మెడికల్ మాఫియా
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:36 AM
ప్రజల ప్రాణాలతో మెడికల్ మాఫియా చెలగాటం ఆడుతోంది. నిబంధనలను ఉల్లంఘించి షాపులలో ఇష్టారాజ్యంగా మందు బిళ్లల నుంచి ఇంజెక్షన్లు వరకూ విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన మందులు సైతం దుకాణాలలో దర్శనమిస్తున్నాయి. డాక్టర్ సిఫార్సులు లేకుండా మందులు అమ్ముతు న్నారు. ఈ విషయం శుక్రవారం విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో బయటపడింది.

ఫార్మసిస్టులు లేరు, బిల్లులు ఇవ్వరు
డాక్టర్ల సిఫార్సు లేకుండానే విక్రయాలు
మెడికల్ షాపులలో ఇదీ పరిస్థితి
జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో విజిలెన్స్ తనిఖీలు
ఒంగోలుక్రైం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ప్రాణాలతో మెడికల్ మాఫియా చెలగాటం ఆడుతోంది. నిబంధనలను ఉల్లంఘించి షాపులలో ఇష్టారాజ్యంగా మందు బిళ్లల నుంచి ఇంజెక్షన్లు వరకూ విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన మందులు సైతం దుకాణాలలో దర్శనమిస్తున్నాయి. డాక్టర్ సిఫార్సులు లేకుండా మందులు అమ్ముతు న్నారు. ఈ విషయం శుక్రవారం విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అందులోభాగంగా జిల్లాలోని మార్కాపురం, ఒంగోలు, కంభం, టంగు టూరులలో 10 మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. అనేక ఉల్లంఘనలకు మెడికల్ షాపుల యజమానులు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఫార్మసిస్టులు లేకుండా మందులు విక్రయించడమే కాకుండా ఎవరికీ బిల్లులు ఇవ్వడం లేదు. అదేవిధం గా కాలం చెల్లిన మందులు ప్రత్యేకమైన పెట్టెలలో ఉంచాలి. అయితే అలాంటివి అనేకం మామూలు మందులతోపాటే ఉండటం మెడికల్ షాపులలో కనిపించింది. ఇంజెక్షన్లు ఫ్రీజర్‌లో ఉంచకుండానే విక్రయిస్తున్నారు. ఒక మెడికల్ షాపులో అయితే అసలు రికార్డులే నిర్వహించడం లేదు.
పది దుకాణాలలో తనిఖీలు
జిల్లాలో మూడు విజిలెన్స్ బృందాలు నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేశాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు, డ్రగ్స్ అధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, ఈగల్ టీమ్ ఈ తనిఖీలలో పాల్గొన్నాయి. ఒంగోలులో 5, మార్కాపురంలో 2, కంభంలో 2, టంగుటూరులో ఒక మెడికల్ షాపును పరిశీలించాయి. అందులో తొమ్మిది దుకాణాలలో నిబంధనలు పాటించడం లేదని గుర్తించాయి. ముఖ్యంగా డాక్టర్ల సిఫార్సు లేకుండా హెచ్1 డ్రగ్స్ విక్రయిస్తున్నారు. అదేక్రమంలో కాలం చెల్లిన మందులు వేరుగా ఉంచడం లేదు. నిబంధనల ప్రకారం దుకాణాలలో ఫార్మాసిస్టు ఉండి మందులు విక్రయించాలి. అయితే కేవలం ఫార్మాసిస్టు సర్టిఫికెట్‌తో లైసెన్సులు పొంది ఎలాంటి డాక్టర్ల సిఫార్సులు లేకుండా మందులు విక్రయించడం చట్టవిరుద్ధం. అయితే డాక్టర్ చీటీలు లేకుండా విక్రాయాలు చేస్తున్నట్లు తనిఖీలలో అధికారులు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనలపై సంబంధిత యజమానులకు నోటీసులు జారీచేయనున్నారు.
మూడు బృందాలు తనిఖీ
రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కొల్లి శ్రీనివాసరావు పర్యవేక్షణలో మూడు బృందాలు నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్‌లు రాఘవరావు, రవిబాబు, ఎస్‌ఐ నాగేశ్వరరావు, డ్రగ్స్ కంట్రోల్ ఏడీ జ్యోతి, ఇన్‌స్పెక్టర్లు విజయలక్ష్మి, సంధ్య, ఉషారాణి, డీసీటీవో రామారావు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, ఈగల్ టీమ్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.