Madanapalle Sub Collectorate: కొలిక్కి వస్తోన్న మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఫైల్స్ దగ్ధం కేసు
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:47 PM
Madanapalle Sub Collectorate: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో ఫైళ్ల దగ్ధం కేసు వ్యవహారంపై రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మరి కొద్ది నెలల్లో ఓ కొలిక్కి వస్తుందన్నారు.

చిత్తూరు, ఫిబ్రవరి19: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసు మరో ఐదారు నెలల్లో ఓ కొలిక్కి వస్తుందని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా వెల్లడించారు. బుధవారం మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం జరిగిన సబ్ కలెక్టర్ కార్యాలయంలోని భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరితో ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ..ఫైల్స్ దగ్ధం ఘటనకు సంబంధించి రాజకీయ నాయకులపై పలువురు ప్రజలు ఆరోపణలు చేశారని తెలిపారు.
ఆ దిశగా ఈ కేసు విచారణ కొనసాగిస్తున్నామన్నారు. అయితే మదనపల్లిలో ఫైల్స్ దగ్దం ఘటన చాలా బాధాకరమైన అంశమని చెప్పారు. ఇక ఈ కేసు విచారణ చాలా లోతుగా జరుగుతోందని పేర్కొన్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఇద్దరి ఆర్టీవోలతోపాటు సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశామని వివరించారు. మంటల్లో మొత్తం 2,400 ఫైల్స్ కాలిపోయాయన్నారు. వీటన్నింటిని పూర్తిగా రికవరీ చేశామని స్పష్టం చేశారు.
మరోవైపు ఈ కేసులో కొంత మంది బయట వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని.. దీంతో సీఐడీ పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించామని.. అందులో 8 వేల ఎకరాల భూములు అక్రమాలు జరిగినట్లు కనుగోన్నామని తెలిపారు.
Also Read: ఏదో తేడాగా ఉంది
అయితే అక్రమ రిజిస్ట్రేషన్ భూములపై ప్రత్యేకమైన దృష్టి సారించి.. క్యాన్సిలేషన్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటన చోటు చేసుకున్న రోజు.. తాను మదనపల్లిలో పర్యటించానని.. ఈ సందర్భంగా ప్రజల నుంచి తనకు 480కు పైగా ఫిర్యాదులుందాయని గుర్తు చేసుకున్నారు. వాటిలో 80 శాతం పరిష్కారం దశలో ఉన్నాయని ఆర్పీ సిసోడియా వివరించారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువు తీరింది. ఆ కొద్ది రోజులకే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని.. వందలాది ఫైళ్లు దగ్ధమైనాయి. ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాను మదనపల్లి వెళ్లి.. ఫైళ్ల దగ్ధం వ్యవహారంపై విచారణ జరపాలని ఆదేశించింది.
దీంతో హుటాహుటిన ఆయన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని.. ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అంతేకాదు.. ఈ ఫైళ్ల దగ్ధం వ్యవహారం యాదృచ్చికంగా జరిగింది కాదని.. కావలని చేసిందనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఇదే అంశాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసును సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది.
అంతేకాదు.. ఈ వ్యవహారంలో ఇద్దరు ఆర్డీవోలతోపాటు ఓ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే దగ్ధమైన అన్నీ ఫైళ్లకు సంబంధించి.. పూర్తి సమాచారాన్ని రికవరీ చేసింది. మరో ఐదారు నెలల్లో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని ఆర్పీ సిసోడియా స్పష్టం చేశారు. దీంతో అవినీతి, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతోన్నాయనే ఓ చర్చ సైతం మదనపల్లిలో సాగుతోంది.
For AndhraPradesh News And Telugu News