పక్కా పల్లెలకు పాలక పెద్దలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:51 AM
మారుమూల పల్లెటూర్లు. ఒకవైపు సముద్రమే హద్దుగా ఉన్న కుగ్రామాలు. మరోపక్క కొండలే హద్దుగా ఉన్న వలస బతుకులకు నిలయమైన పల్లెలు. ఎన్నడూ ఉన్నత స్థాయి పాలక ప్రభువులు చూడని ఊర్లు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అలాంటి గ్రామాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లు రాబోతున్నారు.

ఉమ్మడి జిల్లాలో రేపు సీఎం, ఎల్లుండి లోకేష్ పర్యటన
ఒకవైపు సముద్రం.. మరోవైపు కొండలే హద్దు
ఇటు రెక్కాడితేకాని డొక్కాడని బడుగు, బలహీన వర్గాల ప్రజలు
అటు రెక్కల కష్టం చేసినా ఫలించక వలసపోతున్న బతుకులు
పర్చూరు, కనిగిరి ఎమ్మెల్యేలు ఏలూరి, ఉగ్ర వ్యూహాత్మక అడుగులు
చంద్రబాబు, లోకేష్‌ల స్పందనపై భారీగా ఆశలు పెట్టుకున్న ప్రజానీకం
మారుమూల పల్లెటూర్లు. ఒకవైపు సముద్రమే హద్దుగా ఉన్న కుగ్రామాలు. మరోపక్క కొండలే హద్దుగా ఉన్న వలస బతుకులకు నిలయమైన పల్లెలు. ఎన్నడూ ఉన్నత స్థాయి పాలక ప్రభువులు చూడని ఊర్లు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అలాంటి గ్రామాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లు రాబోతున్నారు. వారు రావడమే ఆనందం అయినప్పటికీ తమ బతుకుల బాగుకు, సామాజిక అభివృద్ధికి వారు ఇచ్చే హామీల కోసం అక్కడి ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. పర్చూరు నియోజకవర్గానికి సీఎం మంగళవారం రానున్నారు. అలాగే కనిగిరి నియోజకవర్గానికి ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్, పారిశ్రామిక దిగ్గజమైన రిలయన్స్ సంస్థ అధిపతుల్లో ఒకరైన అనంత్ అంబానీ బుధవారం వస్తుండటంతో పండుగ వాతావరణం నెలకొంది.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతినెలా 1వ తేదీన రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీకి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పర్యాయం అందుకు పర్చూరును ఎంచుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో అందుకు నాంది పలికేందుకు కనిగిరి నియోజకవర్గానికి నారా లోకేష్, అనంత్ అంబానీలు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డిలు మారుమూల పల్లెలకు వారిని తీసుకెళ్లి అక్కడే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం విశేషం.
పర్చూరు నియోజకవర్గానికి సీఎం
పర్చూరు నియోజకవర్గానికి రావాలని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో సహజంగానే రాజకీయంగా ఏదో ఒక కీలకమైన గ్రామంలో లేక కూడలి ఊరిలో కార్యక్రమం ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. కానీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలోని కుగ్రామమైన కొత్తగొల్లపాలెంలో కార్యక్రమం ఏర్పాటు చేయించారు. చినగంజాం మండలంలోని పెద్దగంజాం పంచాయతీ పరిధిలో కొత్తగొల్లపాలెం ఉంది. సముద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఆ ఊరిలోనే కాక పెద్దగంజాం పంచాయతీ మొత్తంలో కూడా బడుగు, బలహీనవర్గాల ప్రజలే అధికం. గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం, వసతులు లేకపోయినా పట్టుబట్టి ఏలూరి అక్కడ సీఎం కార్యక్రమం ఏర్పాటు చేయించారు. దీంతో కొత్తగొల్లపాలెం వాసుల్లోనే కాక ఆ చుట్టూ ఉన్న తొమ్మిది గ్రామాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత నాలుగురోజుల నుంచి అక్కడకు వచ్చిపోయే అధికారులు, ప్రజాప్రతినిధులతో సందడి నెలకొంది. అంతేకాక ప్రజల సమస్యలను ఇంటింటికీ వెళ్లి అధికారపార్టీ నాయకులు, అధికారులు ఆరా తీస్తుండటం కూడా ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది.
ఊతమిస్తారని ఎదురుచూపులు
ఇటీవల ఎమ్మెల్యే ఏలూరి ప్రతిపాదించిన ఓడరేవు, పల్లెపాలెం ప్రాంతంలో షిప్‌యార్డు నిర్మాణం లాంటి అంశాలపై ముఖ్యమంత్రి స్పందన కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొమ్మిది గ్రామాలకు కూడలిగా ఉన్న పెద్దగంజాంలో సైతం ఇసుక నేలలే తప్ప కనీసం సిమెంట్ రోడ్లు కూడా లేని పరిస్థితి. అర్హత ఉండి పింఛన్లు అందుకోని ప్రజానీకం కూడా అపారంగా ఉంది. సబ్సిడీతో ఇచ్చే స్ర్పింక్లర్లు లాంటి వ్యవసాయ పఽథకాలు వినియో గంలో లేని దుస్థితి. ఇక నియోజకవర్గస్థాయిలో అయితే సాగునీటి వనరుల అభివృద్ధికి సంబంధించి సమస్యలు కోకొల్లలు. అయితే ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తున్నారని తెలిసి మురిసిపోతున్న ప్రజలు ఆయన తమ జీవనోపాధికి ఊతమిస్తారని ఆశగా చూస్తున్నారు.
కొండప్రాంతంలోనే లోకేష్ సభ
వలసలకు నిలయమైన కనిగిరి నియోజకవర్గంలో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం పలకనుండటం అక్కడి ప్రజల్లో కొత్త ఆశలను రేపింది. పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలోని కొండ ప్రాంతాల్లో బుధవారం లోకేష్, అనంత్ అంబానీల కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి కోసం పరిశ్రమలు రాబట్టేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఎమ్మెల్యే ఉగ్ర.. రిలయన్స్ సంస్థను తీసుకు రావడంలో సఫలీకృతులయ్యారు. రాష్ట్రంలో రిల యన్స్ బయోగ్యాస్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి సిద్ధమైంది. తొలి యూనిట్ కనిగిరిలో ఏర్పాటు చేసేందుకు లోకేష్ ఆసక్తిచూపడంతో ఉగ్ర కల నిజమైంది. అయితే కొండకు దిగువన జన సంచారం లేని ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటుకు అవకాశం లేదని అధికారులు చెప్పినా పట్టుబట్టి ఆ ప్రాంతాన్ని చదునుచేసి భూమిపూజ చేయిస్తానని ఒప్పించగలిగారు. దారి కూడా సరిగా లేని ఆ ప్రాంతానికి ఆగమేఘాలపై రోడ్డును నిర్మింపజేశారు. కొండకు దిగువన 25 ఎకరాలను నాలుగు రోజుల్లో బాగు చేయించారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. విషయం తెలిసి నియోజకవర్గ ప్రజలు గత నాలుగు రోజులుగా ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ జరిగిన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. రెండు హెలికాఫ్టర్లు దిగేందుకు, వేలాది మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు జరిగిపోయాయి.
బతుకులు మారతాయని ఆశలు
చుక్క నీరు దొరక్క, పనులు లేక వలస బతుకులకు నిల యమైన కనిగిరి నియోజకవర్గంలో రిలయన్స్ సంస్థ ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి నాంది పలికే కార్యక్రమం ఏర్పాటు చేయడం యావత్తు ప్రజానీకంలో చర్చనీయాంశమైంది. ఉపాధి కల నిజమై ప్రభుత్వ భూములు అపారంగా ఉన్న నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమల స్థాపన జరిగితే ప్రజల ఆశలు నెరవేరేం దారి ఏర్పడవ చ్చనే భావన నెలకొంది. మరి బుధవారం అక్కడకు రానున్న లోకేష్, అనంత్ అంబానీలు నియోజకవర్గంలో శాశ్వత అభి వృద్ధికి సంబంధించి ఎలాంటి వరాలు ఇస్తారన్న అంశంపై అం దరూ దృష్టి సారించారు. ఒక ట్రిపుల్‌ఐటీ నిర్మాణం, మరోవైపు సోలార్ ప్రాజెక్టులపై ఉన్న ఆశలకు సంబంధించి లోకేష్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది వేచిచూడాల్సి ఉంది.