ఆదాయవనరులపై అధికారుల నజర్
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:58 AM
నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని రకాల పన్నుల బకాయిలను రాబట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.

- అడ్వర్టయిజ్‌మెంట్ ఏజెన్సీలపై కొరడా
- బకాయిలు చెల్లించని హోర్డింగ్స్ తొలగింపు
-కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని రకాల పన్నుల బకాయిలను రాబట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్వయంగా రంగంలోకి వెళ్ళి మొండి బకాయిలను వసూలు చేయిస్తున్నారు. మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు ఆస్తిపన్నుల ి బకాయిలపై దృష్టి పెట్టారు. 90 శాతం వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విస్తృత ప్రచారం చేసి నోటీసులను జారీ చేశారు. గడువులోగా పన్నులను చెల్లించని ఆస్తులను జప్తు చేయడం, నల్లాలను తొలగించడం, గేట్లకు తాళాలు వేయడం వంటి చర్యలు తీసుకున్నారు. 75 శాతం పన్నులను వసూలు చేసి ఊపిరిపీల్చుకున్నారు. బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ పథకం గడువు ముగిసినందున వడ్డీతో సహా పన్నులను వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. నల్లా కనెక్షన్ల పెండింగ్ బిల్లులు, ట్రేడ్ లైసెన్సు ఫీజులతోపాటు ఆదాయవనరుల్లో ప్రధానమైన అడ్వర్టయిజ్‌మెంట్ పన్నులపై దృష్టి సారిస్తున్నారు.
ఫ నగరంలో 300 హోర్డింగ్స్
నగరంలో 300 వరకు వివిధ సైజుల్లోని హోర్డింగ్స్ ఉండగా కొన్ని ఏజెన్సీలు రెగ్యులర్‌గా పన్నులు చెల్లిస్తూ వారి అనుమతులను రెన్యూవల్ చేయించుకుంటున్నాయి. మూడు, నాలుగు సంవత్సరాల నుంచి పన్నులు చెల్లించని ఏజెన్సీలపై కొరడా ఝళిపిస్తున్నారు. కోటి రూపాయల వరకు బకాయిలు పేరుకు పోవడంతో పెద్ద మొత్తంలో బకాయిలున్న ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశారు. కొన్ని ఏజెన్సీల నిర్వహకులు స్పందించి పన్నులు చెల్లించారు. మిగిలిన కొంత మంది ప్రస్తుతం తమకు యాడ్స్ రావడం లేదని, ఏజెన్సీ తొలగించుకున్నామనే పలు కారణాలు చెబుతూ పన్నులు చెల్లించడం లేదు. దీంతో శుక్రవారం కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ వేణుతో కలిసి నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన హోర్డింగ్ బోర్డులను పరిశీలించారు. ఆయా బోర్డులకు సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్ పన్ను చెల్లించారా లేదా అన్నది పరిశీలించి, బకాయి ఉన్న బోర్డులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో కొన్ని హోర్డింగ్స్‌ను తొలగించారు. లక్షల్లో బకాయిలున్న ఏజెన్సీలకు సంబంధించిన హోర్డింగ్స్‌ను తొలగిస్తామని హెచ్చరించారు.