Share News

ఇంటి దొంగలు

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:13 AM

వైసీపీ హయాంలో అనర్హులకు ఇళ్లను కేటాయించిన వ్యవహారంపై అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇంటి దొంగలు

  • జెర్రిపోతులపాలెం జగనన్న కాలనీలో అనర్హులకు స్థలాలు/ఇళ్లు కేటాయించినట్టు నిర్ధారణ

  • 79 మందిని గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం

  • వాటిని రద్దు చేస్తూ నిర్ణయం

  • నేతల ఒత్తిడితో మంజూరుచేసిన అధికారులు

  • అప్పటి తహసీల్దారు, వీఆర్వోపైనా చర్యలకు రంగం సిద్ధం

  • ‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్టు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ హయాంలో అనర్హులకు ఇళ్లను కేటాయించిన వ్యవహారంపై అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. నిరుపేద వర్గాలకు చెందిన వారికి మంజూరు చేయాల్సిన ఇళ్లు, స్థలాల జాబితాలో సంపన్నులకు చోటు కల్పించిన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు పెందుర్తి మండలం జెర్రిపోతుల పాలెంలో 79 మంది అనర్హులకు ఇళ్లు కేటాయించినట్టు తేల్చారు. వారికి మంజూరుచేసిన ఇళ్లను రద్దు చేయడంతో పాటు, అప్పటి తహసీల్దారు, వీఆర్వోపైనా చర్యలు తీసుకోనున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల కాలనీల పేరిట నగర శివార్లులో భారీ లే అవుట్లు వేశారు. అయితే జెర్రిపోతులపాలెంలో అనర్హులకు ఇళ్లు, స్థలాలు కేటాయించారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ చేసి పింఛన్‌ తీసుకుంటున్నవారు, బహుళ అంతస్థులు, నాలుగు చక్రాల వాహనాలు కలిగినవారు ఉన్నారు. జాబితా రూపొందించిన సమయంలోనే స్థానికులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఫలితంగా వారందరికీ ఇళ్లు మంజూరయ్యాయి. గ్రామంలో మొత్తం 134 మందికి ప్లాట్లు కేటాయించగా వారందరికీ గృహ నిర్మాణ సంస్థ ఇళ్లు మంజూరుచేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌ తీసుకునేవారు, బహుళ అంతస్థుల భవనాలు కలిగినవారు పట్టా మంజూరుకు అనర్హులు. కానీ అధికారులపై గ్రామానికి చెందిన ఓ వైసీపీ నేత ఒత్తిడి తేవడంతో నిబంధనలకు వ్యతిరేకంగా పెందుర్తి తహసీల్దారు ఐదేళ్ల క్రితం పట్టాలు మంజూరుచేశారు.

గ్రామీణ ప్రాంతం కావడంతో ఒక్కొక్కరికి 1.5 సెంట్ల విస్తీర్ణంతో పట్టా ఇచ్చారు. ప్రతి లబ్ధిదారుడికీ ఇంటి నిర్మాణం కోసం రూ.1.8 లక్షల చొప్పున మంజూరుచేశారు. పట్టాల మంజూరు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని అప్పట్లో గ్రామస్థులు ఫిర్యాదు చేసినా పెందుర్తి తహసీల్దారు పట్టించుకోలేదు. అయితే స్పందించిన గృహ నిర్మాణ సంస్థ అధికారులు మాత్రం 20 మందిని అనర్హులుగా గుర్తించి, కేటాయించిన ఇళ్లను రద్దు చేశారు. మిగిలిన 114 ఇళ్లకు పలు దఫాలుగా నిధులు మంజూరుచేశారు. గృహ నిర్మాణ సంస్థ కేటాయింపులతో సంబంధం లేకుండా లేఅవుట్‌లో 178 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. కొన్ని ఇళ్లు పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. గ్రామంలో ఎక్కువ మంది అనర్హులకు ఇళ్లు మంజూరుచేయగా, కేవలం 20 మందినే జాబితా నుంచి తప్పించి, మిగిలిన వారికి అనుమతి ఇచ్చిన వ్యవహారం వెనుక గృహనిర్మాణ సంస్థ అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల ‘పెద్దలకు పేదోళ్ల ఇళ్లు’ శీర్షికన ‘ఆంధజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై జిల్లా యంత్రాంగం, గృహ నిర్మాణ సంస్థలు స్పందించాయి. దీనిపై రెవెన్యూశాఖ అధికారులు విచారణ చేపట్టగా 79 మంది అనర్హులున్నట్టు తేలింది. మూడు రోజుల క్రితం జిల్లా హౌసింగ్‌ పీడీ సత్తిబాబు కాలనీని సందర్శించారు. దీంతో వారికి కేటాయించిన ఇళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇదిలావుండగా అనర్హులకు పట్టాలు మంజూరుచేసిన అప్పటి పెందుర్తి తహసీల్దారు, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం భావిస్తున్నట్టు సమాచారం.

Updated Date - Apr 05 , 2025 | 01:13 AM