Bank: బ్యాంక్ ఖాతా తెరిచి.. రూ.5వేలు ఇచ్చి
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:18 AM
New Account Opening ఐపీఎల్ బెట్టింగ్‌ల వేళ.. పలాసలో ఓ మాఫియా కొత్త తరహా ఆగడాలు వెలుగుచూశాయి. ఆ ముఠా సభ్యులు.. చదువుకుంటున్న యువతను టార్గెట్ చేసి.. వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి.. ఆపై రూ.5వేలు చొప్పున అందజేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

పలాసలో కొత్త తరహా మాఫియా
యువతే టార్గెట్‌గా అకౌంట్లు ప్రారంభం
ఆపై తాయిలాలు అందజేస్తున్న ముఠా సభ్యులు
బెట్టింగ్, అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారనే అనుమానాలు
ఆరా తీస్తున్న పోలీసులు
పలాస, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ బెట్టింగ్‌ల వేళ.. పలాసలో ఓ మాఫియా కొత్త తరహా ఆగడాలు వెలుగుచూశాయి. ఆ ముఠా సభ్యులు.. చదువుకుంటున్న యువతను టార్గెట్ చేసి.. వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి.. ఆపై రూ.5వేలు చొప్పున అందజేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు, అసాంఘిక కార్యక్రమాలకు ఈ అకౌంట్లు ప్రారంభించి దాని ద్వారా నగదు బదిలీకి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. వివరాల్లోకివెళితే.. సాధారణంగా యువకులు బ్యాంకు ఖాతా ప్రారంభించాలంటే వారి తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. లేదా వారు విద్యా రుణం తీసుకోవడానికైనా ఉండాలి. కానీ పలాస-కాశీబుగ్గలో ఇటీవల చదువుతున్న యువకుల బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు ఒక ముఠా తయారైంది. ఆ ముఠాసభ్యులు యువతను మచ్చిక చేసుకున్నారు. వారి నుంచి ఆధార్ కార్డు జిరాక్స్‌లు, పాస్‌ఫొటోలు తీసుకుని వారి పేరిట జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించించారు. ఆపై తాయిలాల కింద రూ.5వేలు ఇస్తున్నారు. యువత ఎందుకని ప్రశ్నించగా.. అది మీకు అనవసరం.. మీకు డబ్బులు ఇస్తున్నామా..లేదా..! అని బుకాయిస్తున్నారు. యువతతో ఖాతాలు ప్రారంభించి సంబంధిత పుస్తకాలు వారివద్దే ఉంచుకుంటున్నారు. ఉచితంగా రూ.5వేలు వస్తుండడంతో చాలా మంది యువత బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా.. ఐపీఎల్ క్రికెట్ జరుగుతుండడం, ఆన్‌లైన్ బెట్టింగులు జోరందుకుంటున్న నేపఽథ్యంలో యువకుల బ్యాంకు ఖాతాల ద్వారా నగదు బదిలీ చేసుకొని లబ్ధి పొందాలని ముఠా సభ్యులు యోచిస్తున్నట్లు సమాచారం. విశాఖపట్నం కేంద్రంగా ఈ బెట్టింగు వ్యవహారం నడుస్తుండగా అక్కడ మూలాలు కదిపితే పలాస-కాశీబుగ్గ యువకుల బ్యాంకు ఖాతాల వ్యవహారం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలో క్రికెట్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, రమ్మీ వంటి యాప్‌ల ద్వారా రూ.లక్షలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల బ్యాంకు ఖాతాల వ్యవహారం వెలుగు చూడడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. ఎంతమంది యువకులు బ్యాంకు ఖాతాలు ప్రారంభించారో ఆరా తీస్తున్నారు. వారి ఖాతాలకు నగదు జమయిందా లేదా అనే విషయం వెలుగు చూడాల్సి ఉంది. అయితే బెట్టింగ్‌తో పాటు అసాంఘిక కార్యక్రమాలకు కూడా బ్యాంకు ఖాతాలు వినియోగించే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఖాతాలు ప్రారంభించడానికి ఎవరు చర్యలు తీసుకుంటున్నారు? ఆ ఖాతాలు ఎవరివి అనే విషయాలు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తే మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది.
విచారణ చేస్తున్నాం
బ్యాంకు ఖాతాలకు సంబంధించిన విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించాం. ఇప్పటికే 15మందిని విచారణ చేశాం. ఎందుకు యువకుల బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తున్నారు.. వారు ఎవరనేది పరిశీలిస్తున్నాం. దీనిపై నిఘా పెట్టాం. ఫేక్‌ఖాతాలుగా గుర్తించాం. క్రికెట్ బెట్టింగ్ కోసమే ఈ ఖాతాలు తెరిచినట్టు అనుమానాలు ఉన్న నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వారం రోజుల్లో బ్యాంకు ఖాతాల మిస్టరీ ఛేదిస్తాం.
- వి.వెంకట అప్పారావు, కాశీబుగ్గ డీఎస్పీ