CEO Helps Employees Find New Jobs: ఈ బాస్ నిజంగా గ్రేట్.. 70 ఉద్యోగులను తీసేశాక..
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:03 PM
ఓ స్టార్టప్ సంస్థ యజమాని తన మానవత్వాన్ని చాటుకున్న తీరు నెటిజన్లను ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. లేఆఫ్స్‌లో 70 మందిని తొలగించాల్సి వచ్చినా వారికి కొత్త జాబ్స్ ఇప్పించానంటూ ఆ సంస్థ సీఈఓ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో సాఫ్ట్‌వేర్ సంస్థలు, స్టార్టప్‌లు ఉద్యోగులను అధిక సంఖ్యలో తొలగిస్తున్నాయి. సడెన్‌గా జాబ్ పోగొట్టుకుని అనేక మంది ఇక్కట్ల పాలవుతున్నారు. అయితే, లేఆఫ్స్ సమయంలో కూడా మానవత్వంతో ఎలా వ్యవహరించాలో చేతల్లో చూపించాడో సంస్థ యజమాని. ఆయన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి బాస్‌లు దొరకాలంటే పెట్టి పుట్టాలని అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు.
బెంగళూరులోని స్టార్టప్ సంస్థ ఓకేక్రెడిట్ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్ష్ పోఖర్నా.. తాము ఎలా లేఆఫ్స్ చేపట్టిందీ వివరించారు. లింక్డ్‌లో ఈ విషయమై ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘ఇటీవల మేము 70 మందిని తొలగించాము. ఖర్చులు ఎక్కువవుతుంటే తొలగించక తప్పలేదు. వేగంగా కొత్త ఉద్యోగులను మొదట్లో నియమించుకున్నాు. అది తప్పని తరువాత తెలిసింది. చేసిన తప్పునకు బాధ్యత తీసుకున్నాము. చివరకు తొలగింపులకు పూనుకున్నాము. ఓ సంస్థ ఫౌండర్‌గా నేను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయం ఇది. కానీ సరైన విధానంలో ఈ తొలగింపులు చేపట్టాము’’ అని సదరు సీఈఓ చెప్పుకొచ్చారు.
Also Read: గూగుల్‌లో వీటిని అస్సలు వెతకొద్దు.. చిక్కుల్లో పడతారు
మొత్తం 70 మందిని తొలగించినట్టు తెలిపారు. మూడు నెలల ముందుగానే వారికి లేఆఫ్ విషయంలో నోటీసులు ఇచ్చామని అన్నారు. కానీ వారికి కొత్త జాబ్స్ ఇప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిచామని అన్నారు. రిఫరెల్స్, ఇంట్రోస్, జాబ్ లీడ్స్ ఇలా రకరకాల ప్రయత్నాల ద్వారా 67 మందికి కొత్త జాబ్ దొరికేలా చేశామని అన్నారు. మరో ముగ్గురికి జాబ్ దొరక్కపోవడంతో రెండు నెలల జీతం అదనంగా ఇచ్చి పంపించామని తెలిపారు.
లేఆఫ్స్‌లో జాబ్స్ కోల్పోయే వారికి సాధారణంగా సంస్థలు కనీసం వ్యక్తిగతంగా ఫోన్ చేసి సమాచారం కూడా ఇవ్వవని సదరు సీఈఓ తెలిపారు. కేవలం ఈమెయిల్స్ ద్వారా అంటీముట్టనట్టు చెప్పి ఊరుకుంటారని అన్నారు.
Also Read: పెళ్లి చేసుకుంటే కలిగే ఆర్థిక ప్రయోజనాలు ఇవే
‘‘లేఆఫ్స్ సహజమే, కానీ ఉద్యోగం కోల్పోయి వారితో వ్యక్తిగతంగా కూడా రెండు సాంత్వన పలుగులు లేకుండా సాగనంపడం అమానవీయం. ఇలాంటి సంభాషణలు సంక్లిష్టమైనవే అయినా సంస్థలు తమ బాధ్యత నిర్వహించాలి’’ అంటూ తన వైఖరికి స్పష్టం చేశారు.
ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఉద్యోగుల బాగోగులపై సదరు సీఈఓకు ఉన్న శ్రద్ధ చూసి అనేక మంది ప్రశంసలు కురిపించారు. ఇలాంటి నాయకులే వ్యాపారా సామ్రాజ్యాలను నిర్మించగలరని అన్నారు. ఇలాంటి బాస్‌లు దొరకాలంటే పెట్టి పుట్టాలని మరికొందరు కామెంట్ చేశారు.