ప్రకాశం నాకు ప్రత్యేకం
ABN , Publish Date - Apr 03 , 2025 | 02:29 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాపై తనకున్న అభిమానాన్ని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి చాటుకున్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తామన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామని తెలిపారు.

ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతాం
సీబీజీ ప్లాంట్ నాంది మాత్రమే..
ఒంగోలు మహానాడుతో పార్టీకి ఊపు
జిల్లాలో యువగళం ఓ ప్రభంజనం
ఎదురుగాలిలోనూ నలుగురిని గెలిపించిన చరిత్ర జిల్లాది
ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రాధాన్యతలో వెలిగొండ
కనిగిరిలో ట్రిపుల్ ఐటీ.. ఆగస్టులో రైల్వే లైను ప్రారంభం
పశ్చిమప్రాంతంలో భారీగా బయోగ్యాస్ ప్లాంట్లు
మంత్రులు రవి, స్వామిలకు ప్రశంసలు
జిల్లాపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించిన లోకేష్
ఘనంగా రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు భూమిపూజ
కొండ ప్రాంతానికి తరలివచ్చిన జనసందోహం
ఉమ్మడి ప్రకాశం జిల్లాపై తనకున్న అభిమానాన్ని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి చాటుకున్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తామన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామని తెలిపారు. అందుకు బుధవారం కనిగిరి నియోజకవర్గంలో బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన నాంది మాత్రమేనన్నారు. ప్రాధాన్యతాక్రమంలో మిగిలిన వాటిని కూడా చేపడతామన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, కనిగిరిలో ట్రిపుల్ ఐటీని నిర్మిస్తామని, పశ్చిమప్రాంతంలో మరిన్ని బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. దర్శి నుంచి పామూరు వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్ ఆగస్టులో ప్రారంభిస్తామని ప్రకటించారు. దివాకరపల్లి పరిధిలోని కొండ ప్రాంతంలో నిర్మించనున్న బయోగ్యాస్ ప్లాంట్‌కు లోకేష్ భూమిపూజ చేయగా.. జనం అశేషంగా తరలివచ్చారు. ఆయనకు ఘనస్వాగతం పలికారు.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
కనిగిరి నియోజకవర్గంలో బుధవారం పండుగ వాతావరణం నెలకొంది. పీసీపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి సంబంధించి యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలన్నీంటినీ నెరవేర్చుతామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక గాలిలో కూడా నలుగురు ఎమ్మెల్యేలను ఈ జిల్లాలో గెలిపించారని గుర్తుచేశారు. 2020-22లో ఒంగోలులో జరిగిన మహానాడు రాష్ట్ర రాజకీయ మలుపునకు నాంది అయిందని తెలిపారు. ఆ తర్వాత యువగళం పాదయాత్ర ఒక ప్రభంజనంలా నిర్వహించి జిల్లా ప్రజలు పార్టీకి మరింత ఉత్సాహాన్ని తెచ్చారన్నారు. గత ఎన్నికల్లో పది స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి మంచి విజయాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ఇవేమీ తాను మర్చిపోనని అందుకే గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు పలికామన్నారు. ఈ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి తోడ్పాటు ఇచ్చిన ఎమ్మెల్యే ఉగ్ర మరో 50వేల ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించినందున మరో 50 ప్లాంట్లు కనిగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
వెలిగొండను పూర్తిచేస్తాం
ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో ఐదు లక్షల ఎకరాల బీడు భూములను పారిశ్రామికంగా వినియో గంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ తెలిపారు. సభికుల నుంచి వెలిగొండ నినాదాలు రావడంతో ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ప్రాజెక్టుల్లో వెలిగొండ ఉన్నదన్నారు. దాన్ని కచ్ఛితంగా పూర్తిచేస్తామన్నారు. ఎమ్మెల్యే ఉగ్ర అడగటంతో కనిగిరి నుంచి పామూరు వరకు రైల్వేలైన్ నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రూ.12.30 కోట్లు ఈ నెలలో విడుదల చేస్తున్నారని తెలిపారు. ఆగస్టు నాటికి పనులు పూర్తిచేసి రైల్వేలైన్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. డాక్టర్ ఉగ్ర అడిగిన ప్రకారం కనిగిరి నియోజకవర్గంలో ట్రిపుల్‌ఐటీ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. యువగళం పాదయాత్రలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇచ్చిన హామీల జాబితా తన వద్ద ఉందన్న ఆయన.. ఒకదాని వెంట ఒకటి అన్నింటినీ అమలు చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రకటించారు.
నాయకులపైన ప్రేమానురాగాలు
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, శ్రేణుల పట్ల మంత్రి లోకేష్ ప్రేమానురాగాలు ప్రదర్శించారు. అటు హెలిప్యాడ్ వద్ద, ఇటు బహిరంగసభ వేదిక వద్ద డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పలుమార్లు ఆలింగనం చేసుకొని ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని బహిరంగపర్చారు. డాక్టర్ ఉగ్ర కుటుంబ సభ్యులతో కూడా ప్రత్యేకంగా కొంతసేపు ముచ్చటించారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌ను ‘పవర్’ మంత్రి అంటూ కొనియాడారు. మనకందరికీ స్వామిలాంటి వారు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అని కితాబిచ్చారు. ఇక హెలిప్యాడ్ నుంచి వేదిక వద్దకు వాహనంలో వెళ్లాల్సి ఉన్నా కాలినడకనే వెళ్లడం, రావడం చేసిన లోకేష్ మధ్యలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలను పలకరించేందుకు ఆసక్తి చూపారు. కరచాలనం కూడా చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల్లో రిలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్, సీఈవో త్రిపాఠి, రెండు తెలుగు రాష్ర్టాల బాధ్యతలు చూసే మాధవరావులకు ప్రాధాన్యం ఇచ్చి నాయకులందరికీ పరిచయం చేశారు. మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యను ప్రత్యేకంగా ఆలింగనం చేసుకొని గౌరవించారు. మరో ఇద్దరు చైర్మన్లు అయిన బాలాజీ, దినకర్‌లు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను అరే అంటూ పలకరించడం విశేషం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, బీఎన్ విజయ్‌కుమార్, కొండయ్య, నాగేశ్వరరావు, పార్టీ ఇన్‌చార్జిలు ఎరిక్షన్‌బాబు, గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, మాజీ ఎంపీపీ వీరయ్య తదితరులను పేరుపేరునా పలుకరించారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర పరిచయం చేయగా ఆ నియోజకవర్గంలోని నాయకులందరికీ కరచాలనం చేసి పలుకరించారు.
వలసల నివారణకు పాదయాత్రలోనే నిర్ణయం
యువగళంలో భాగంగా కనిగిరి నియోజకవర్గంలో పర్యటించినప్పుడే ప్రజల వలసల నివారణకు అనువైన అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయాలని నిర్ణయించుకున్నట్లు లోకేష్ తెలిపారు. ప్రతిరోజూ పాదయాత్ర ముగిసిన తర్వాత ముఖ్య నాయకులందరం సమీక్ష చేసుకుంటామని... ఆ సందర్భంగా డాక్టర్ ఉగ్ర నియోజకవర్గ దుస్థితిని, ప్రజల వలసల గురించి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. రిలయన్స్ సంస్థతో బయోగ్యాస్ ప్లాంట్‌పై ఒప్పందం జరగ్గానే మంత్రి రవికుమార్ నేను మాట్లాడుకొని కనిగిరికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
కొండ ప్రాంతంలో భారీ సభ
అది మారుమూల కొండ ప్రాంతం. కనీసం మేతకోసం పశువులు కూడా సంచరించడం అరుదు. రోడ్డుమార్గం కూడా లేని అలాంటి ప్రాంతంలో రిలయన్స్ సంస్థ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు భూమిని ప్రభుత్వం కేటాయించింది. అక్కడ భూమిని చదును చేసే బాధ్యత రిలయన్స్ సంస్థది. రహదారి, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. అలాంటి ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమానికి వారం క్రితం నిర్ణయం జరిగింది. బుధవారానికి ఆ ప్రాంతం మొత్తం వేలమందితో కళకళలాడింది. అందరినీ సమన్వయం చేసుకొని కార్యక్రమం ప్రాధాన్యతను వివరించి జనాన్ని కదిలించడంలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర సఫలీకృతులు కావడం వలనే అది జరిగింది. మంత్రి లోకేష్ ఉదయం 9.30కు వస్తాను 12 గంటలకు తిరిగి వెళ్తానని ఎమ్మెల్యే ఉగ్రకు తొలుత చెప్పారు. ఉదయం 9.52 గంటలకు లోకేష్ అక్కడకు రాగా 9 గంటలకే 12వేల మందికిపైగా ప్రజలు చేరారు. 11 గంటలకు సభ ప్రారంభమయ్యే సమయానికి ఆవరణలోనూ, బయట కలిపి 18 నుంచి 19 వేల మంది ఉన్నట్లు నిఘా విభాగం నిర్ధారించారు. ఆ జన సందోహాన్ని గమనించిన లోకేష్ అమితోత్సాహంతో ఉగ్రను ఒకటికి పదిసార్లు అభినం దించారు. ఇదంతా జరగటానికి కారణం కనిగిరి ప్రాంతానికి ఒక పరిశ్రమ రావ డమే. అత్యధికంగా పీసీపల్లి మండల వాసులు ప్రతి గ్రామం నుంచి తరలిరాగా నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు రావడం విశేషం.