పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:31 AM
టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం లభిస్తోంది. పలు పపనులు పునఃప్రారంభమయ్యాయి. మరికొన్నింటికి త్వరలో నిధులు విడుదల కాబోతున్నాయి.

కూటమి ప్రభుత్వం రాకతో పలు పథకాల పనులు పునఃప్రారంభం
దర్శి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం లభిస్తోంది. పలు పపనులు పునఃప్రారంభమయ్యాయి. మరికొన్నింటికి త్వరలో నిధులు విడుదల కాబోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి, అసమర్థతతో పథకాలన్నీ అర్ధంతరంగా నిలిచిపోయాయి. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత టీడీపీ హయాంలో ప్రారంభించి నిలిచిపోయిన పథకాలను పునఃప్రారంభిస్తోంది. కొత్తవాటికి శ్రీకారం చుట్టింది.
దర్శి పట్టణంలోని తూర్పుగంగవరం రోడ్డులో గత వైసీపీ పాలనలో ప్రారంభించి నిలిచిపోయిన టీటీడీ కల్యాణ మండపం పనులు శరవేగంతో జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారేగాని పనులు మాత్రం ప్రారంభంకాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడి,్డ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషితో రూ.2 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి.
తాళ్లూరు మండలం గుంటిగంగమ్మ సమీపంలో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న మొగిలిగుండాల రిజర్వాయర్ పనులను పునఃప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు శంకుస్థాపన చేశారు. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపుతో టెండర్లను రద్దుచేసింది. 2021లో మళ్లీ అట్టహాసంగా శంకుస్థాపన చేసింది. పనులు మాత్రం జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని పునఃప్రారంభించారు. ప్రస్తుతం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దొనకొండలో సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో కదలిక ప్రారంభమైంది. దర్శిలో నిలిచిపోయిన జాతీయ స్థాయి డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు కొద్దిరోజుల క్రితం స్పష్టమైన హామీ ఇచ్చిన విషయం విదితమే. దర్శిలో త్వరలో అన్న క్యాంటీన్ ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో కదలిక రావడంతో దర్శి నియోజకవర్గం అభివృద్ధి వైపు సాగుతోంది. ఇంకా నిలిచిపోయిన కోల్డ్ స్టోరేజీ, మినీ స్టేడియం నిర్మాణాలకు నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.