Share News

Andhra Pradesh politics: వంశీకి నో బెయిల్‌

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:47 AM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు బెయిల్ నిరాకరించడంతో పాటు ఏప్రిల్ 8 వరకు రిమాండ్‌ను పొడిగించారు. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో వంశీకి బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

Andhra Pradesh politics: వంశీకి నో బెయిల్‌

సత్యవర్థన్‌ కేసులో పిటిషన్‌ తిరస్కృతి

జేడీ, ఐవోకు నోటీసులు జారీ చేసిన కోర్టు

వచ్చే నెల 9 వరకు రిమాండ్‌ పొడిగింపు

భూముల కేసులో పోలీసు కస్టడీకి అనుమతి

నేడు కస్టడీకి తీసుకోనున్న ఆత్కూరు పోలీసులు

విజయవాడ/గన్నవరం, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): విజయవాడ జిల్లా జైలులో విచారణ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీమోహన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదిదారుడు ముదునూరి సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం తిరస్కరించింది. బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో శుక్రవారం విచారణ జరిగింది. దీనిపై ప్రాసిక్యూషన్‌, వంశీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయాధికారి హిమబిందు బెయిల్‌ మంజూరు చేయలేమని తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్స్‌ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసినట్టు వెల్లడించారు.

ఇద్దరికి నోటీసులు

తీర్పు సందర్భంగా న్యాయస్థానంలో కీలక పరిణామం జరిగింది. ప్రాసిక్యూషన్‌ తరపున వాదనలు వినిపించిన జాయింట్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, కేసు దర్యాప్తు అధికారి(విజయవాడ సెంట్రల్‌ ఏసీపీ) కె. దామోదరరావుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వాదనల సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ కొన్ని అదనపు అంశాలను కోర్టుకు చెప్పాలని అడిషనల్‌ సబ్‌మిషన్స్‌ను దాఖలు చేశారు. న్యాయస్థానంలో కేసు విచారణ సమయంలో జరుగుతున్న పరిణామాలపై వ్యాఖ్యలు చేస్తూ అడిషనల్‌ సబ్‌మిషన్స్‌ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు అధికారి కె. దామోదరరావు తరపున దీన్ని కోర్టుకు ఇచ్చారు. దీనిపై న్యాయాధికారి హిమబిందు దర్యాప్తు అధికారి దామోదరరావును కోర్టుకు పిలిపించారు. అదేవిధంగా ప్రాసిక్యూషన్‌ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్‌ హాజరయ్యారు. అదనపు పత్రాల్లో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉంటున్నారా? అని న్యాయాధికారి హిమబిందు వారిని అడిగారు. దానికి ఇద్దరూ కట్టుబడి ఉంటున్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు గల కారణాలను తెలియజేయాలని కోరుతూ వారికి నోటీసులు జారీ చేశారు.


రిమాండ్‌ పొడిగింపు

సత్యవర్థన్‌ అపహరణ, దాడి కేసులో వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విధించిన రిమాండ్‌ గడువు ముగియడంతో వంశీని పోలీసులు విజయవాడలోని సీఐడీ కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. వంశీతోపాటు మరో నిందితుడు నిమ్మ లక్ష్మీపతిని కూడా కోర్టుకు తీసుకొచ్చారు. ఈ ఇద్దరికీ వచ్చే నెల 9 వరకు రిమాండ్‌ పొడిగిస్తున్నట్టు న్యాయాధికారి తిరుమలరావు ఆదేశాలు ఇచ్చారు.

ఒకరోజు కస్టడీకి అనుమతి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీని ఒక రోజు పోలీసు కస్టడీకి ఇస్తూ గన్నవరం కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన కాంట్రాక్టర్‌ శనగల శ్రీధర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు వంశీపై గతంలోనే కేసు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలు చేసి, బెదిరించి, కుట్రపూరితంగా నకిలీ పత్రాలు సృష్టించి ఒకరి భూమిని మరొకరి దక్కేలా చేశారని శ్రీధర్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తనకు చెందాల్సిన ఆస్తి దక్కకుండా అన్యాయం చేశారని వివరించారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు 5 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు గన్నవరం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి ఒకరోజు కస్టడీకి అనుమతించారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. విచారణ అనంతరం కోర్టులో హాజరు పరిచి అక్కడి నుంచి విజయవాడ జైలుకు అప్పగించాలని పేర్కొన్నారు. దీంతో విజయవాడ జైల్లో ఉన్న వంశీని ఆత్కూరు పోలీసులు శనివారం తమ కస్టడీకి తీసుకోనున్నారు. మరోవైపు ఇదే కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వంశీ వేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది.


Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 29 , 2025 | 04:47 AM