Share News

Property tax: చివరి అవకాశం

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:49 AM

Property tax: జిల్లాలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఏకకాలంలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేవారికి 50 శాతం వడ్డీ రాయితీని కల్పించనుంది.

    Property tax: చివరి అవకాశం
ఆదివారం పన్నులు వసూలు చేస్తున్న సచివాలయ ఉద్యోగులు

- ఆస్తి పన్ను వడ్డీపై రాయితీ

-50 శాతం ఉపశమనం

- నేడు ఒక్కరోజే గడువు

ఇచ్ఛాపురం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఏకకాలంలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేవారికి 50 శాతం వడ్డీ రాయితీని కల్పించనుంది. ఇప్పటికే కట్టిన వారికి వడ్డీ 50 శాతం రాయితీని వచ్చే ఏడాది ఆస్తి పన్నులో జమచేయనుంది. నిజంగా ఇది జిల్లాలో పట్టణ స్థానిక సంస్థలకు శుభవార్తే. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాల్టీలు ఉన్నాయి. భారీగా ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. గత కొన్నేళ్లుగా ఆస్తి పన్ను పెండింగ్‌లో ఉంది. దీనికి తోడు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నులు చెల్లించాల్సిన వారు చాలామంది ఉన్నారు. గతంలో బకాయిలతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకమొత్తంలో కట్టిన వారికి ప్రభుత్వం ఈ రాయితీని అందించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో పట్టణ పన్నుదారులకు రూ.3.87 కోట్ల మేర ఉపశమనం కలగనుంది.


జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో నాలుగు పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. మార్చి 31తో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 78,071 అసెస్‌మెంట్ల ద్వారా రూ.45.37 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇందులో ఈ నెల 25 నాటికి రూ.28.11 కోట్లు వసూలైంది. రూ.17.26 కోట్లు పెండింగ్‌లో ఉంది. ఈ నెల 31తో గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం 50 శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది. ఇచ్ఛాపురం మునిసిపాల్టీకి రూ.55 లక్షలు, పలాస-కాశీబుగ్గకు రూ.90 లక్షలు, ఆమదాలవలసకు రూ.33 లక్షలు, శ్రీకాకుళం నగరపాలక సంస్థకు రూ.5.96 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ మొత్తం రూ.7.74 కోట్లకు 50 శాతం రాయితీ ద్వారా రూ.3.87 కోట్లు పన్నుదారులకు ఉపశమనం కలిగించనున్నారు. కాగా, ఆస్తి పన్ను వసూలుకు సంబంధించి అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సోమవారం కూడా ఇవి అందుబాటులో ఉండనున్నాయి. సోమవారం రంజాన్‌ సెలవు దినం అయినా.. పన్నుల వసూలుకు చివరి రెండు రోజులు కావడం.. వడ్డీ రాయితీ ప్రకటించడం...తదితర కారణాలతో ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ పనిచేయనున్నాయి. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.

వినియోగించుకోవాలి

ప్రభుత్వం పన్నుదారులకు 50 శాతం వడ్డీ రాయితీ కల్పించింది. గతంలో ఏకకాలంలో కట్టిన వారికి సైతం రాయితీ వర్తిస్తుంది. ఇప్పుడు బకాయిలు ఉన్న వారు కట్టినా రాయితీ వర్తింపజేస్తారు. పన్నుల వసూలుకు సంబంధించి కౌంటర్లు ఏర్పాటుచేశాం. పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

ఎన్‌.రమేష్‌. కమిషనర్‌, ఇచ్ఛాపురం మునిసిపాల్టీ

Updated Date - Mar 31 , 2025 | 12:49 AM