Yellow Festival పసుపు పండుగ
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:13 AM
Yellow Festival ఎటు చూసినా పసుపు జెండాలు, పసుపు చొక్కాలతో తమ్ముళ్లు, మెడలో కండువాలు.. టీడీపీ జెండా ఆవిష్కరణలు.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలు, సేవా కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం జిల్లాలో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఓ పండుగలా జరుపుకున్నారు.

పసుపు పండుగ
టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఉత్సాహంగా తెలుగు తమ్ముళ్లు
విజయనగరం రూరల్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఎటు చూసినా పసుపు జెండాలు, పసుపు చొక్కాలతో తమ్ముళ్లు, మెడలో కండువాలు.. టీడీపీ జెండా ఆవిష్కరణలు.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలు, సేవా కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం జిల్లాలో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఓ పండుగలా జరుపుకున్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. జై ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అమరహే.. అంటూ తెలుగుతమ్ముళ్లు నినాదాలు చేశారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రసాదుల కనకమహాలక్ష్మీ తదితరులు హాజరయ్యారు. వేడుక సందర్భంగా ఎంపీకి టీడీపీ గుర్తు సైకిల్‌ను అశోక్‌గజపతిరాజు బహుమతిగా ఇచ్చారు. నగరంలోని 13వ డివిజన్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఐవీపీ రాజు, విజ్జపు ప్రసాద్, కనకల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం.. ప్రజల పక్షం
పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు
అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించాక ఆయన ఆశయ సాధనకు నేటికీ కృషి జరుగుతోందని, తెలుగు జాతి ఉన్నంత వరకూ టీడీపీ వర్థిల్లుతూనే ఉంటుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు అన్నారు. 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన ఉండడం వల్లే ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారని తెలిపారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, తన లాంటి ఎంతో మంది కార్యకర్తలను టీడీపీ ఆదరించిందని, ఎంపీగా ఉన్నానంటే సామాన్య కార్యకర్తకు టీడీపీ ఇచ్చిన గౌరవమేనని అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలే బలమన్నారు. ఎమ్మెల్యే అదితిగజపతిరాజు మాట్లాడుతూ, ఎన్టీఆర్ సిద్ధాంతాలు, ఆశయ సాధన కోసం నిత్యం కృషి జరుగుతున్నదన్నారు.
రాష్ట్ర స్థాయికి ఎదగాలి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం,మార్చి29:(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు నిరంతరం కష్టపడతారని, వారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ 43 ఏళ్ల ప్రస్థానంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన జెండాను దించ కుండా పార్టీకి కాపుకాసింది కార్యకర్తలేనని అన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారని, పేదరికం లేని సమాజమే లక్ష్యంగా 2047 విజన్ తీసుకొచ్చారని చెప్పారు. అనంతరం పదిమంది సీనియర్ కార్యకర్తలను సత్కరించారు.
- నియోజకవర్గ పరిస్థితిపై మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 90శాతం బాగున్నప్పటికీ మిగిలిన పదిశాతం కూడా మెరుగుపడాలని చెప్పారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వందశాతం విజయం సాధించే లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కొండపల్లి కొండలరావు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.