Banjara Hills: టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:19 AM
బంజారాహిల్స్ ప్రాంతంలో ముంబై టీవీ నటిని బంధించి వేధింపులకు గురిచేయడమే కాకుండా నిలువు దోపిడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

షాప్ ఓపెనింగ్‌కు పిలిచి దారుణం
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
పోలీసుల అదుపులో నటి స్నేహితుడు
మంగళ్‌హాట్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్ ప్రాంతంలో ముంబై టీవీ నటిని బంధించి వేధింపులకు గురిచేయడమే కాకుండా నిలువు దోపిడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన నటి(30) గత 4 సంవత్సరాలుగా ముంబైలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గాయత్రి అనే మహిళ హైదరాబాద్ నగరంలో ఓ దుకాణం ప్రారంభోత్సవానికి ఎవరైనా నటిని పంపించాలని ముంబైలో ఉంటున్న తన స్నేహితుడు పంకజ్‌ని కోరింది. దీంతో పంకజ్ తనకు తెలిసిన టీవీ నటిని ఈ నెల 18న హైదరాబాద్ నగరానికి పంపించాడు. గాయత్రితో పాటు మరో స్నేహితురాలితో కలిసి నటికి మాసబ్ ట్యాంక్ శ్యామ్‌నగర్ కాలనీలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో బస ఏర్పాటు చేశారు.
ఈ నెల 21న ముగ్గురు యువకులు వస్తారని వారి కోరిక తీర్చాలని నటికి గాయత్రి చెప్పింది. నటి గదిలోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు తమ కోరిక తీర్చాలన్నారు. ఆమె నిరాకరించడంతో దాడి చేశారు. రక్షణ కోసం నటి అరవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఇలా ఉండగా గదిలో ఉన్న మరో ఇద్దరు యువతులు నటిని బంధించి నగదు, బంగారంతో అక్కడి నుంచి ఉడాయించారు. నటి తేరుకుని 100 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మాసబ్ ట్యాంక్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు గత 4 రోజులుగా కొత్త వ్యక్తుల రాకపోకలపై ఆరా తీశారు. పోలీసులు ముంబైకి వెళ్లి నటి స్నేహితుడు పంకజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.