Share News

Tirumala Tirupati Devasthanams: శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ

ABN , Publish Date - Mar 25 , 2025 | 04:02 AM

TTD బోర్డు భక్తుల సేవలను మెరుగుపరిచేలా గూగుల్‌ ఏఐ సహాయంతో దర్శన సమయాన్ని తగ్గించే చర్యలు చేపట్టింది. భూముల పరిరక్షణ, ఆలయ విస్తరణ, ధార్మిక కార్యక్రమాల కోసం కొత్త నిధులు మరియు విధానాలు అమలు చేయాలని నిర్ణయించింది.

Tirumala Tirupati Devasthanams: శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ

రూ.5,258.68 కోట్ల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్‌

టీటీడీలో ఉద్యోగులంతా హిందువులే అయి ఉండాలి

వెంకన్నకు హుండీ ద్వారానే అత్యధిక ఆదాయం

పాత ఆగమ సలహా మండలి రద్దు.. త్వరలో నూతన సలహా మండలి

దేశ, విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం కొత్తగా ట్రస్టు

టీటీడీ తీర్మానాలు.. వెల్లడించిన చైర్మన్‌ బీఆర్‌ నాయుడు

తిరుమల, మార్చి 24(ఆంధ్రజ్యోతి): శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులు పరిరక్షించడం, సద్వినియోగపరచడం లక్ష్యంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ బీఆర్‌ నాయుడు చెప్పారు. శ్రీవారి పవిత్రమైన భూమిలో ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. న్యాయస్థానాల్లో ఉన్న స్వామి ఆస్తుల వివాదాల విచారణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ రూ.5,258.68 కోట్ల్ల అంచనాలతో ఆమోదించినట్లు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అనంతరం ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మరికొంతమంది సభ్యులతో కలిసి బీఆర్‌ నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. టీటీడీ ఆదాయాల్లో అత్యధికం హుండీ ద్వారానే సమకూరుతోందని తెలిపారు. 2025-26లో హుండీ ద్వారా రూ.1,729 కోట్లు రావచ్చని బడ్జెట్‌లో అంచనా వేశామన్నారు. అలాగే పెట్టుబడులపై వడ్డీ ద్వారా రూ.1,310 కోట్లు రావచ్చని పేర్కొన్నారు. ప్రసాదాల అమ్మకాలపై రూ.600కోట్లు, దర్శన టికెట్ల విక్రయం ద్వారా రూ.310 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా రూ.176.50కోట్లు, ఆర్జితసేవల నుంచి రూ.130కోట్లు, అద్దె గదులు, కల్యాణ మండపాలు ద్వారా రూ.157 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు చైర్మన్‌ వివరించారు. ఇక ఖర్చుల్లో ప్రధానంగా.. ఇంజినీరింగ్‌ పనులకు రూ. 350 కోట్లు, మెటీరియల్‌ కొనుగోళ్లకు రూ.768.50 కోట్లు, కార్ఫస్‌ అండ్‌ ఇన్వ్‌స్టమెంట్స్‌కు రూ.800 కోట్ల అంచనా వేశామని చైర్మన్‌ వివరించారు.


టీటీడీకి గూగుల్‌ ఏఐ సేవలు

శ్రీవారి దర్శన సమయాన్ని తగ్గించే అంశంపై ఏఐ సేవలు అందించేందుకు గూగుల్‌ సంస్థ ముందుకు వచ్చిందని బీఆర్‌ నాయుడు తెలిపారు. వారి సహకారంతో ఫిజికల్‌ క్యూలైన్‌ను తగ్గించడం, వివిధ విభాగాల్లో ముఖ ఆధారిత గుర్తింపు వ్యవస్థను అమలు చేయడం వంటివి చేయాలని బోర్డు నిర్ణయించిందని చెప్పారు.

టీటీడీ తీసుకునే భూముల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే!

ఇటీవల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సీఎం చంద్రబాబు సూచనల మేరకు బోర్డులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. ముంతాజ్‌ హోటల్‌కు భూ కేటాయింపుల అంశం వివాదమైన నేపథ్యంలో ఏడు కొండలకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో భవిష్యత్తులో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరగరాదనే కోణంలో చర్యలకు ఉపక్రమించామని చెప్పారు. ఇందులో భాగంగా కొండ అంచున ఉన్న 35.25 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ఏపీ టూరిజం పరిధిలో ఉన్న మరో 15 ఎకరాల భూమిని టీటీడీ స్వాధీన పరుచుకుని, బదులుగా టీటీడీకి చెందిన 50 ఎకరాల స్థలాన్ని అందజేస్తామన్నారు. టీటీడీ తీసుకునే భూముల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే జరిగేలా ధార్మిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని చెప్పారు. టీటీడీలో పనిచేస్తున్నవారందరూ హిందువులే అయిండాలని మరోసారి తీర్మానం చేశామన్నారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ఇప్పటికే ఆయా రాష్ర్టాల సీఎంలకు లేఖలు రాశామని, చాలా మంది సానుకూలంగా స్పందించారని తెలిపారు. స్పందించని వారితో స్వయంగా మాట్లాడతానని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. దేశ, విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం నూతన ట్రస్టు ఏర్పాటు చేస్తామని బీఆర్‌ నాయుడు తెలిపారు.


బ్లాక్‌ లిస్టు.. రద్దు!

అన్నప్రసాదాలకు ఆర్గానిక్‌ ఉత్పత్తులకు సరఫరా చేస్తామని ముందుకు వచ్చిన శ్రీనివాస సేవా సమితి నాసిరకం పదార్థాలను పంపినందున ఆ సంస్థను బ్లాక్‌లి్‌స్టలో పెట్టామని చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. వారికి గతంలో ఇచ్చిన 25,500 టికెట్లకు సంబంధించిన కూపన్లను రద్దు చేస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. గతంలో ఏర్పడిన ఆగమ సలహా మండలి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు తమ దృష్టికి వచ్చినందున దానిని రద్దు చేసి, నూతన ఆగమ సలహామండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చైర్మన్‌ వెల్లడించారు.

మరికొన్ని నిర్ణయాలు..

కొడంగల్‌, కరీంనగర్‌, ఉపమాక, అనకాపల్లి, కర్నూల్‌, ధర్మవరం, తలకోన, తిరుపతి గంగమ్మ ఆలయాల పునఃనిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం.

తిరుపతిలో సైన్స్‌ సిటీ, మ్యూజియంలకు గతంలో కేటాయించిన 20 ఎకరాల భూమి అనుమతులు రద్దు.

వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లోనూ శ్రీవారి దర్శనం కల్పించేలా సాధాసాధ్యాలను పరిశీలించాలని నిర్ణయం.

ప్రస్తుతం 10 గంటలకు మొదలవుతున్న వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని ఉదయం 5.30 గంటలకు మార్చే అంశం పరిశీలనకు నిర్ణయం.

రాష్ట్రంలోని చిన్న పట్టణాలు, గ్రామాలు, దళితవాడల్లో ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన దేవాలయాలనూ, శిథిలావస్థకు చేరిన దేవాలయాల జీర్ణోద్ధరణకు నిర్ణయం. నూతన ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం.

టీటీడీ శాశ్వత ఉద్యోగుల సిఫారసు లేఖలపై మూడునెలలకోసారి సుపథం ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం.


ఈ వార్తలు కూడా చదవండి..

YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 04:02 AM