TCS Vishakhapatnam Operations: వెల్కమ్ టీసీఎస్
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:40 AM
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు విశాఖపట్నంలో 21.6 ఎకరాలు భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎకరాకు కేవలం 99 పైసల లీజు నిర్ణయించింది 1370 కోట్లతో టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తూ, 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.

టీసీఎస్‌కు రుషికొండలో 21.6 ఎకరాలు
ఎకరాకు 99 పైసల లీజు మాత్రమే
1370 కోట్లతో ఆపరేషన్స్ సెంటర్
12 వేల మందికి ఉద్యోగావకాశాలు
పలుమార్లు టాటా సన్స్ చైర్మన్‌తో చంద్రబాబు, లోకేశ్ చర్చలు
సొంత క్యాంపస్ ఏర్పాటుకు స్థలం కోరిన టీసీఎస్
మరిన్ని పెద్ద కంపెనీలను ఆకర్షించే అవకాశం
విశాఖపట్నం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎ్‌స)కు రాష్ట్ర ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచింది. టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు కోసం విశాఖపట్నంలో 21.6 ఎకరాల భూమిని కేటాయించింది. అది కూడా... ఎకరాకు కేవలం 99 పైసల అత్యంత నామమాత్రపు లీజు నిర్ణయించింది. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం... ఐటీలో మేటి కంపెనీగా ఉన్న టీసీఎ్‌సకు రుషికొండలో 21.6 ఎకరాలను కేటాయిస్తారు. దీనిని తొలుత ఉచితంగానే ఇవ్వాలని భావించినప్పటికీ... ‘ఎంతో కొంత’ మొత్తం లీజుగా ఉండాలన్న నిబంధన మేరకు, 99 పైసల నామమాత్రపు లీజు నిర్ణయించారు. ఒకరకంగా చెప్పాలంటే, ఇది పూర్తి ఉచితంగా ఇచ్చినట్లే. ఇప్పటిదాకా ఏ సంస్థకూ రాష్ట్రంలో ఇలా భూమి కేటాయించలేదు. విశాఖలో ఏర్పాటు చేయబోయే కేంద్రంలో టీసీఎస్ రూ. 1,370 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. దశల వారీగా 12 వేల నుంచి 15వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.
వరుస చర్చలు.. భేటీలు
విశాఖను ఆర్థిక, ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిని వాస్తవరూపంలోకి తీసుకొచ్చేందుకే... ఇప్పుడు టీఎ్‌సఎ్‌సకు నామమాత్ర ధరకు భూమి కేటాయించారు. చంద్రబాబు గత ఏడాది ఆగస్టులో ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత... అక్టోబరులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ముంబైలోని టాటా హౌస్‌లో చంద్రశేఖరన్‌తో చర్చలు జరిపారు. నవంబరులో చంద్రబాబు మరో విడత చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. విశాఖలో టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు కానుందని ప్రభుత్వ వర్గాలు అప్పుడే సంకేతాలు పంపించాయి. మరోవైపు... రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలికి కో-చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ఇదే క్రమంలో... ఇప్పుడు విశాఖలో టీసీఎ్‌సకు 21.6 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇతర కంపెనీలకు ‘ఆకర్షణ’గా...
విశాఖలో ఐటీ పరిశ్రమకు టీసీఎస్ ‘యాంకర్’గా పని చేస్తుందని... మరిన్ని ఐటీ కంపెనీలూ తరలి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉండగా సనంద్‌లో టాటా మోటార్స్‌కు చౌకగా స్థలం కేటాయించారు. ఆ తర్వాత సనంద్ ప్రఖ్యాత ఆటోమొబైల్ హబ్‌గా రూపుదిద్దుకుంది. ఇదే క్రమంలో... టీసీఎస్ రాకతో విశాఖ దేశంలోని ప్రముఖ ఐటీ హబ్‌లలో ఒకటవుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. నిజానికి, టీసీఎస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం హిల్ నంబరు 3లో మిలీనియం టవర్-ఏ, బీలను (సుమారు 2 లక్షల చ.అ. ప్లగ్ అండ్ ప్లే స్థలం) కేటాయించింది. అది ఆర్థిక మండలి పరిధిలో ఉండడంతో డీనోటిఫై చేసే ప్రక్రియ మొదలైంది. అయితే... తమ కార్యకలాపాలకు ఈ ప్రాంగణం సరిపోదని, సొంతం క్యాంపస్ ఏర్పాటుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని టీసీఎస్ కోరింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ అదే కొండపై 21.16 ఎకరాలు కేటాయించింది. అక్కడ శాశ్వత భవనాలు నిర్మించేలోగా... మిలీనియం టవర్-ఏ, బీ నుంచే టీసీఎస్ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. బహుశా... రెండు మూడు నెలల్లోనే ఇందుకు శ్రీకారం చుట్టే అవకాశముంది. అలాగే... విశాఖ టెక్ సిటీగా ఎదిగేందుకు దోహద పడేలా పలు ఐటీ సంస్థలకు భూముల కేటాయింపునకు కూడా మంగళవారం కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Dy Collectors Transfer: భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే..
National Herald Case: ఈడీ ఛార్జ్‌షీట్లో సోనియా, రాహుల్ పేర్లు
BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త
Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..
PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
Hyderabad Summit:హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ..
For AndhraPradesh News And Telugu News