Gachibowli: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను వేలం వేయొద్దు
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:21 AM
కంచ గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టిన 400 ఎకరాలు అటవీ భూమి అని, దానిని విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

అది అటవీ ప్రాంతం.. అందులో నేషనల్ పార్కు అభివృద్ధి చేయండి
బదలాయింపు జీవో 54ను కొట్టేయండి
హైకోర్టులో ‘వట ఫౌండేషన్’ పిల్ .. ప్రభుత్వానికి నోటీసులు జారీ
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టిన 400 ఎకరాలు అటవీ భూమి అని, దానిని విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. లాభాపేక్ష రహిత పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ‘వట ఫౌండేషన్’ ఈ పిల్ దాఖలు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ)కి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ 26న జీవో 54 జారీచేసింది. ఐటీ కంపెనీలు, మౌలిక సదుపాయాల కోసం ఇంటర్నేషనల్ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ సిద్ధం చేయాలని సూచించింది. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.75 కోట్లకు ఎకరం చొప్పున విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ భూమిని దశలవారీగా విక్రయించేందుకుగానూ ఇంటర్నేషనల్ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ సిద్ధం చేయడానికి టీజీఐఐసీ ఈ ఏడాది ఫిబ్రవరి 28న బిడ్లు ఆహ్వానించింది. ఈ ప్రక్రియను అడ్డుకోవడంతోపాటు అటవీ భూమిని విక్రయించకుండా నిలువరించాలని వట సంస్థ కోరింది.
ఈ పిటిషన్‌పై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అటవీ సంరక్షణ చట్టం - 1980కి విరుద్ధంగా ప్రభుత్వం అటవీభూమిని విక్రయించడానికి సిద్ధమైందని పేర్కొన్నారు. ఆ 400 ఎకరాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఎకోలాజికల్ సెన్సిటివ్ జోన్ కిందికి వస్తాయని.. అక్కడ చక్కటి జీవవైవిధ్యం ఉందని తెలిపారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 35 ప్రకారం ఆ ప్రాంతాన్ని జాతీయ పార్కుగా నోటిఫై చేయాలని కోరారు. భూమి బదలాయింపు జీవోను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. భూమి వేలం ప్రక్రియ ముందుకు సాగకుండా తక్షణం మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కోరారు. అయితే ప్రభుత్వ స్పందన తెలుసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం పది రోజులైన సమయం ఇవ్వాలని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.