Share News

Stepmother Crime: చిన్నారిని గోడకేసి కొట్టి హత్య

ABN , Publish Date - Mar 31 , 2025 | 04:11 AM

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఓ సవతి తల్లి తన కవల పిల్లలను చిత్రహింసలు పెట్టింది. కార్తీక్‌ను గోడకేసి కొట్టి చంపగా, ఆకాశ్‌ను కాలుతున్న పెనంపై కూర్చోబెట్టింది. పోలీసుల జోక్యంతో కేసు నమోదైంది.

Stepmother Crime: చిన్నారిని గోడకేసి కొట్టి హత్య

సవతి తల్లి కర్కశం

కాలుతున్న పెనంపై కూర్చోబెట్టి మరో బిడ్డకు నరకం

గుంటూరు జిల్లా గొల్లపాలెంలో దారుణం

చిత్రహింసలపై చలించిపోయిన ఇరుగుపొరుగు

పోలీసులకు సమాచారం.. దంపతులపై కేసు

యడ్లపాడు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): సవతి బిడ్డలను చిత్రహింసలకు గురిచేయడంతోపాటు వారిలో ఒకరిని గోడకేసి కొట్టి హతమార్చిందో సవతి తల్లి. మరో బిడ్డను కాలుతున్న పెనంపై కూర్చోబెట్టిన నరకం చూపించింది. అయినా, ఈ అమానవీయ ఘటనలపై ఆ చిన్నారుల తండ్రి స్పందించలేదు. పిల్లల ఆర్తనాదాలకు చలించిపోయిన ఇరుగుపొరుగు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో జరిగిందీ దారుణం. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్‌ రాడ్‌ బెండింగ్‌ పనులు చేస్తుంటారు. ఆయనకు కృష్ణాజిల్లా జనగాం ప్రాంతానికి చెందిన అనూషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి తొలికాన్పులో కవలలు ఆకాశ్‌, కార్తీక్‌ జన్మించారు. రెండో కాన్పులో రెండేళ్ల క్రితం పాపకు జన్మనిచ్చిన మరుసటి రోజే అనూష మరణించారు. అనంతరం గొల్లపాలెం గ్రామానికి చెందిన లక్ష్మిని సాగర్‌ రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి 8 నెలల క్రితం పాప జన్మించింది. అనూషకు ద్వితీయ కాన్పులో కలిగిన పాపను యనమదల గ్రామస్థులకు దత్తత ఇచ్చారు. తమ వద్దే ఉంటున్న సాగర్‌, ఆకాశ్‌లను లక్ష్మి కొట్టడం, హింసించడం నిత్యకృత్యమైంది. సాగర్‌ మిన్నకుండిపోవడంతో లక్ష్మి మరింత రాక్షసంగా ప్రవర్తిస్తోంది. సుమారు నలభై రోజుల క్రితం వీరు కొండవీడు వదిలి గొల్లపాలెంకు మకాం మార్చారు. శనివారం ఉదయం సాగర్‌ పనికి వెళ్లగా, లక్ష్మి కవలలిద్దరినీ చిత్రహింసలకు గురిచేసింది. కార్తీక్‌(6)ను గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆకాశ్‌ను నిక్కరు ఊడదీయించి కాలుతున్న పెనంపై కూర్చోబెట్టి పైశాచికంగా ప్రవర్తించింది. ఈలోగా పిల్లల ఆర్తనాదాలు విన్న ఇరుగుపొరుగువారు ఫిరంగిపురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవీంద్ర అక్కడికి వచ్చేసరికే కార్తీక్‌ నిర్జీవంగా పడిఉన్నాడు. కాలిన గాయాలతో ఏడుస్తున్న ఆకాశ్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చిన్నారుల మేనత్త విజయ ఫిర్యాదు మేరకు లక్ష్మి, సాగర్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్తీక్‌ మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి కొండవీడులోని బంధువులకు అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 31 , 2025 | 04:11 AM