భూముల రీసర్వేపై అవగాహన
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:39 AM
రైతుల భూములు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రీసర్వే చేసి పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం ద్వారా సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని తహసీల్దార్ జితేంద్ర అన్నారు.

బేస్తవారపేట, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రైతుల భూములు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రీసర్వే చేసి పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం ద్వారా సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని తహసీల్దార్ జితేంద్ర అన్నారు. బుధవారం మండలంలోని జగ్గంబొట్ల కృష్ణాపురం గ్రామంలో రీసర్వేపై అవగాహన సదస్సు, గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జితేంద్ర మాట్లాడుతూ రైతులు రీసర్వే సిబ్బందికి సహకరించి తమ భూములను సర్వే చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్వేయర్ నాగార్జునరెడ్డి, సలీమ్ పాల్గొన్నారు.
ఎన్‌టీఆర్ నగర్‌లో రీసర్వే
గిద్దలూరు : పట్టణంలోని పీఎంఏవై ఎన్‌టీఆర్ నగర్ (పూర్వ జగనన్న కాలనీ)లలో ప్రస్తుత స్థితిగతులపై రెవెన్యూ శాఖ అధికారులు రీసర్వే కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో ఇళ్లు ఎవరికి మంజూరయ్యాయి, ఎవరు నిర్మించారు, అందులో అసలైన లబ్ధిదారుడు ఉంటున్నాడా..? లేదా..? అద్దెకు ఇచ్చారా.?, ఇతరులకు అమ్మారా..? తదితర వివరాలు ఆరా తీశారు. ఈ లే-అవుట్‌లో క్రయవిక్రయాలపై ఫిర్యాదులు రావడంతో రీసర్వే కార్యక్రమాన్ని (విచారణ) నిర్వహించారు. నంద్యాల రోడ్డులోని రెండు కాలనీలలో వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు బృందాలుగా ఏర్పడి సర్వే చేశారు. వీఆర్‌వో టీం ప్రతినిధులు రంగయ్య, శేఖర్‌రెడ్డి, ఆంజనేయులు, కాశీం తదితరులు సిబ్బందితో సర్వే నిర్వహించారు.
మార్కాపురం రూరల్ : మండలంలోని రాయవరం గ్రామస్థులు తమ ఇళ్ల స్థలాలను గ్రామ మాజీ సర్పంచ్ ఆక్రమణకు యత్నిస్తున్నారని స్థానిక తహసీ ల్దార్ కార్యాలయంలో డీటీ శ్రీనివాసులుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామవరం గ్రామస్థులు మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో రాయవరం గ్రామ పరిధిలో 163/8 సర్వే నెంబర్‌లో ఇళ్లు లేని వారికి ప్రభుత్వం స్థలాలను మంజూరు చేసి ఇచ్చిందన్నారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దౌర్జన్యంగా స్థలాలను ఆక్రమించేందుకు ఇంటి బేస్‌మెంట్‌లను కూల్చి చదును చేస్తున్నారన్నా రు. సంబందిత అధికారులు విచారించి తమ ఇంటి స్థలాలను తమకు ఇప్పించాలని డిప్యూటీ తహసీల్దార్‌ను కోరారు.