో పీడీసీబీలో జరిగిన అక్రమాలను కూడా పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నట్లు పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తూ శాఖపరంగా కాకుండా ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తదనుగుణంగా గురువారం సభాసంఘం ఏర్పాటు చేస్తూ తీర్మానించింది. అందులో సభ్యులు ఎవరెవరు అన్నది త్వరలో తెలియనుంది. ఆ సంఘం విచారణలో అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.