ఉపాధి ఫుల్
ABN , Publish Date - Apr 05 , 2025 | 01:09 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో మెండుగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.

జిల్లాలో 40 లక్షల పని దినాలు లక్ష్యం
గత ఏడాది రికార్డు దిశగా 37.71 లక్షల పనుల కల్పన
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో మెండుగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఈ ఏడాది 2025–26 ఆర్థిక సంవత్సరం 40 లక్షల పనిదినాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు యోచిస్తున్నారు. వాటితో పాటు 140 నీటి తొట్టెలు నిర్మించి మూగజీవాల దప్పిక తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అవే కాకుండా పూడికతీత పనులు, పండ్ల తోటల పెంపకం పనులు, పశుగ్రాసం పెంపకం, తాగునీటి చెరువుల పునరుద్ధరణ, మౌలిక వసతుల కల్పనకు అవకాశం కల్పించేలా ముందుకు వెళ్తున్నారు. ప్రతీ కూలీకి రూ.307 తగ్గకుండా వేతనం అందించేందుకు రూ.50 లక్షల వ్యయంతో అంచనాలు తయారు చేశారు.
తాడేపల్లిగూడెం రూరల్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) :
గతేడాది లక్ష్యాలకు చేరువగా..
గత ఏడాది ఉపాధి హామీ పథకంలో ముందుగా నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుని 96.69 శాతం విజయం సాధించారు. గతంలో 39 లక్షల పనిదినాల కల్పన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించగా 37.71 లక్షల పనిదినాలు కల్పించి రికార్డు సృష్టించారు.
చెరువుల పునరుద్ధరణ..
గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చెరువుల్ని నీరుకార్చేసింది. జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో తట్ట మట్టి కూడా తీయించలేదు. చెరువుల్లో మట్టి పేరుకుపోయి గట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి ఎండిపోతున్నాయి. చెరువుల పునరుద్ధరణ, జలసంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తొలిదశలో గ్రామానికో చెరువును ఎంపిక చేసి పూడిక తీయించి చెరువు గట్లను బలోపేతం చేయనుంది.
సగటు వేతనానికి భరోసా..
చాలామంది ఉపాధి కూలీలకు కూలి గిట్టుబాటు కావడంలేదు. ఈ మేరకు నిరాశతో ఉన్న కొంతమంది కూలీలు పనులకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితు ల్లో వేసవిలో రోజూ కనీసం సగటు వేతనం రూ.300 దక్కేలా అధికారులు పనులు చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం నాలుగు గంటలు పనిచేస్తే కూలి గిట్టుబా టు అయ్యేలా బృందానికి కొలతలతో మార్కింగ్ ఇస్తారు.
పశువులకు నీటి తొట్టెలు
ప్రతీ గ్రామంలో పశువులకు నీటి తొట్టెలను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడెక్కడ నీటి తొట్టెలు నిర్మించాలో అధికారులు నిర్ణయించాక పనులు ప్రారంభిస్తారు. పశువులు, మేకలు గొర్రెలు తిరిగే మార్గంలో బోరు, పంచాయతీ కుళాయి ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చి నిర్మాణ పనులు చేపడతారు. ఈనెలాఖరుకు నీటి తొట్టెల నిర్మాణం పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలందాయి.