Share News

తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కస్తూరిబాయి రాజీనామా

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:05 AM

ఎట్టకేలకు అనేక రాజకీయ పరిణామాల మధ్య తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి తన పదవికి రాజీనామా చేశారు. ‘పై నుంచి భగవంతుడు చూస్తున్నాడు. నాకు అన్యాయం చేసిన వాళ్లని ఆయనే చేసుకుంటాడు’ అంటూ భావోధ్వేగంతో మాట్లాడారు.

తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కస్తూరిబాయి రాజీనామా

-మున్సిపల్‌ కమిషనర్‌కు రాజీనామా పత్రం అందజేత

- అన్యాయం చేసిన వాళ్లని ఆ దేవుడే చూసుకుంటాడంటూ భావోద్వేగం

- వివాదం సద్దుమణుగుతుందా ? కొత్త వివావాదం తలెత్తుతుందా?

తిరువూరు, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి):

ఎట్టకేలకు అనేక రాజకీయ పరిణామాల మధ్య తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి తన పదవికి రాజీనామా చేశారు. ‘పై నుంచి భగవంతుడు చూస్తున్నాడు. నాకు అన్యాయం చేసిన వాళ్లని ఆయనే చేసుకుంటాడు’ అంటూ భావోధ్వేగంతో మాట్లాడారు. గురువారం జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కస్తూరిబాయి తన పదవికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్‌ కమిషనర్‌ లోవరాజుకు ఆయన చాంబర్‌లో తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కస్తూరిబాయి మాట్లాడుతూ 2021లో వైపీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి మాల సామాజిక వర్గానికి చెందిన తనను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ప్రకటించారని తెలిపారు. అప్పటి స్థానిక ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి తన పట్ల ద్వేషంతో ఐక్యంగా ఉన్న కౌన్సిలర్ల మధ్య చిచ్చుపెట్టారని ఆరోపించారు. తిరువూరు పట్టణంలో డ్రెయిన్ల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ను రూపొందించకుండా అడ్డుపడి, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.4 కోట్లు నిధులు వెనక్కి వెళ్లేందుకు అప్పటి ఎమ్మెల్యేనే కారణమన్నారు. ఎవరెన్ని ఇబ్బందులకు గురి చేసినా పట్టణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశానని తెలిపారు. ఈ నాలుగేళ్లలో సుమారు రూ.20 కోట్లపైగా అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కొత్త వివాదం తెరపైకి వస్తుందా!

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాజీనామాతో వైసీపీ కౌన్సిలర్ల మధ్య నెలకొన్న వివాదం సర్దుమణుగుతుందా! లేక మరో కొత్త వివాదం తెరపైకి వస్తుందా అనే అనుమానం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నాటి ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల తదుపరి చైర్‌పర్సన్‌తో పాటు వైస్‌ చైర్‌పర్సన్లు రాజీనామా చేసి కొత్తవారికి అవకాశం కల్పించాలని అప్పట్లో స్థానిక వైసీపీ పెద్దలు నిర్ణయించారు. గత కొంతకాలంగా చైర్‌పర్సన్‌ రాజీనామా డిమాండ్‌తో కొందరు వైసీపీ కౌన్సిలర్లు సమావేశాలకు గైర్హాజరవ్వడం, సమావేశాలకు హాజరైనా బోర్డుకు సహకరించక పోవడం వంటివి చేశారు. ఎట్టకేలకు చైర్‌పర్సన్‌ రాజీనామా చేయడంతో నాటి ఒప్పందం ప్రకారం వైస్‌చైర్మన్లను కూడా మార్చాలని వైసీపీ కౌన్సిలర్లు డిమాండ్‌ చేసే అవకాశం ఉంది.

సంవత్సరం పాలన కుంటుపడేశారు..

ప్రజలు వైసీపీకి ఐదేళ్లు అధికారం ఇస్తే పదవి కోసం కుమ్ములాడుకుంటూ ప్రజా సమస్యలు, అభివృద్ధిని విస్మరించారని టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ షేక్‌ అబ్దుల్‌ హుస్సేన్‌ విమర్శించారు. బోర్డు పాలన మరో సంవత్సరం మాత్రమే ఉందని చెప్పారు. ఇప్పుడు చైర్‌పర్సన్‌ రాజీనామా చేయడం వల్ల తిరిగి మరొకర్ని చైర్‌పర్సన్‌గా ఎన్నుకునేందుకు ఎంతకాలం పడుతుందోనన్నారు. అప్పటి వరకు పాలన కుంటుపడుతుందని వివరించారు.

Updated Date - Apr 04 , 2025 | 01:05 AM