Jagananna Colony: పెద్దలకే ఇళ్లు.. పేదలకు నిల్
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:52 AM
Jagananna Colony: ఇల్లు లేని ప్రతి పేదవాడికీ పట్టాతో పాటు ఇంటిని నిర్మించి ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

గత వైసీపీ ప్రభుత్వంలో అనర్హులకు గృహాలు మంజూరు
ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకే లబ్ధి
పూరి గుడిసెల్లో బతుకీడిస్తున్న ఎందరో పేదలు
ప్రభుత్వంపైనే ఆశలు
- మెళియాపుట్టి మండలం గోకర్ణపురం పంచాయతీ చిన్నాహంసకు చెందిన ధర్మాన కృష్ణారావు కుటుంబం గత 30 ఏళ్లుగా గ్రామంలోనే నివసిస్తోంది. ఇల్లు లేకపోవడంతో గ్రామ శివారులో ఉన్న ఓ చెట్టు కింద మట్టి గోడలతో గుడిసె వేసుకొని కృష్ణారావు కుటుంబ సభ్యులు జీవనం సాగిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు కోసం దరఖాస్తు చేసినా మంజూరు చేయలేదని కృష్ణారావు వాపోతున్నాడు. పెద్దోళ్లకే ఇళ్లు ఇచ్చారు తప్పా నాకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
- మెళియాపుట్టి మండలం కరజాడ గ్రామానికి చెందిన 44 మందికి గ్రామంలోని ఓ కొండ పక్క ఉన్న భూమిలో ఇళ్ల పట్టాలు అందించింది గత వైసీపీ ప్రభుత్వం. ఈ భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద అధిక ధరకు కొనుగోలు చేసింది. ఇక్కడ సౌకర్యాలు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులెవరూ ముందుకు రాలేదు. ఎందుకూ వినియోగపడని భూమిని జగన్ సర్కారు కొనుగోలు చేయడంపై విమర్శలు వచ్చాయి.
మెళియాపుట్టి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఇల్లు లేని ప్రతి పేదవాడికీ పట్టాతో పాటు ఇంటిని నిర్మించి ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చాలామంది పేదలకు ఇళ్లు మంజూరు కాలేదు. వారు దరఖాస్తు చేసినా తిరస్కరించారు. వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులకే అధికంగా గృహాలు మంజూరు చేశారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో జగనన్న కాలనీల పేరిట 790 లేఅవుట్లు వేశారు. 33,265 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరిలో చాలామంది అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదలకు బదులు పెద్దలకు పట్టాలు అందించినట్లు తెలుస్తోంది. మొత్తం 33,265 ఇళ్లకు గాను 10,153 గృహాలు పూర్తి చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. మరో 22,580 వరకు బేసిమెంట్ లెవల్‌లో ఉండగా, 532 గృహాల పనులు అసలు ప్రారంభించలేదు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 1,185 ఇళ్లు పూర్తిచేయగా, పాతపట్నంలో 323 నిర్మాణాలు మాత్రమే చేసినట్లు హౌసింగ్ అధికారులు తెలుపుతున్నారు. మెళియాపుట్టి పంచాయతీలో 152 ఇళ్లకు గాను 12 మాత్రమే పూర్తి చేశారు. 60 వరకు బేసిమెంట్ లెవల్‌లో ఉన్నాయి. మరో 80 పట్టాలకు సంబంధించి ఇంకా పనులు ప్రారంభించలేదు. ఇళ్లు ఉన్నవారికే పట్టాలు ఇవ్వడంతో చాలామంది ఆ స్థలాలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అధికంగా వైసీపీ నాయకులకు సంబంధించిన బంధువులకే ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
సౌకర్యాలు లేక.. నిర్మాణాలు సాగక..
జగనన్న కాలనీల్లో సౌకర్యాలు లేక ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. అధికంగా జగనన్న కాలనీలు శ్మశానవాటికల పక్కన, కొండల కింద, గ్రామాలకు దూరంగా ఉన్నాయి. చాలాచోట్ల విద్యుత్, తాగు నీటి సౌకర్యాల పేరుతో అధికంగా నిధులు ఖర్చు చేసినా పనులు మాత్రం పూర్తి కాలేదు. కొన్నిచోట్ల బోర్లు తవ్వినా నీరు మాత్రం రావటం లేదు. దీంతో ఇళ్ల నిర్మాణాలకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు.
దరఖాస్తు చేసుకోవాలి
ఇళ్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలి. గత ప్రభుత్వంలో పట్టాలు మంజూరై నిర్మాణాలు చేయకపోతే వాటిని రద్దు చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నాయి. గతంలో ఇళ్లు మంజూరు కాని వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
-నర్సింగరావు, డీఈ, హౌసింగ్ శాఖ, పాతపట్నం