Share News

Supreme Court Orders: విచారణకు హాజరవ్వాల్సిందే

ABN , Publish Date - Apr 02 , 2025 | 02:40 AM

సుప్రీంకోర్టు ఆదేశించినా గుంటూరు జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి విచారణకు సహకరించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో ఆమె ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది

 Supreme Court Orders: విచారణకు హాజరవ్వాల్సిందే

  • రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో గుంటూరు జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ ప్రభావతికి సుప్రీం ఆదేశం

  • ఇప్పుడు వాస్తవం ఏమిటో తెలియాల్సి ఉందని వ్యాఖ్య

  • 7, 8 తేదీల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకండి

  • విచారణకు సహకరిస్తామంటేనే మధ్యంతర రక్షణ కల్పించాం

  • రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో ధర్మాసనం

  • సుప్రీంకోర్టు చెప్పినా విచారణకు ప్రభావతి సహకరించడంలేదు

  • కోర్టులో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో ఈనెల 7, 8 తేదీల్లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని గుంటూరు జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత వైసీపీ హయాంలో అప్పటి ఎంపీగా ఉన్న తనను సీఐడీ కస్టడీలో తీవ్రంగా వేధించారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో రఘురామ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నమోదైన కేసులో డాక్టర్‌ ప్రభావతి ఏ5గా ఉన్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా నిరాశ ఎదురైంది. హైకోర్టు తీర్పును ప్రభావతి జనవరి 22న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ప్రభావతి తరఫున సీనియర్‌ న్యాయవాది మాధవి దివన్‌ వాదనలు వినిపిస్తూ... రఘురామకు వైద్యం చేసే సమయంలో ముగ్గురు వైద్యులు అక్కడ ఉన్నారని చెప్పారు. పిటిషనర్‌ కుమారుడు మానసిక సమస్యతో బాధ పడుతున్నాడని, కావున బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు.


సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభావతి విచారణకు సహకరించడం లేదన్నారు. దీనికి ప్రభావతి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కసారి మాత్రమే విచారణకు పిలిచారని చెప్పారు. సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, ప్రభావతికి ఎప్పుడు నోటీసులు పంపినా ఆమె అందుబాటులో లేరని చెబుతున్నారని తెలిపారు. ఏదో ఒకసాకు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘‘దర్యాప్తునకు సహకరిస్తానని చెబితేనే న్యాయస్థానం ప్రభావతికి జనవరి 31న మధ్యంతర రక్షణ కల్పించింది. ఇప్పుడు ఆమె సహకరిస్తున్నారా?లేదా? అనే సమస్య ఉత్పన్నమైంది. ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో ప్రభావతి విచారణకు హాజరుకావాలి’’ అని ధర్మాసనం ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 02:43 AM