Share News

KGBV: కేజీబీవీలపై విముఖత!

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:10 AM

Female education కస్తూర్బా బాలికా విద్యాలయాలు అనుకున్న లక్ష్యాలను సాధించలేక పోతున్నాయి. ప్రారంభంలో మెరుగైన విద్యాబోధన, వసతి అందించడంతో ఈ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థినులు ఆసక్తి చూపేవారు. కానీ క్రమేపీ పాఠశాలల నిర్వహణ అస్త వ్యస్తంగా మారడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి తగ్గుతోంది.

KGBV: కేజీబీవీలపై విముఖత!
ఇచ్ఛాఫురం కేజీబీవీ పాఠశాల

  • తరచూ వెలుగుచూస్తున్న లోపాలు

  • తగ్గుతున్న విద్యార్థినుల సంఖ్య

  • తాజాగా 6వ తరగతి, ఇంటర్‌లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

  • 2000 సీట్ల భర్తీకి సన్నాహాలు

  • ఈ నెల 11 వరకూ దరఖాస్తుల స్వీకరణ

  • ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా బాలికా విద్యాలయాలు అనుకున్న లక్ష్యాలను సాధించలేక పోతున్నాయి. ప్రారంభంలో మెరుగైన విద్యాబోధన, వసతి అందించడంతో ఈ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థినులు ఆసక్తి చూపేవారు. కానీ క్రమేపీ పాఠశాలల నిర్వహణ అస్త వ్యస్తంగా మారడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి తగ్గుతోంది. తాజాగా జిల్లా సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు ఆరో తరగతితోపాటు ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 7,8,9,10 తరగతు లకు సంబంధించి మిగులు సీట్లకు కూడా ఈ నెల 11 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే కొన్నేళ్లుగా పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కావడం లేదు. పాఠశాలల్లో వెలుగుచూస్తున్న లోపాలు కారణంగా కేజీబీవీలపై విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. జిల్లావ్యాప్తంగా 25 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. తొలుత 6 నుంచి పదో తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాలను కొన్నేళ్ల కిందట ఇంటర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. సంప్రదాయం కోర్సులతో పాటు ప్రత్యేక సాంకే తిక కోర్సులను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఎంపీసీ, బైపీ సీ, హెచ్‌ఈసీ, సీఈసీ, కంప్యూటర్‌, టాలీ వంటి వృత్తివిద్యా కోర్సులను ఏర్పాటు చేశారు. మంచి కోర్సులు ఉన్నా.. ఎక్కడా అధ్యాపకులను నియమించిన దాఖలాలు లేవు. పదో తరగతి వరకూ బోధించే సీఆర్టీలే ఇక్కడ అధ్యాపకులుగా బోధన సాగిస్తున్నారు. సబ్జెక్టుల వారీగా మహిళా ఉపాధ్యాయులు (సీఆర్టీలు)ను నియమించారు. నిరంతర వైద్య సేవల కోసం ఒక ఏఎన్‌ఎం సైతం అందుబాటులో ఉంటుంది. బోధనేతర సిబ్బంది, చివరకు స్వీపర్లు, వాచ్‌మెన్‌ సైతం మహిళలే ఉంటారు. బాలికా రక్షణకు పెద్దపీట వేస్తూ ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. చాలా మంది తల్లిదండ్రుల్లో అవగాహన లేక వీటిలో చేర్చడం లేదు. అలాగే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం, చాలా పాఠశాలల నిర్వహణలో సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో మరికొందరు విముఖత చూపుతున్నారు. ఈ ఏడాది ఆరో తరగతిలో ప్రవేశానికిగాను 25 పాఠశాలల్లో 40 సీట్లు చొప్పున మొత్తం వెయ్యి సీట్లు భర్తీ కావాల్సి ఉంది. ఇక ఇంటర్‌ కోర్సుకు సంబంధించి 40 సీట్లు లెక్కన మరో 1000 అడ్మిషన్లు చేయాల్సి ఉంది. కాగా ఇప్పటివరకూ 300 లోపే దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. గడువులోగా పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అవుతాయో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  • నిర్వహణ లోపాలు

  • కేజీబీవీల నిర్వహణలో తరచూ వైఫల్యాలు బయటపడుతున్నాయి. చాలా పాఠశాలలకు ప్రహరీలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కేజీబీవీలు ఏర్పాటు చేయడం కూడా ఇబ్బంది కరంగా మారింది. పాఠశాలల్లో పౌష్టికాహారంతో పాటు అన్నిరకాల వసతులు అందుబాటులోకి తెచ్చిన ట్టు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం చాలాచోట్ల ఇబ్బందులు ఉన్నాయి. మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. వంటల నిర్వహణలో నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. అందుకే తరచూ విద్యార్థినులు అనారోగ్యానికి గురికావాల్సి వస్తోంది.

  • గత ఏడాది జూలై 6న కోటబొమ్మాళి కేజీబీవీ పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థినులు అస్వస్థ తకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో వెంటనే పాఠశాల సిబ్బంది టెక్కలి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం అందించడంతో ప్రమాదం తప్పింది.

  • మార్చి 28న మందస కేజీబీవీలో 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మందస మండలంలోని గుడామణి రాజపురంలో కేజీబీవీని నిర్వహిస్తున్నారు. అయితే ఆ రోజు రాత్రిపూట ఆహారం తిన్న తరువాత విద్యార్థినులు వాంతులు, విరోచనాలు, కళ్లు తిరగడంతో వెనువెంటనే సిబ్బంది హరిపురం సీహెచ్‌సీకీ తరలించారు. వైద్యం అందించడంతో కోలుకున్నారు.

  • అవినీతి ఆరోపణలు..

  • సమగ్ర శిక్ష అభియాన్‌ పరిధిలో ఉండే ఈ పాఠశాలల్లో నిధుల ఖర్చు విషయంలో అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకాధికారుల ఖాతాల్లో నిధులు కొందరు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. దీంతో ప్రజాథనం వృథా అవుతుండగా.. ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. వాస్తవానికి పాఠశాలల్లో సీఆర్‌టీలు తప్పనిసరిగా ఉండాలి. రాత్రికి రోజుకొకరు చొప్పున రాత్రి విధులు నిర్వహించాలి. తప్పకుండా ప్రత్యేకాధికారి పాఠశాలలోనే ఉండాలి. కానీ చాలా పాఠశాలల ప్రత్యేకాధికారులు, సీఆర్‌టీలు సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చాలా పాఠశాలలకు ఇప్పటికీ ప్రత్యేకాధికారులు లేరు. ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. సీఆర్‌టీలు కూడా పూర్తిస్థాయిలో లేరు. ఇంటర్‌కు సంబంధించి అధ్యాపకులు కూడా తగినంతమంది లేరు.

Updated Date - Apr 07 , 2025 | 12:10 AM