Share News

చక్రవర్తీ.. వెళ్లిపోయావా..!

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:49 AM

ఓ వైపు పేదరికం. మరోవైపు పెద్ద కుటుంబం. ఇది చాలదన్నట్టు వృద్ధులైన తల్లిదండ్రులు. తండ్రికి పక్షవాతం. దివ్యాంగులైన ఇద్దరు అక్కలు. భార్య, మూడేళ్లలోపు ఇద్దరు పిల్లలు. తనతో కలిసి ఎనిమిది మంది కుటుంబం. అతను రోజు కూలికి వెళితేనే కుటుంబం గడు స్తుంది. అలాంటి ఆ పేదింట పెనువిషాదం చోటు చేసుకుంది.

చక్రవర్తీ.. వెళ్లిపోయావా..!
ఇద్దరు పిల్లలతో భార్య మౌనిక

పేదింట పెద్ద విషాదం

మినప కోత యంత్రం మీద పడి కూలీ మృతి

ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఇతనే ఆధారం

పక్షవాతంతో తండ్రి.. దివ్యాంగులైన ఇద్దరు అక్కలు

వృద్ధురాలైన తల్లి.. అనాథలైన భార్య, ఇద్దరు చిన్నారులు

మాకు దిక్కెవరంటూ విలపిస్తున్న కుటుంబం

ముదినేపల్లి, మార్చి 22(ఆంధ్రజ్యోతి):ఓ వైపు పేదరికం. మరోవైపు పెద్ద కుటుంబం. ఇది చాలదన్నట్టు వృద్ధులైన తల్లిదండ్రులు. తండ్రికి పక్షవాతం. దివ్యాంగులైన ఇద్దరు అక్కలు. భార్య, మూడేళ్లలోపు ఇద్దరు పిల్లలు. తనతో కలిసి ఎనిమిది మంది కుటుంబం. అతను రోజు కూలికి వెళితేనే కుటుంబం గడు స్తుంది. అలాంటి ఆ పేదింట పెనువిషాదం చోటు చేసుకుంది. కుటుం బానికి ఆధారమైన అతను అకస్మాత్తుగా చనిపోతే.. వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. అలాంటి పరిస్థితే ముదినేపల్లి మండలం సంకర్షణ పురంలోని ముత్యాల చక్రవర్తి(32) కుటుంబంలో చోటు చేసుకుంది. శుక్ర వారం పెనపుమల్లి వద్ద మినపకోత యంత్రం తనపై పడిపోవడంతో చక్రవర్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపగా, అతని కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. కూలి పనులు చేసుకునే చక్రవర్తి నాలుగేళ్ల క్రితం మౌనికతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. వీరితో పాటు పక్షవాతానికి గురై, మంచంపట్టిన తండ్రి కనకాంబరం, వృద్ధురాలైన తల్లి పుష్పరాణి బాగోగులు చూస్తున్నాడు. ముగ్గురు సోదరీమణులు. పెద్దామెకు పెళ్లి చేశాడు. ఆమె ఆలనా పాలనా ఇతనిదే. మిగిలిన ఇద్దరిలో ఒకరికి కళ్లు కనిపించవు, మరొకరు దివ్యాంగురాలు. వారి బాధ్యత చక్రవర్తిదే. ఈ పరిస్థితుల్లోనే చక్రవర్తిని మినప కోత మిషన్‌ రూపంలో మృత్యువు కబళించింది. కుటుంబం యావత్తు అనాథగా మారింది. ఎనిమిది మంది కుటుంబ సభ్యుల భారం ఎవరు మోస్తారన్నది ప్రశ్న. తండ్రిని పసితనంలోనే కోల్పోయిన ఇద్దరు పిల్లలను చూసిన వారికి హృదయం ద్రవించి, కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. శనివారం గ్రామంలో నిర్వహించిన చక్రవర్తి అంతిమయాత్రలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భవిష్యత్‌ అంధకారం..

‘నా భర్త చక్రవర్తిని అకస్మాత్తుగా కోల్పోవడంతో కుటుంబ భవిష్యత్తు అంధ కారంగా మారింది. ఇప్పుడు ఏం చేయాలో, పిల్లలను ఎలా ముందుకు తీసు కుని వెళ్లాలో అర్థం కావడం లేదు. నోట మాట రావడం లేదు’ అంటూ భార్య మౌనిక కన్నీటి పర్యంతమైంది. ‘నేను పక్షవాతానికి గురై మంచాన పడ్డాను. నాకు ఎంతో ప్రేమగా సపర్యలు చేసేవాడు. ఈ వయసులో మాకు కడుపుకోత మిగిల్చాడు. మా నుంచి దూరంగా వెళ్లిపోయావా చక్రవర్తీ..’ అంటూ తండ్రి కనకాంబరం బోరున విలపించాడు. ‘పేరుకు తమ్ముడే కాని తండ్రి కంటే ఎక్కువ. దివ్యాంగులమైన మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేవాడు. కంటికి రెప్పలా కాపాడేవాడు. తమ్ముడు లేడని తెలిసి ఏం చెప్పాలో.. అర్థం కావడం లేద’ంటూ అక్కలు చిన్నారి, ఏసమ్మ వెక్కివెక్కి ఏడ్చారు. ఈ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.

Updated Date - Mar 23 , 2025 | 12:49 AM

News Hub