కార్పొరేటర్ల కలెక్షన్!
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:12 AM
జీవీఎంసీలో తాత్కాలిక పారిశుధ్య కార్మికుల పోస్టులను కూడా కొందరు కార్పొరేటర్లు అమ్ముకుంటున్నారు.

సింహాచలం కారిడార్‌లో 22 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికుల నియామకానికి గత కమిషనర్ ఆమోదం
వెంటనే అమ్మకానికి పెట్టిన కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు
రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల చొప్పున వసూలు
ఆప్కోస్‌లో చేర్పిస్తామంటూ ఆశావహులకు హామీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీలో తాత్కాలిక పారిశుధ్య కార్మికుల పోస్టులను కూడా కొందరు కార్పొరేటర్లు అమ్ముకుంటున్నారు. ఫలానాచోట పారిశుధ్యం బాగోలేదని...సిబ్బందిని నియమించాలని వారే అధికారులకు వినతిపత్రం ఇచ్చి...ఆమోదం రాగానే ఆశావహుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. తాజాగా జోన్-8 పరిధిలోని సింహాచలం కారిడార్‌లో 22 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికుల నియామకానికి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సింహాచలం బీఆర్‌టీఎస్ కారిడార్‌లో రాత్రి పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో తెల్లవారేసరికి అపరిశుభ్రంగా కనిపిస్తున్నదంటూ కొందరు కార్పొరేటర్లు మూడు నెలల కిందట జీవీఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. రోడ్లన్నీ చెత్తాచెదారంతో నిండివుండడంతో సింహాచలం వెళ్లే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని వివరించారు. కమిషనర్ దీనిపై పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన వైద్యాధికారితోపాటు జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. రాత్రిపూట రోడ్లను పరిశుభ్రం చేసే సిబ్బంది లేరని జోనల్ కమిషనర్ వివరించడంతో 22 మందిని రోజువారీ వేతనంపై నియమించుకునేందుకు కమిషనర్ అనుమతించారు. దీనిని ఆసరాగా తీసుకుని కొందరు కార్పొరేటర్లు...ఆశావహులను పిలిచి జీవీఎంసీలో ఉద్యోగాలంటూ నమ్మించారు. ఒక ప్రజా ప్రతినిధికి తాను ప్రధాన అనుచరుడినని, ఆయనతో చెప్పి ఉద్యోగం వచ్చేలా చేస్తానంటూ ఒక కార్పొరేటర్ ఏకంగా ఒక్కో పోస్టుకు రూ.1.5 లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. తనకు కూడా పోస్టులు ఇవ్వాలని పొరుగు వార్డు కార్పొరేటర్ ఒకరు పట్టుబట్టడంతో కొన్ని కేటాయించినట్టు సమాచారం. ఆయన తన కోటాగా వచ్చిన పోస్టులను రూ.లక్ష చొప్పున విక్రయించినట్టు ప్రచారం జరుగుతోంది. కొంతమంది జీవీఎంసీలో ఏం ఉద్యోగాలని ప్రశ్నించగా...పారిశుధ్య నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుందని, ఇంటికి దగ్గరల్లోనే పని ఉంటుందని, ప్రస్తుతం రోజుకు రూ.450 చొప్పున ఇస్తారని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ పని అందులోనూ రోజువారీ కూలీ ఉద్యోగానికి రూ.1.5 లక్షలు ఎందుకని కొందరు ప్రశ్నించగా, తనకు తెలిసిన ఎమ్మెల్యే ద్వారా పోస్టులన్నీ ఆప్కోస్‌లో చేరేలా చేస్తానంటూ భరోసా ఇచ్చినట్టు తెలిసింది. పోస్టులన్నీ అమ్ముకున్న కార్పొరేటర్లు...వారిని విధుల్లోకి తీసుకోవాలంంటూ జోనల్ కమిషనర్‌తోపాటు ప్రధాన వైద్యాధికారిపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీనికి ఇన్‌చార్జి కమిషనర్ అనుమతి అవసరం కాబట్టి, ఫైల్‌ను ఆయనకు పంపించామంటూ ఇంతవరకూ అధికారులు తాత్సారం చేశారు. ఇన్‌చార్జి కమిషనర్ నుంచి ఆమోదం రావడంతో ఈనెల రెండో తేదీ నుంచి 22 మంది తాత్కాలిక సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు. తాత్కాలిక పారిశుధ్య కార్మికుల పోస్టులు విక్రయించుకున్నారనే ఆరోపణలను జీవీఎంసీ అధికారుల వద్ద ప్రస్తావించగా తాము నిబంధనల ప్రకారమే వారందరినీ విధుల్లోకి తీసుకున్నామని, డబ్బులు వసూలు చేశారనే విషయం తమకు తెలియదని బదులివ్వడం విశేషం.