Junior Students Assault: బెల్టుతో కొట్టి, కాళ్లతో తన్ని...!
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:13 AM
కర్నూలు జిల్లా కోడుమూరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌లో ఓ సీనియర్ విద్యార్థి, జూనియర్‌లపై దాడి చేశాడు. వారిపై విచక్షణా రహితంగా బెల్టుతో కొట్టి, కాళ్లతో తన్నుతూ దాడి చేసినట్లు సమాచారం.

జూనియర్లపై సీనియర్ విద్యార్థి విచక్షణారహిత దాడి
కర్నూలు జిల్లా కోడుమూరు ప్రభుత్వ హాస్టల్‌లో ఘటన
కోడుమూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): జూనియర్లపై ఓ సీనియర్ విద్యార్థి.. విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన.. కర్నూలు జిల్లా కోడుమూరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓర్వకల్లు మండలం తడకనపల్లె, గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడికి చెందిన ఇద్దరు విద్యార్థులు హాస్టల్‌లో ఉంటూ స్థానిక జడ్పీ హైస్కూల్‌లో 7,8 తరగతులు చదువుతున్నారు. కర్నూలు షరీఫ్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థి హాస్టల్‌లో అడ్మిషన్ లేకున్నా.. వార్డెన్ అండదండలతో అక్కడ ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. ఈ సీనియర్ విద్యార్థి ఈనెల 11న రాత్రి హాస్టల్లో నిద్రిస్తున్న బాధిత ఇద్దరు విద్యార్థులను గదిలోకి పిలిచి, తన మాట వినడం లేదంటూ వారిపై దాడి చేశాడు. బెల్టుతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ విచక్షణా రహితంగా దాడి చేశాడు.
పిల్లలిద్దరూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా వదల్లేదు. పైగా వారిని కొడుతూ ట్యాబ్‌లో వీడియో తీశాడు. అది సోమవారం స్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో డీఈవో శామ్యుల్ పాల్, సోషల్ వెల్ఫేర్ జేడీ రంగలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, కోడుమూరు సీఐ తబ్రేజ్ హాస్టల్ వద్దకు వెళ్లి విచారణ జరిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన విద్యార్థికి హాస్టల్‌లో సీటు లేకపోయినా ఉంచినందుకు వార్డెన్‌ను సస్పెండ్ చేశారు.
For AndhraPradesh News And Telugu News